మరియమాత పట్ల భక్తి
"స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. నీ గర్భ ఫలము ఆశీర్వదింపబడెను" (లూకా 1:42)
Talk prepared and given by Fr. Praveen Kumar Gopu OFM Cap (STL Biblical Theology, M.A. Psychology) on Sunday, 13 February 2022 to the Catechist Sisters of St. Ann (CSA), Immaculate Mary Province, Guntur
I. మరియమాత
మన భూలోక జీవితములో, అమ్మ అంటే అందరికి ప్రేమ, మమత, అనురాగం. అమ్మ అనే పదములోనే కమ్మదనం, తీయదనం ఉంది. అమ్మ అంటే అందరికీ ఎంతో ఇష్టం. అమ్మకోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాము. అమ్మను ఎంతగానో గౌరవిస్తాము, కతోలిక క్రైస్తవ జీవితములో మరియమ్మను మనం ఎంతగానో గౌరవిస్తాము. శ్రీసభ రక్షణ చరిత్రలో మరియమ్మ పాత్ర ఎనలేనిది, అందుకే శ్రీసభ మరియమ్మకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించినది; అందుకే, ఆమె ధన్యురాలు! అపోస్తోలిక కాలము నుండే, మరియమ్మ గౌరవింప బడుచున్నది. మరియమ్మను అనేక విధాలుగా మనం కొనియాడుచున్నాము. వాటిలో ప్రధానమైన పండుగలు - నిత్యకన్యకమాత, నిష్కళంకమాత, దేవమాత, రక్షణమాత, ఉత్థాపితమాత, ఫాతిమామాత, లూర్దుమాత, జపమాలమాత, వరప్రసాదములమాత..., మరియపూజిత మే, అక్టోబరు మాసములు... ఇంకా ఎన్నో! ఎన్నెన్నో! మరియమ్మ మనకు ఆశాజనని, కరుణామూర్తి, ఆత్మయందు జీవమునకు ఆదర్శమూర్తి, క్రైస్తవులకు జీవనదాయిని, మన సంతోషమునకు కారణమూర్తి, పరలోకరాజ్ఞి, ప్రార్ధన సహాయిని!ఆదికాండము (3:15) నుండి దర్శన గ్రంథము (12:1-6) వరకు కూడా మరియమ్మ ప్రస్తావన చూడవచ్చు. సృష్టి ఆరంభములోనే, పాపము చేసిన మానవాళిని రక్షించాలని దేవుడు నిర్ణయించినప్పుడే, మరియ తల్లిని కూడా రక్షణ ప్రణాళికలో భాగాస్తురాలిగా, నూతన ఏవగా ఎన్నుకున్నారు (ఆది 3;15; పు. జస్టిన్, పు. యురేనియుసు; పయస్ IX, Ineffabilis Deus). ఏవమ్మ అవిధేయతతో దేవుని ఆజ్ఞను ధిక్కరించి, అవిశ్వాసముతో పాపం చేసి, మరణానికి మనలను బానిసలు చేస్తే, నూతన ఏవమ్మ మరియ దేవునికి సంపూర్ణముగా విధేయించి, తన విశ్వాసముతో లోకాన్ని జీవముతో నింపినది. తన సంపూర్ణ సహకారాన్ని క్రీస్తుతో అందించి, మన రక్షణలో పాలుపంచు కున్నది.
మరియమాత పట్ల భక్తికిగల కారణాలు: (1) రక్షణ చరిత్రలో మరియ పాత్ర; (2) మరియ మనందరికీ అమ్మ; (3) తాను మనదరికీ అమ్మ అని తెలిపెడి ఆమె దర్శనాలు; (4) అనేకమంది పునీతులు, జగద్గురువులు మరియపట్ల భక్తిని కలిగియుండుట.
మరియ జననం
మరియ తల్లిదండ్రులు అన్నమ్మ, జ్వాకీములు. వీరు యూదా గోత్రమునకు చెందినవారు. కనుక, మరియ దావీదు వంశములోని యూదా గోత్రమునకు చెందినది (లూకా 1:32, 69). మరియ గలిలీయ సీమయందలి నజరేతు నగరమున జన్మించెను (లూకా 1:26-27). ఏదేమైనా, మరియ "దేవుని కృపకు పాత్రురాలైనది" అన్నది చాలా ముఖ్యము! ఆమెలోని విశ్వాసం, నిబద్ధత, వినయ విధేయతలు, త్యజింపు, ఓర్పు, దేవునిపట్ల భయభక్తులు... మనకు ఆదర్శం!
