తపస్కాల మూడవ వారము - శుక్రవారం (II) మంగళవార్త మహోత్సవము

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల మూడవ వారము - శుక్రవారం
యెషయ 7:10-14; 8:10; లూకా 1:26-38 


ధ్యానాంశము:
యేసు జనన సూచన - దూత ప్రకటన (మంగళవార్త మహోత్సవము)

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "మరియమ్మా! భయపడకుము. నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో! నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు 'యేసు' అను పేరు పెట్టుము" (లూకా 1:30-31).

ధ్యానము: సర్వలోకానికి శుభవార్త పండుగ. శుభవార్త ప్రకటింప బడిన రోజు. మంగళవార్త మహోత్సవము దేవునికి తల్లిగా, యేసుకు తల్లిగా మరియమ్మకు అద్భుతమైన పిలుపు. వాక్కు, శరీరధారుడై, మానవ రూపమున మనమధ్య నివసించు మహోత్సవము. మరియ ద్వారా, దేవుడు ఈ లోకముపై ప్రేమలోపడు మహోత్సవము - "దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను" (యోహాను 3:16). పరిశుద్ధాత్మ మరియపైకి దిగిరాగా, దైవప్రేమ ఆయన రాకతో, జన్మముతో పరిపూర్ణమైనది. ఆ దైవప్రేమకు మరియ తన్నుతాను సంపూర్ణముగా అర్పించుకున్నది. ఆ ప్రేమను పరిపూర్ణముగా విశ్వసించినది "ఇదిగో నేను ప్రభువు దాసురాలను. నీ మాట చొప్పున నాకు జరుగును గాక! (ఫియట్ - 1:38). ఈ మాట ఆమె ప్రతీ రోజు చెప్పినది. జీవితాంతం ప్రభువు రక్షణ ప్రణాళికకు లోబడి జీవించింది. ప్రభువునందు ఆమె విశ్వాసం మెచ్చదగినది. తప:కాలములో ఈ పండుగను కొనియాడటం అదృష్టం (ఈ రోజునుండి ఖచ్చితముగా 9 నెలలు క్రిస్మస్ పండుగకు). తప:కాలపు ధ్యానములో, ప్రయాణములో మెస్సయ్య రాకను గురించి గుర్తుచేసుకుంటున్నాము.

పతనమైన మానవాళిని రక్షించి, తిరిగి మోక్షద్వారం విప్పి, దైవప్రణాళిక చొప్పున తన బిడ్డలైన మానవులను తన చెంతకు చేర్చుకొనే నిమిత్తం, ప్రవక్తలు పలికిన పలుకు నెరవేర్చుటకు భగవంతుడు పూనుకొన్నారు. సమయం వచ్చినప్పుడు దేవుడు గబ్రియేలు దూతను గలిలయలోని నజరేతు గ్రామంలో వసిస్తున్న మరియ వద్దకు పంపారు.

మరియ నిష్కళంక మైనదిగా జన్మపాపం సోకని పవిత్రురాలుగా దేవుడు ముందుగానే ఏర్పరచుకున్నారు. మంచి పనికి మంచి మార్గమును ఎన్నుకోవడం దేవుని నైజం. గబ్రియేలు దూత, ‘‘అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ప్రభువు నీతో ఉన్నారు. ఇదిగో! నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. పవిత్రాత్మ నీపై వేంచేయును. సర్వోన్నత శక్తి నిన్ను ఆవహించును’’ అని మంగళవార్త వినిపించి మరియ సందేహాన్ని తీర్చాడు (లూకా 1:28, 31, 35).

అందుకు మరియ, ‘‘ఇదిగో! ఏలినవారి దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!’’ (1:38) అని ప్రభువు చిత్తాన్ని విధేయించింది. తననుతాను దేవునికి అంకితం చేసుకుంది. ఆ క్షణమే క్రీస్తు శకానికి శుభారంభమైనది. ఆక్షణమే ఆమె దేవునికి తల్లి అయినది. మొదటి క్రైస్తవురాలిగా ఆవిర్భవించినది.

ఇదంతా దేవుని ప్రేమకు నిదర్శనం. పునీత బెర్నార్డు గారు, ‘‘దేవుడు మానవాళికి అనుగ్రహించిన అత్యన్నత స్థానం మరియను తన తల్లిగా ఎంపిక చేసుకోవడమే’’ అని చెప్పారు. వేదపండితుడైన ఆల్బర్టు ఘనుడు, ‘‘మరియ దేవుని తల్లి కాకపోయినచో ప్రభువుతో ఐఖ్యమై ఉండేది కాదు’’ అని నుడివారు. మరియమ్మ ఒకసారి పునీత జెత్రుతమ్మకు కలలో కనిపించి, ‘‘ఇదిగో! ఏలినవారి దాసిరాను అని నేను చెప్పినప్పుడు నేనెంతో ఆనందించాను. నేను దేవుని తల్లియని నా పేరిట వేడుకున్న ప్రతీ ఒక్కరికి అదే ఆనందాన్ని పంచుతాను’’ అని వాగ్దానం చేసారు.

యేసు తాను ఏమీ లేని వానిగా రిక్తుని చేసుకున్నారు. అదృష్యుడైన ప్రభువు సాదృశ్యుడయ్యారు. సమస్తమునకు సృష్టికర్త అయి ఉండికూడా సామాన్య నరుడయ్యారు. దైవమైయుండి కూడా సేవక రూపం దాల్చారు (పునీత లియో). ప్రతి రోజూ మరియమ్మ సంరక్షణ అందుతూనే ఉంటుంది. మనం ఆమె బిడ్డలముగా ఉండేందుకు ఆశించినంత కాలం ఆమె ఎంతో ఆతురతగా మన గురించి ఎదురు చూస్తుంది (పునీత విన్సెంట్‌ దె పాల్‌).

మరియమ్మవలె మన జీవితాలను దేవునికి సంపూర్ణముగా అర్పించుకుందాం. భయపడక, దేవుని విశ్వసించుదాం. తల్లి గర్భములో పడినప్పటినుండి, చివరి గమ్యం వరకు, మనం దేవుని సంరక్షణలో ఉన్నామని గ్రహించుదాం. దేవుని ప్రేమ మనలను కబళించి వేస్తుంది, కాపాడుతుంది. ఆయన మనకోసం మరణించారు. మనలను ప్రేమిస్తున్నారు. మనం దేవుని చిత్తం ప్రకారం జీవించుదాం!

No comments:

Post a Comment