తపస్కాల మూడవ వారము - మంగళవారం (II)

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల మూడవ వారము - మంగళవారం
దానియేలు 3:25; 34-43; మత్త 18:21-35 

ధ్యానాంశము: క్షమాధర్మములు

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "ఏడు కాదు, ఏడు డెబ్బది పర్యాయములు క్షమింపవలెను అని యేసు సమాధాన మిచ్చెను" (మత్త 18:22).

ధ్యానము: నేటి సువార్తలో యేసు క్షమాధర్మముల గురించి బోధిస్తున్నారు. క్షమించడం అనగా చేసిన పాపము, తప్పునుండి ఒక వ్యక్తికి విడుదలను, మన్నింపును ఇవ్వడం. ప్రతీకారాన్ని వదులుకోవడం! బైబిలులో ఐదు రకాల క్షమాపణ గురించి చెప్పబడినది: మొదటిగా, "శాశ్వత క్షమాపణ" - క్రీస్తునందు విశ్వాసము వలన పాపములు క్షమింపబడును. క్రీస్తు రక్తము వలన మనము విముక్తుల మైతిమి; ఆయన కృపైశ్వర్యములచే మన పాపములు క్షమింప బడినవి (అ.కా. 26:18; ఎఫె. 1:7). రెండవదిగా, "తండ్రి క్షమాపణ" - తండ్రి దేవునితో సహవాసాన్ని పునరుద్ధరించుకోవడం. దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో, ఆయన మన పాపములను క్షమించును. మన పాపములను దేవుడు శుద్ధిచేయనిచో, ఆయనతో మనకు భాగము ఉండదు (1 యోహాను 1;9; యోహాను 13:4-10). మూడవదిగా, "వ్యక్తిగత క్షమాపణ" - ఇతరులతో మన సహవాసాన్ని పునరుద్ధరించు కోవడం. ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే, పరులు చేసిన దోషములను మీరు క్షమించిన యెడల, పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమించని యెడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు (మత్త. 6:14-15). నాలుగవదిగా, "సామాజిక క్షమాపణ" - ఇది సమాజముతో మన సహవాసాన్ని పునరుద్ధరించు కోవడం (వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ, యోహాను 8:1-10). ఐదవదిగా, "శ్రీసభ క్షమాపణ" - ఇది శ్రీసభతో సహవాసాన్ని పునరుద్ధరించు కోవడం. సంఘములో (శ్రీసభ) ఎవరైనా ఒకవ్యక్తి పట్ల దోషము చేసినచో, అది కేవలము ఆ వ్యక్తిపట్ల మాత్రమేగాక, కొంతమట్టుకు అందరకు దోషము చేసినట్లగును. అట్టి వ్యక్త్తిని క్షమించి ఓదార్చవలెను. ఆ వ్యక్తితో మరల ప్రేమపూర్వకంగా వ్యవహరింప వలెను (2 కొరి. 2:5-11).

యూదులు క్షమించడం ఒక విధిగా భావించేవారు మరియు క్షమించడం మతపరమైన జీవితములో ఒక భాగం. ఉదాహరణకు, సీరా. 28:2 - "నీవు తోడి నరుని అపరాధములను మన్నించినచో, నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీ అపరాధములను మన్నించును." అయితే, తోటివారిని ఎన్నిసార్లు క్షమించాలి? ఓ నాలుగు సార్లు క్షమిస్తే సరిపోతుందని యూదులు భావించేవారు! అందుకే, నేటి సువార్తలో, పేతురు యేసు వద్దకు వచ్చి, "ప్రభూ! నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండ నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? ఏడు పర్యాయములా?" (18:21) అని అడిగాడు. ఆ కాలములో యూదులు నాలుగు సార్లు క్షమిస్తే సరిపోతుందని భావించేవారు కాబట్టి, పేతురు ఇంకో మూడుసార్లు ఎక్కువగా చెబుతూ ప్రభువును ప్రశ్నించాడు. యూదులకు ఏడు సంఖ్య పరిపూర్ణతకు సూచన కనుక, ఏడుసార్లు సరిపోతుందని పేతురు భావించాడు. కాని యేసు, "ఏడు కాదు, ఏడు డెబ్బది పర్యాయములు క్షమింపవలెను" (మత్త 18:22) అని సమాధాన మిచ్చారు. దీనిభావం ఏమిటంటే, పరిమితులు లేకుండా మనం ఇతరులను క్షమించాలి. క్షమాపణ అనేది ప్రేమకు సంబంధించిన విషయం, ఎన్నిసార్లు అని కాదు! పశ్చాత్తాపముతో క్షమించమని అడిగిన వారిని ఎన్నిసార్లయినా క్షమించడానికి సిద్ధముగా ఉండాలి.