చిన్ననాటి నుండి కూడా మరియ సద్వర్తనురాలు. దేవునియందు భయభక్తులు కలిగి జీవించినదని చెప్పడములో ఎలాంటి అతిశయోక్తి లేదు! "అనుగ్రహ పరిపూర్ణురాలా!" (లూకా 1:28) అని దూత పలికిన మాటలే ఆమె సద్వర్తనకు, భయభక్తులకు, వినయ విధేయతలకు గొప్ప నిదర్శనం! మరియ సజ్జనురాలు. 'మరియ' అనగా "ప్రియమైన" అని అర్ధము. 'మరియ'కు గ్రీకు పదం "మారియం", హీబ్రూ పదం "మిర్యాము". హీబ్రూ పదానికి "మారియె" అనే ఈజిప్టు పదం మూలం అయి యుండవచ్చు!
మరియ కారణ జన్మురాలు అని చెప్పుకోవచ్చు! అనగా, ఆమె సాధారణ స్త్రీ,పురుషుల కలయికతోగాక, అన్నమ్మ ముసలి ప్రాయములో పవిత్రాత్మ వలన గర్భము ధరించి, మరియను కనినది. ఇదంతా, ఆదిలో దేవుడు చేసిన రక్షణ ప్రణాళికకు సంసిద్ధతగా నున్నది. ఈవిధముగా దేవుడు మరియను జన్మపాప రహితగా సృష్టించారు..
సాంప్రదాయ కథనం ప్రకారం, మరియకు మూడేళ్ళ ప్రాయములో, తల్లిదండ్రులు దేవునికి వాగ్దానం చేసికొనిన విధముగా, అప్పటి సంప్రదాయం ప్రకారం, యెరూషలేము దేవాలయములో అంకితం చేసారు. అచ్చటనే, 14 సం.ల ప్రాయము వరకు అచటనే సేవలు చేస్తూ జీవించియున్నది. ఆ కాలములోనే, ధర్మశాస్త్రము గురించి, ఇశ్రాయేలు చరిత్ర, రక్షణ గురించి మరియ అధ్యయనం చేసినది. దేవునిపట్ల భయభక్తులు పెంచుకున్నది.
కన్యయైన మరియకు దేవుని అనుగ్రహము
మరియకు దావీదు వంశస్థుడగు యోసేపుతో ప్రదానము చేయబడెను. ఆమె కన్యక. (లూకా 1:27). యోసేపుతో ప్రదానం చేయబడిన కన్య మరియతో, దేవదూత, "అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు" (లూకా 1:28) అని అనగా, మరియమ్మ ఆ పలుకులకు కలతచెంది ఆ శుభ వచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, "నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో! నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు 'యేసు' అను పేరు పెట్టుము. ఆయన మహనీయుడై, మహోన్నతుని కుమారుఅని పిలువబడును. ప్రభువగు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు" (లూకా 1:29-33). అంతట మరియమ్మ, "నేను పురుషుని ఎరుగను కదా! ఇది ఎట్లు జరుగును?" (లూకా 1:34) అని ప్రశ్నింపగా, దూత "పవిత్రాత్మ నీపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు 'దేవుని కుమారుడు' అని పిలువబడును" (లూకా 1:35) అని అనెను.
కన్యకగా గర్భం ధరించాలి! 'బాధామయ సేవకునికి' తల్లి కావాల్సి యున్నది! లోకం వేసే అపవాదు ఆమె మదిలో మెదిలింది! అయినను మరియమ్మ "ఇదిగో నేను ప్రభువు దాసురాలను. నీ మాట చొప్పున నాకు జరుగును గాక!" (లూకా 1:38) అని దైవ ప్రణాళికను సంతోషముగా అంగీకరించినది.
ఆ కాలములో మెస్సయ్య కొరకు ఎదురుచూస్తున్న కాలం. మెస్సయ్య ఒక కన్యక ద్వారా జన్మిస్తారన్న యెషయ (7:14) ప్రవచనం అందరికీ తెలుసు! కనుక, ఆనాటి యూద కన్యకలు అందరు ఆ మెస్సయ్య తన గర్భాన జన్మించాలని కోరుకొనేవారు, ప్రార్ధించేవారు. కొంతమంది వివాహము చేసికొనకుండా, కన్యకలుగా, ఆ భాగ్యం కొరకు ఎదురుచూసేవారు. అంతటి గొప్ప అదృష్టం కన్యయైన మరియకు దక్కినది. ఆమె దేవుని అనుగ్రహాన్ని పొందినది. అందుకే, ఎలిశబేతమ్మ, "స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. నీ గర్భ ఫలము ఆశీర్వదింపబడెను" (లూకా 1:42) అని ఎలుగెత్తి పలికినది. నేటి మఠకన్యలకు మరియ ఆదర్శం. వారు మెస్సయ్యను హృదయములో నిలుపుకోవడానికి, జన్మనివ్వడానికి వారికి గొప్ప అవకాశం!
