దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల రెండవ వారము - బుధవారం
యిర్మియా 18:18-20; మత్త 20:17-28
ధ్యానాంశము: జెబదాయి కుమారుల తల్లి మనవి
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "మీలో ఎవడైన గొప్పవాడు కాదలచిన, అతడు మీకు సేవకుడై ఉండవలెను. మీలో ఎవడైన ప్రథముడు కాదలచిన, అతడు మీకు దాసుడై ఉండవలెను. అట్లే మనుష్యకుమారుడు సేవించుటకే కాని సేవింప బడుటకు రాలేదు" (20:26-28).
ధ్యానము: యేసు తన శిష్యులతో కలిసి యెరూషలేమునకు వెళ్లుచున్నారు. తన శ్రమల, మరణ ఉత్తానముల గురించి మూడవసారిగా తన శిష్యులతో ప్రస్తావించారు.
అప్పుడు జెబదాయి కుమారులైన యాకోబు, యోహానుల తల్లి [సలోమియమ్మ మార్కు 15:40; మత్త 27:56], తన కుమారులతో యేసువద్ద మోకరించి, "నీ రాజ్యములో నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపున, ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండ సెలవిమ్ము" అని మనవి చేసింది (20:21). మార్కు సువిశేషం 10:35 ప్రకారం, వారి తల్లి కాక, స్వయముగా యాకోబు, యోహానులే యేసుకు ఈ మనవి చేసియున్నారు. అప్పుడు మిగతా శిష్యులు ఆ ఇద్దరిపై కోపపడ్డారు. వారి కోపానికి కారణం వారుకూడా అలాంటి కోరికనే కలిగియున్నారు. ఈ సందర్భముగా, ప్రభువు, 'గొప్పవాడు, ప్రథముడు' కావాలంటే ఏమి చేయాలో శిష్యులకు స్పష్టముగా తెలియజేయు చున్నారు.
మొదటిగా, గొప్పవాడు కాదలచిన, సేవకుడై ఉండవలయును. నిజమైన గొప్పదనం సేవ; ఇతరులకు సేవ చేయాలి. సేవ మనలను గొప్పవారిగా చేస్తుంది. పునీతులందరు మనకి ఆదర్శం. వారు గొప్పగొప్ప కార్యాలు చేశారని కాదుగాని, ప్రేమ, సేవాభావంతో జీవించారు. అలాగే, స్వయముగా యేసు ప్రభువే మనకు ఆదర్శం! ఆయన, సేవించుటకేకాని సేవింపబడుటకు రాలేదు. ఆయన, అనేకుల విమోచన క్రయ ధనముగ తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను. యేసు సమస్త మానవాళి రక్షణకై వచ్చారని ఇచ్చట యేసు స్పష్టం చేయడం గమనార్హం! "క్రీస్తు యేసునందు మీదైన ఈ మనస్తత్వమును మీ మధ్య ఉండ నిండు (యేసు మన ఆదర్శం). ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును గణింప లేదు" (ఫిలిప్పీ 2:5-6).
రెండవదిగా, ప్రథముడు కాదలచిన, దాసుడై ఉండవలెను. మనకన్నా ఇతరులకు ప్రాముఖ్యతను ఇవ్వాలి. రాజుకు ఇరువైపుల కూర్చోవడం అంటే, అత్యున్నత స్థాన్నాన్ని కలిగి యుండటం. అలాంటి విన్నపాన్ని చేసిన ఆ తల్లితో ప్రభువు ఓపికతో, నీవు ఏమి కోరుచున్నావో నీకు తెలియదు అని చెప్పి, "నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా?" అని ప్రశ్నించారు. తన శ్రమలలో, మరణములో పాలుపంచు కొనడానికి సిద్ధముగా ఉన్నారా అని ప్రభువు ఉద్దేశ్యం! అందుకు, యాకోబు, యోహానులు, "చేయగలం" అని సమాధానమిచ్చారు. అనగా, క్రీస్తు కొరకు ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధం అని చెప్పటం! ఇచ్చట వారు పూర్తిగా అర్ధంచేసుకొనకయే "చేయగలం" అని సమాధానమిచ్చారు. వారికి కావలసినది ప్రధమ స్థానం!
ఇచ్చట, "పాత్ర" యేసు శ్రమలకు, మరణానికి సూచనగా యున్నది. గెత్సేమని తోటలో, యేసు, "తండ్రీ!... ఈ పాత్రను నా నుండి తొలగింపుము" (మార్కు 14:36) అని ప్రార్ధించారు. ఈ భావన పాత నిబంధనలోని యెషయ 51:17; యీర్మియా 25:15; విలాప 4:21 లో చూడవచ్చు.
యాకోబు, యోహానులు తెలిసో, తెలియకో చెప్పినట్లుగానే, శిష్యులలో మొట్టమొదటిగా క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించింది యాకోబుగారు (ఆ.కా. 12:2). యెరూషలేములో కత్తితో వధింప బడ్డాడు. యోహాను కూడా ఎన్నో శ్రమలను అనుభవించాడు. పధ్మోసు ద్వీపమునకు కొనిపోబడి (దర్శన 1:9), అచట తుది శ్వాసను విడిచాడు. ఈవిధముగా, వారు "చేయగలం" అని చెప్పిన మాటను నిజముగానే చేసి చూపించారు.
నిజమైన సక్సెస్, పొందడములో కన్న, ఇవ్వడములో ఉన్నదని గ్రహించాలి. శిష్యరికం అనేది అధికారం, ఆధిపత్యం కాదు; ప్రతిష్ట, ప్రజాదరణ కాదు. క్రీస్తును అనుసరించడం అంటే సేవా జీవితాన్ని జీవించడం! మన ధ్యేయాలను, బాధ్యతలను సేవాభావంతో, ప్రేమపూర్వకంగా నెరవేర్చడం! సంతోషముతో, అంకితభావంతో, ఉత్సవాహముతో సేవ చేద్దాం!
శ్రీసభలో నాయకులు ప్రజలకు సేవకులై ఉండాలి. గురువులు దైవప్రజలకు సేవకులుగా ఆధ్యాత్మిక సేవలను అందించాలి. శ్రీసభ నాయకులు పరిపూర్ణ ప్రేమ మరియు వినయమును అలవరచుకోవాలి.
No comments:
Post a Comment