క్షమించడం అంత సులువైన విషయం కాదు. గతములో అవమానాలు, అనుమానాలు, తిరస్కరణలు, ఛీత్కారాలు, మోసం, అపనమ్మకం...మొ.గు. వానిని అనుభవించిన మనం ఇతరులను క్షమించడం అంత సులువైన విషయం కాదు. కానీ, క్షమాపణ మనకు ఎంతో అవసరం. మనం క్షమించ బడాలంటే, మనం కూడా క్షమించాలి. ప్రార్ధనద్వారా క్షమించడం సులువవుతుంది. క్షమాపణ స్వస్థతను, మనసుకు శాంతిని కలుగ జేస్తుంది.

పాపసంకీర్తన దివ్యసంస్కారం దేవుడు మనకొసగిన గొప్ప వరానుగ్రహం. అయితే, మనలో చాలామంది దీనిని తేలికగా తీసుకుంటున్నాము. నిర్లక్ష్యం చేస్తున్నాము. దానిలోని పరమార్ధాన్ని గ్రహించలేక పోవుచున్నాము. మనలో చాలామందిమి పాపభారాన్ని మోస్తున్నాము. క్షమాపణలోని స్వస్థతను గుర్తించలేకపోవుచున్నాము. చివరికి, మనలను మానముకూడా క్షమించుకోలేక పోవుచున్నాము. ఇది చాలా దయనీయమైన పరిస్థితి! దేవుడు మనలను క్షమించడానికి ఎంతగా తహతహలాడుచున్నాడో అర్ధము చేసుకుంటే, మనం కూడా ఇతరులను క్షమించడానికి సిద్ధముగా ఉంటాము.

ప్రభువు చెప్పిన ఉపమానములో (18:23-35), రాజు లేదా యజమాని అనంతముగా చూపించిన దయను, క్షమను సేవకుడు లేదా ఋణస్థుడు గ్రహించలేక పోయాడు. కొంత ధనమును మాత్రమే ఋణపడియున్న తోటి సేవకుడు ప్రాధేయపడినను, అతని ఋణమును క్షమించక, అతనిని చెరసాలలో వేయించాడు. అది తెలుసుకొనిన యజమాని తన బాకీ నంతయు చెల్లించు వరకు తలారులకు అప్పగించెను. దేవుడు మనపట్ల కూడా ఇలాగే తీర్పు విధిస్తాడు. ప్రభువు అంటున్నారు: "మీలో సోదరుని హృదయ పూర్వకముగా క్షమింపని యెడల పరలోక మందలి నా తండ్రియు మీ యెడల అట్లే ప్రవర్తించును" (18:35).

క్షమించడం అనే మంచి లక్షణాన్ని అలవర్చుకుందాం! క్షమాగుణం దైవస్వభావం. మనం దేవుని బిడ్డలం కనుక, దేవుడు మనలను క్షమించునట్లుగా, మనం ఒకరినొకరం క్షమించుకుందాం! పగ, ప్రతీకారాలు స్వస్తి చెబుదాం! క్షమించడానికి మనసులో సంకల్పం కలిగియుండాలి. క్షమించినప్పుడు, కోపం, ద్వేషం అనే సంకెళ్లనుండి మనలను మనం విడుదల పొందుదాం!

No comments:

Post a Comment