- దేవుని చిత్తానికి లోబడిన మరియవలె మనం జీవించాలి!
మరియ - దైవమందసం
దేవదూత మంగళవార్త వినిపించిన వెంటనే, మరియమ్మ తన చుట్టమైన ఎలిశబేతమ్మను దర్శించినది. ఆమెకు సహాయం చేయటానికి మాత్రమేగాక, క్రీస్తు సాన్నిధ్యాన్ని మరియ మోసుకొని వెళ్ళినది. అందుకే, ఎలిశబేతమ్మ మరియను "దేవుని తల్లి"గా దీవించినది, అలాగే, గర్భమందలి శిశువు గంతులు వేసినది (లూకా 1:41). ఎలిశబేతమ్మ కుటుంబమంతా మరియ గర్భములోని రక్షకుని సాన్నిధ్యాన్ని దర్శించుకోగలిగారు. కనుక, మనంకూడా, ఎక్కడకు వెళ్లినను, క్రీస్తు సాన్నిధ్యాన్ని మోసుకొని వెళ్ళాలి!
- ఎలిశబేతమ్మ కుటుంబంవలె దైవసాన్నిధ్యాన్ని గుర్తించి, ఆనందించి, దేవునకు స్తుతులు చెల్లించాలి!
CSA General Directory (p.56) ప్రకారం, దేవమాత ఎలిశబేతమ్మను సందర్శించు పండుగను, ప్రతీ సం.ము 31 మే ఘనముగా కొనియాడాలి. మొదటిసారిగా ఈ పండుగ క్రీ.శ. 1263లో ప్రారంభమైనది. పునీత బొనవెంతూరు సలహా మేరకు, పునీత ఫ్రాన్సిస్ అస్సీసి సభవారు ఈ పండుగను ఆచరించడం ప్రారంభించారు. క్రీ.శ. 1389లో ఆరవ అర్బన్ జగద్గురువులు ఈ పండుగను విశ్వ శ్రీసభ యంతట కొనియాడాలని విజ్ఞప్తి చేసారు.
యేసు జననం - మరియతల్లి పాత్ర
మరియ యోసేపులు, జనాభా లెక్కల నిమిత్తమై, గలిలీయ సీమలోని నజరేతునుండి, యూదయా సీమలోని బేత్లెహేమునకు వెళ్ళెను. వారచట ఉన్నప్పుడు, మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలలోచుట్టి పశువుల తొట్టిలో పరుండ బెట్టెను (లూకా 2:4-7). జ్ఞానులు తల్లి మరియమ్మతో నున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి (మత్తయి 2:11). శిశువును చంపుటకు హేరోదు వెదకుచున్నాడని తెలిసి యోసేపు బిడ్డను, తల్లిని తీసికొని ఐగుప్తులో తలదాచుకున్నారు (మత్తయి 2:13). హేరోదు మరణానంతరం యోసేపు బిడ్డను, తల్లిని తీసికొని ఇస్రాయేలు దేశమునకు తిరిగి వచ్చిరి (మత్తయి 2:21).
మరియ, యోసేపులు ఎనిమిదవ రోజున శిశువునకు "యేసు" అని పేరు పెట్టారు (లూకా 2:21). బాలయేసును దేవాలయములో కానుకగా సమర్పించారు (లూకా 2:22-24). ఆ సందర్భముననే, యేసును, మరియమ్మను గురించిన సిమియోను ప్రవచనం చేసాడు (లూకా 2:29-35). తన కుమారునితో పాటు మరియకూడా బాధలను అనుభవించాల్సి యున్నదని ప్రవచనం! ప్రధమ విశ్వాసిగా, శిష్యురాలుగా మరియ యేసును అనుసరించినది. ఆయన శ్రమలను ఆధ్యాత్మికముగా (హృదయమున) అనుభవించినది.
