తపస్కాల మూడవ వారము - శనివారం (II)

దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల మూడవ వారము - శనివారం
హోషె 6:1-6; లూకా 18:9-14 

ధ్యానాంశము: పరిసయ్యుడు - సుంకరి

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును. తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చిపబడును" (లూకా 18:14).

ధ్యానము: మనం చేసే ప్రార్ధనలు వినయభావముతో చేయాలనేదే నేటి సువార్తా సందేశం. గర్వముతో చేసే ప్రార్థనలను దేవుడు ఆలకించడు. నేటి ఉపమానం యూదుల చట్టములోని అన్ని నియమనిబంధనలకు కట్టుబడి ఉన్నామని గర్వంగా చెప్పుకొనే పరిసయ్యులనుద్దేశించి చెప్పబడినది. వినయపూర్వకముగా మరియు పశ్చాత్తాప హృదయముతో చేసే ప్రార్ధనను దేవుడు తప్పకుండా ఆలకిస్తారు. ఉపమానములో, ప్రార్ధన చేయడానికి దేవాలయమునకు వెళ్లిన ఇద్దరు వ్యక్తుల గురించి యేసు చెబుచున్నారు. ఒకరు పరిసయ్యుడు, మరొకరు సుంకరి. 

యేసు కాలములో పరిసయ్యులు మంచి పలుకుబడి కలిగియుండేవారు. యూదమతం అన్యమతాల వలన కలుషితం కాకుండా ఉండేందుకు ప్రయత్నించేవారు. ధర్మశాస్త్ర నియమాలను నిష్టగా పాటించేవారు. యూదులు వీరిని ఎంతగానో గౌరవించేవారు. అలాంటి ఒక పరిసయ్యుడు దేవాలయములో ముందుకు వెళ్లి నిలుచొని, తనకన్న తక్కువగా భావింపబడే వారికి దూరముగా నిలుచొని, తాను ఏవిధముగా మోషే చట్టాన్ని నిశితముగా పాటించుచున్నది దేవునికి వివరిస్తున్నాడు. వారమునకు రెండు మారులు ఉపవాసముందునని, ఆదాయములో పదియవ వంతు చెల్లించుచున్నానని, అలాగే ఇతరులవలె లోభిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిని కాను. ఈ సుంకరి వంటివాడను కాను అని గర్వముతో ప్రార్ధించాడు.

సుంకరులు యూదులే అయినప్పటికిని, వారు రోమను అధిష్టానం కొరకు పన్నులు వసూలు చేస్తున్నారని, అవసరమైన దానికంటే ఎక్కువ పన్నులను బలవంతముగా వసూలు చేస్తున్నారని, అందరు వారిని అసహ్యించుకునేవారు. పాపాత్ములుగా పరిగణించేవారు. అలాంటి ఒక సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, 'ఓ దేవా! ఈ పాపాత్ముని కనికరింపుము' అని ప్రార్ధించాడు. ఆ ఇద్దరిలో, దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది సుంకరియే అని యేసు స్పష్టం చేశారు. ఎందుకంటే, సుంకరి నిజమైన ప్రార్ధన చేసాడు. తన జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధపడ్డాడు.

పరిసయ్యుడు తన్నుతాను హెచ్చించుకున్నాడు కనుక, తగ్గింపబడినాడు. సుంకరి తన్నుతాను తగ్గించుకున్నాడు కనుక హెచ్చిపబడినాడు. పరిసయ్యుడు తననుతాను నీతిమంతునిగా పరిగణించుకున్నాడు. వాస్తవానికి, తన గురించి తాను గొప్పలు చెప్పుకున్నాడు కాని, ఎలాంటి ప్రార్ధన చేయలేదు. దేవుని స్తుతించుటకు బదులుగా, తన్నుతాను పొగడుకున్నాడు. పరిసయ్యుడు చెప్పినవన్నీ నిజాలే అయ్యుండ వచ్చు, కాని, గర్వముతో, అహంభావముతో, తన అంత:ర్గత జీవితాన్ని చవిచూడలేక పోయాడు.

సుంకరి తననుతాను పాపాత్మునిగా దేవుని సన్నిధిలో పరిగణించుకున్నాడు. తలవంచి, రొమ్ము బాదుకొనుచూ తన పాపాలకు పశ్చాత్తాప పడ్డాడు. తలవంచి, రొమ్ము బాదుకొనుట, దేవుని సన్నిధిలో మన అనర్హతను అంగీకరించడం. ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్ధించాడు. దేవుని క్షమాపణను వేడుకున్నాడు. తననుతాను ఇతరులతో పోల్చుకొనలేదు. హృదయముతో ప్రార్ధన చేసాడు. దేవునితో మరియు తోటివారితో సఖ్యత పడ్డాడు.

సుంకరివలె మనమందరమూ పాపాత్ములమే! దేవుని కనికరము మరియు కృప లేకుండా, మనలో ఎవరమూ కూడా రక్షింపబడలేము. దేవుని కరుణ కొరకు సుంకరి ప్రార్ధిచాడు. మనం కూడా 'ఓ దేవా! ఈ పాపాత్ముని కనికరింపుము' అని వినయముతో ప్రార్ధించుదాం!

ప్రార్ధన అంటే, మనకు అవసరం ఉన్నప్పుడల్లా దేవునికి మన కోరికలను తెలియజేయడం అని మనలో చాలామందిమి భావిస్తూ ఉంటాము. ఆరాధన, స్తుతి, పశ్చాత్తాపం, కృతజ్ఞత మొదలగు ప్రాముఖ్యమైన ప్రార్ధన అంశాలను మరచిపోతూ ఉంటాము. ప్రార్ధన దేవునిపై విశ్వాసం ఉంచడం. దేవునిపై ఆధారపడి జీవించడం. 

"ప్రార్ధనకై దేవాలయమునకు వెళ్లారు." దేవాలయము దేవుని సన్నిధి కొలువైన ప్రత్యేక స్థలము. పరిశుద్ధమైన స్థలము. దేవుడు అంతటా ఉంటాడు అన్నది వాస్తవమే. కాని, ప్రార్ధనకై మనం తప్పక దేవాలయమునకు రావాలి. ఇది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో చాలామంది గుడికి రావడం లేదు. ఇంటిలో ప్రార్ధన చేస్తున్నాం! టీవీలో పూజ చూస్తున్నాము అని చెబుతున్నారు! ఇది మంచి పరిణామం ఎంతమాత్రమూ కాదు. గుడికి రావడానికి వారిని ప్రోత్సహించుదాం!

ముఖ్యముగా, కేవలం క్రైస్తవ నియమాలను పాటిస్తే సరిపోదు! మన జీవితం సరిగా ఉండాలి; అందరిని సమానముగా చూడాలి, గౌరవించాలి, ప్రేమించాలి. ఇతరులకు సహాయం, సేవ చేయాలి. వినయము అనే వస్త్రమును ధరించాలి (2 పేతురు 5:5).

No comments:

Post a Comment