యేసుకు 12 సం.ల ప్రాయం వచ్చినప్పుడు,ఆయన తల్లిదండ్రులు పాస్క పండుగకు యెరూషలేము దేవాలయమునకు తీసుకొని వెళ్ళిరి (లూకా 2:41). యేసు తప్పిపోయి, కనబడిన తరువాత, వారు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలయేసు పలికిన, "నేను నా తండ్రి పని మీద ఉండవలయును" (లూకా 2:49) అన్న పలుకులను, "తల్లి మరియమ్మ ఆ విషయములన్నియు మనస్సున పదిలపరచుకొని ఉండెను" (లూకా 2:51).
- మరియతల్లివలె పేదరికాన్ని, దీనత్వాన్ని ప్రేమించే మనస్సును కలిగి యుండాలి!
- మరియతల్లివలె దూతద్వార వచ్చిన దైవాజ్ఞలను శిరసావహించాలి!
- మరియతల్లివలె దైవాజ్ఞలను, దైవ చట్టాన్ని పాటించాలి!
- మరియతల్లివలె హృదయములో దైవరహస్యాలను మనం చేద్దాం!
కానా పెళ్లి - మరియ మధ్యస్థ ప్రార్ధన
యేసు బహిరంగ జీవితాన్ని, ప్రేషిత కార్యాన్ని ప్రారంభించిన తొలి రోజులలో, గలిలీయలోని కానా పల్లెలో పెళ్ళికి మరియమ్మను, యేసును ఆహ్వానించిరి. పెళ్ళిలో ద్రాక్షారసం కొరతను మొదటిగా గుర్తించి, కుమారునికి తెలిపినది మరియ తల్లియే. "స్త్రీ! అది నాకేమి? నీకేమి? నా గడియ [తండ్రి దేవునిచే నిర్ణయింపబడిన కాలం, మహిమ పరపబడు కాలం] ఇంకను రాలేదు" (2:4) అని పలికినను, ఆయన తల్లి సేవకులతో, "ఆయన చెప్పినట్లు చేయుడు" (2:5) అని చెప్పినది. కుమారునిపై తల్లికి అంతటి నమ్మకం, విశ్వాసం! ఇక్కడ మరియ ప్రార్ధన సహాయినిగా కనిపిస్తుంది. ఆపదలోనున్న వారికి, క్రీస్తు సహాయముతో ఆదుకునే తల్లిగా కనిపిస్తుంది.
మరియ మధ్యస్థ ప్రార్ధనద్వారా యేసు "శ్రేష్టమైన" ద్రాక్షారసమును (యోహాను 2:10) చేసారు. అనగా, మరియతల్లి ద్వారా వేడుకుంటే, పరిపూర్ణమైన వరాలను పరిపూర్ణముగా పొందుతాము.
- మరియతల్లివలె సుతుడు క్రీస్తుపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచుదాం!
- మరియతల్లివలె ఇతరుల ఆపదలను కనిపెట్టి, శ్రేష్టమైన వాటికొరకు క్రీస్తుకు ప్రార్ధన చేద్దాం!
మరియ ఆదర్శమూర్తి
ఒకసారి యేసు ఒక ఇంటిలో బోధిస్తుండగా, యేసు తల్లియు, సోదరులు వచ్చి ఆయనను పిలువనంపిరి. అప్పుడు యేసు, "నా తల్లి యెవరు? నా సోదరీ సోదరు లెవరు? దేవుని చిత్తమును నేరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి" (మార్కు 3:31-35) అని పలికెను. మరియమ్మ దేవుని చిత్తమును సంపూర్ణముగా నేరవేర్చినదని యేసు చెప్పకనే చెప్పారు.
సిలువ చెంత మరియ
మరియమ్మను క్రీస్తు సిలువచెంత చూస్తున్నాము (యోహాను 19:26-27). శిష్యులు పారిపోయినను, మరియతల్లి క్రీస్తును విడచిపోలేదు. ప్రభువును అంటిపెట్టుకొని యున్నది. మరియ దీనస్థితిని చూసి, ఆమె క్షేమం నిమిత్తమై, ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించారు. అలాగే, శిష్యుల సమూహమును మరియతల్లికి అప్పగించారు. శిష్యులకు తల్లియై, క్రీస్తు లేని లోటును తీర్చింది. "యోహాను ఆ గడియనుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసికొని పోయెను". మనం కూడా మరియతల్లిని మన గృహాల లోనికి తీసికొని వెళ్ళాలి. ఇది మరియతల్లి ద్వారా, శ్రీసభ కొనసాగింపును సూచిస్తుంది.
ఆ తరువాత, యేసుక్రీస్తు పునరుత్థానుడై, మోక్షారోహనుడైన తరువాత, మరియతల్లి కూడా శిష్యులతో కలిసి మేడగదిలో ప్రార్ధించినది (అ.కా. 1:14). దీని తరువాత, బైబులులో మరియతల్లి ప్రస్తావన లేదు.
మరియతల్లి మరణాంతరం వరకు యోహాను యెరూషలేములోనే ఉన్నాడు. అలాగే, ఎఫెసు నగరములో, యోహాను, మరియతల్లి నివసించినట్లుగా కూడా చెప్తారు. ఆమె ఆత్మ-శరీరములతో మోక్షమునకు కొనిపోబడినదని ఒక సంప్రదాయం, మన విశ్వాసం! 1 నవంబరు 1950న 12వ భక్తినాధ జగద్గురువు మరియమాత ఆత్మశారీరాలతో మోక్షానికి ఎత్తబడినదని ప్రకటించారు. అలాగే, దేవమాత పరలోక, భూలోక రాజ్ఞిగా స్థాపించ బడినది.
- మరియతల్లి వలె మనం కూడా బాధ్యాతాయుతముగా మెలగాలి. మరియ కన్యత్వంతో పాటు, ఆమెలోని సుగుణాలన్ని, మనకు ఆదర్శం కావాలి!
- మరియతల్లివలె, నిండు విశ్వాసముతో క్రీస్తు శ్రమలలో పాలుపంచుకుందాం!
- మరియతల్లివలె పవిత్రాత్మ వరము కొరకు ప్రార్ధన చేద్దాం!
మరియమాత పట్ల భక్తి
దేవుడే ఆమెను ఎన్నుకొని, రక్షణ మాతగా నియమించారు. కనుక, మనము ఆమెను ఎన్నుకొని గౌరవించాలి. రక్షకుడు ఆమెద్వారా మన మధ్యలోనికి వచ్చారు (గలతీ 4:4). మనము ఆమెద్వారా దేవున్ని చేరుకోవాలి. అందుచేత, మరియతల్లి పట్ల భక్తిని పెంచుకోవాలి. ఆ తల్లిపై భక్తిని ఎలా చూపుతాం? ఆమె పండుగలను కొనియాడాలి, జపమాలను జపించాలి. మరియతల్లి పుణ్యక్షేత్రాలను సందర్శించడం కూడా ఆమెపై భక్తిని చూపడమే! మరియమాతను గూర్చిన బైబులు వాక్యాలను చదువుకొని ధ్యానించాలి. మన రక్షణ చరిత్రలో మరియతల్లి పోషించిన పాత్రను క్షున్నముగా అర్ధం చేసుకోవాలి.
మరియతల్లి భక్తులకు ఎలాంటి చేటు జరగదు అని పునీత అల్ఫోన్సస్ లిగోరి గారు అన్నారు. కనుక, ఆ తల్లిపట్ల భక్తిని హృదయ పూర్వకముగా ప్రదర్శించాలి. మరియను గౌరవించడములో ముఖ్యోద్దేశం - దేవుడు ఆమెకు అనుగ్రహించిన భాగ్యాలను స్తుతించడమే! "ఇకనుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు" (లూకా 1:48).
మరియ మఠకన్యలకు ఆదర్శం
మరియ కన్యక, నిష్కళంకమాత, జన్మపాపరహిత, నిర్మలమాత! మఠకన్యలమాతా! మఠకన్యలు, దేహాన్ని, హృదయాన్ని ప్రభువుకే అంకితం చేసుకుంటారు. కాబట్టి, దైవసంబంధమైన కార్యాలలో నిమగ్నం కావాలి (1 కొరి 7:14). పవిత్ర జీవితాన్ని జీవించాలి. సజీవ సాక్షులుగా జీవించాలి. లౌకిక విషయాలకు దూరముగా ఉండాలి. ఈ విషయములో, నిర్మలమాత తప్పక సహాయం చేయును. మరియ పూర్వవేదములోని "దీనులతో" (హనావిం) తననుతాను పోల్చుకున్నది (లూకా 1:48). అనగా సంపూర్ణముగా దేవునిపై ఆధారపడి జీవించినది. మరియవలె మఠకన్యలు కూడా, సంపూర్ణముగా దేవునిపై ఆధారపడి జీవించాలి. కష్టాలను, బాధలను, వినయముతో సహిస్తూ ఉండాలి. మరియను జూచి దీనత్వాన్ని అలవరచు కోవాలి.
మరియ మూడు వ్రతాలు చేయకున్నను, వాటిని పాటించినది: "నీ మాట చొప్పున నాకు జరుగును గాక!" (లూకా 1:38) ఆమె విధేయతకు నిదర్శనం. ప్రభువుకోసం కన్యగా, పేదరాలిగా జీవించినది. కనుక, వ్రత జీవితములో మరియ మఠకన్యలకు ఆదర్శముగా ఉన్నది!
కన్యతల్లి మరియమ్మ తన కుమమరుని వలె సువార్తా ధర్మాలకు కట్టుబడి ధన్యజీవనం గడిపారు. కనుక, ఈ సువార్తా ధర్మాల ఆచరణం మఠవాసులను సాక్షాత్తూ క్రీస్తు ప్రభువుకూ మరియమాతకు ప్రతిబింబాలుగా మలుస్తాయి (Lumen Gentium, no. 46).
II. పునీతులు - మరియమ్మ పట్ల భక్తి
పునీతుల జీవితములో మరియతల్లి పాత్ర అమితమైనది! ఆమె అనుగ్రహము ద్వారా, పవిత్రతలో శిఖరాగ్రులైనారు! వారి ఆదర్శాన్ని మనము పాటించుదాం!
యేసు ప్రియశిష్యుడు యోహాను: "ఇదిగో నీ తల్లి. ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసికొని పోయెను" (యోహాను 19:27). యోహాను యేసుకు అత్యంత ప్రియ శిష్యుడు. అమితముగా ప్రేమించువారు, అమితమైన బహుమానాన్ని పొందుతారు. ఆదికాండములో దేవుడు వాగ్దానం చేసిన స్త్రీమూర్తి మరియ తల్లేనని, సర్పాన్ని నలగద్రొక్కి తన బిడ్డలను రక్షించుకొనే రక్షకునిమాతగా, దానిపై యుద్ధము చేసి గెలిచే స్త్రీమూర్తి, ఆమె కుమారుడు, మరియతల్లి-యేసుప్రభువేనని వారి ఘనతను ప్రకటించారు. తన రచనలలో, మరియతల్లికి అత్యంత గౌరవాన్ని సమకూర్చారు. రక్షణ ప్రణాళికలో ఆమె పాత్రను గొప్పగా ఆవిష్కరించారు. మరియతల్లికి తమ గృహాలలో, హృదయాలలో చోటిచ్చువారిని ఆమె నిత్యం కాపాడును.
యేసు శిష్యుడు యాకోబు: "మీలో ఎవడైన కష్టములో ఉన్నాడా? ఐనచో అతడు ప్రార్ధింప వలయును" (యాకోబు 5:13). యాకోబు - జబదాయి, మరియ సలోమిల కుమారుడు, యోహాను సోదరుడు, యేసు శిష్యుడు. మరియమాత యెడల అమితమైన ప్రేమను కలిగియున్నారు. మరియతల్లి ఎంతోమందికి తన దర్శనాలద్వారా కనిపించిన విషయం మనదరికీ తెలుసు! మొట్టమొదటిసారిగా, యాకోబు గారికే మరియ దర్శనం ఇచ్చినది. యాకోబు ఉత్తర స్పెయినులో ఎవరు తన బోధనను ఆలకించనపుడు, నిరుత్సాహములో ఉండగా, మరియతల్లి దర్శనమిచ్చి అతనిని ప్రోత్సహించినది. చెక్కస్తంభంమీద చేయబడిన తన ప్రతిమను బహుకరించి, ఆ స్థలములో తన గౌరవార్ధం ఒక దేవాలయమును నిర్మించమని కోరినది. ఇదే మొట్టమొదటి క్రైస్తవ దేవాలయం! మరియతల్లి చేసిన అనేక దర్శనాల సారాంశం - మానవాళి మారుమనస్సు పొంది కుమారుడు క్రీస్తు మార్గములో నడవాలి.
- 1858లో ఫ్రాన్సు దేశములోని లూర్దు గ్రామములో, 14 సం.ల బెర్నదెత్తకు 19 సార్లు మరియ దర్శన మిచ్చినది.
- 1917లో పోర్చుగల్ దేశములోని ఫాతిమా గ్రామములో, లూసి, ఫ్రాన్సిస్కో, జసింత అను పిల్లలకు దర్శన మిచ్చినది.
- మెక్సికో పట్టణములో జాన్ దియాగోకు దర్శన మిచ్చినది.
- భారత దేశములోని వేలాంకణి అనే గ్రామములో మరియమాత దర్శన మిచ్చినది.
పునీత జస్టిను (క్రీ.శ. 165), పునీత యురేనియసు (క్రీ.శ. 200) - మరియమాతను నూతన ఏవమ్మగా వివరించారు.
పునీతులు అలెగ్జాంద్రియ క్లెమెంటు, హిపోలిటస్, సిప్రియను, ఒరిజను, తెర్తులియను (3వ శతాబ్దం) - మరియమాతను దేవుని తల్లిగా వర్ణించారు. దివ్య మాతృత్వం అర్ధం చేసికొనకపోతే, ఆమెను పూర్తిగా అర్ధం చేసుకోవడం అసాధ్యం అని అన్నారు.
పునీత ఎపిఫానెసు: "మరియ, పరిశుద్ధ కన్యక అను నామము దేవునిచే ఇవ్వబడినది. కావున అది ఆమెనుండి వేరు చేయబడదు. ఇది దైవ చిత్తము."
పునీత జేరోము: "ఈ ప్రపంచములో జీవిస్తున్న సమయములోనే మరియమాత హృదయం అనురాగ భరితమైన ప్రేమ, మానవాళిపై కారుణ్యంతో నింపబడి యున్నది. తన బాధలకన్న ఎక్కువగా మానవాళి బాధలను భరించిన కారుణ్యమూర్తి మరియమాత."
పునీత ఆంబ్రోసు (క్రీ.శ.379): మరియను శ్రీసభతో పోల్చారు.
పునీత అగుస్తీను: "అమ్మా! నీవు కన్యత్వము కోల్పోకుండా గర్భము ధరించి, జన్మనిచ్చి, బిడ్డను కనిన కన్యవు. కన్యయైన మాతృమూర్తివి. నిరంతరం నిత్యకన్యవు నీవేనమ్మా!"
పునీత ఎఫ్రేము (క్రీ.శ. 397): "ఓ తంత్రీ వాద్యమా, మేలుకొని దేవమాతను స్తుతించుము. గొంతెత్తి దావీదు కుమారి, లోకరక్షకుని తల్లి ఘనచరితను చాటుము." మరియ మధ్యవర్తిత్వాన్ని శ్లాఘించారు. "ఓ జన్మపాప రహితోద్భవి కన్యకా! నీ కృప అనే మృదువైన రెక్కలకింద నన్ను కాచి కాపాడు" అని ప్రార్ధించాడు.
పునీత ఆన్స్లెం: "దైవ తనయుడు లేకపోతే, ఏదియు ఉనికి కలిగి ఉండలేదు. మరియ తనయుడు లేకపోతే, ఏదియు రక్షింప బడదు."
పునీత బెర్నార్డు: "పునీతులలో తన ఔన్నత్యమును, శ్రేష్టతను ప్రదర్శించిన దేవుడు తన తల్లి యందును తన ఔన్నత్యమును, శ్రేష్టతను చూపించేను. యేసు ప్రభువు చెంత మన మానవులను మనవి చేయుమని, మరియ మాతను, ఆశ్రయించినచో, ఆమె మనవి నాలకించి, ప్రభువు మనలను దగ్గరకు చేర్చుకొనును."
పునీత దోమినిక్ - జపమాల: 'జపమాల, చెడును, సైతానును ఓడించి, మనము చేయు ప్రతి పనిలో విజయాన్ని సమకూర్చే పరిశుద్ధ అస్తము, ఆయుధము." సంప్రదాయం ప్రకారం, మరియతల్లి దోమినిక్ వారికి దర్శనమిచ్చి జపమాలను అందించినది. ఆయన యూరోపు దేశాలలో మరియ భక్తిని, జపమాల భక్తిని వ్యాప్తి చేసారు. జపమాల ప్రార్ధన ద్వారా ఎంతోమందిని, కతోలిక విశ్వాసములోనికి తిరిగి నడిపించారు. కనుక, జపమాల ఆధ్యాత్మిక ఆయుధం మరియు రక్షణ కవచం! మన ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదలకు, జపమాల ఎంతగానో తోడ్పడుతుంది.
పునీత డాన్ బోస్కో: "దివ్యసత్ప్రసాద మందు క్రీస్తువుల సహాయమాత మీద విశ్వాసముంచుము. అద్భుతాలు అంటే ఏమిటో నీవే చవిచూచెదవు." “మా అమ్మ నాకు త్రికాల
జపమును, జపమాలను. ప్రార్ధించడం నేర్పింది” అని గర్వముగా చెప్పేవారు. క్రీస్తువుల
సహాయమాత పేరిట పుణ్య క్షేత్రమును నిర్మించారు.
పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్: "మరియతల్లి దైవకరుణను సంపాదించినది. కుటుంబ సభ్యులవలె ఆ కరుణతో మనలను పోషిస్తున్నది." "పరలోకములో నాకొక తల్లి ఉన్నది. ఆమె పేరు మరియమ్మ" అని ఫ్రాన్సిస్ పొగిడారు. మరియమ్మను సొంత తల్లిగా భావించారు. ఫ్రాన్సిస్ వారికి కలిగిన దర్శనాలలో తన సభ సభ్యులు క్రీస్తు ప్రభువుని చేరుటకు ఎర్రని ఎత్తైన నిచ్చెన ద్వారా ప్రయత్నిస్తూ , క్రిందకు పడిపోవడం చూచి, ప్రభువు తెల్లగా, తక్కువ ఎత్తుగా ఉన్నటువంటి వేరొక నిచ్చెనను, దాని చివరననున్న మరియమాతని చూపుతూ, మీ సభ్యులకు మరియమాత ఉన్న నిచ్చెన ద్వారా పరలోకమును చేరమని సలహానిమ్ము అని తెలియజేసెను. ఫ్రాన్సిస్ వారికి ఉన్న భక్తి అపారమైనది, వర్ణింపలేనిది. తాను స్థాపించిన సభకు మరియతల్లిని పాలక పునీతులుగా ఎన్నుకున్నారు. జులై 29 నుండి ఆగష్టు 15 వరకు మరియమాత గౌరవార్ధం ఉపవాసం ఉండేవారు.
పునీత తోమాస్ అక్వినాస్: "ధన్య కన్యమరియను అన్ని విధాల గౌరవించి, ఆమె గురించి ప్రసంగించాలి, స్తుతించాలి. మన ప్రతి అవసరతలో ఆమెను ఆశ్రయించాలి. అక్వినాస్ మరియతల్లి గురించి కవితలు, ప్రార్ధనలు రచించారు.
పునీత బోనవెంతూర్: "అనుగ్రహ పరిపూర్ణురాలా అని ఆమె మధుర నామమును పలుకుట ద్వారా మన రక్షణ మొదలవుతుంది. ప్రపంచ మాలిన్యమును తొలగించి పాప ప్రక్షాళనమునిచ్చు నామము మరియ నామము. మరియ త్రిత్వేక దేవుని వరాల పుత్రిక."
పునీత పాదువాపురి అంతోని: "నవమాసాలు ప్రభువుని తన గర్భమున మోసిన మరియమాత ధన్యమైనది." అంతోనివారు మరియమతను దాదాపు 400 నామములతో సంబోధించడానికి ఇష్టపడేవాడు. మరియమాతపై ఆయనకున్న భక్తి వలన, మరొక మరియమాతలా మారిపోయి చిన్నారి బాలయేసును తన హృదిపై మోయు భాగ్యమును పొందారు. మరియమాత నిత్యకన్యత్వమును లిల్లీ పుష్పముతో పోల్చారు.
పునీత ఫ్రాన్సిస్ శౌరి: "మహిమగల మరియ తల్లిని కావలిగా స్వీకరించండి. పరలోకమునుండి ఆమె దేవున్ని ఏమి అడిగినను దేవుడు అనుగ్రహిస్తారు." భారతదేశ పాలక పునీతులు! మెడలో జపమాలను ధరించి, క్రుపారసముగల మాత జపమును జపిస్తూ ఎన్నో అద్భుతాలు చేసారు. పాపుల కోసం మరియతల్లి వేడుదల కోరేవారు. మరియతల్లికి ఇష్తమైన ప్రార్ధన జపమాల వని శౌరివారు ఎక్కువగా జపమాలను జపించేవారు.
పునీత ఇగ్నేషియస్ లొయోల: "మరియతల్లి పట్ల భక్తి కలిగినవారు ఎప్పటికి దారి తప్పరు." జేసుసభ స్థాపకులు! మరియమాత పట్ల అనంతమైన ప్రేమను కలిగి యుండేవారు. తన పరిచర్యలో పొందిన మేలులకు, సాధించిన ఘనమైన కార్యాలకు, ఈ లౌకిక జీవితాన్ని జయించుటకు పొందిన శక్తులకు క్రీస్తుప్రభువు తర్వాత మరియతల్లియే మూలకారణం అని చెప్తూ ఉండేవారు. తన ప్రతీ సమస్యలో మరియతల్లి శరణు వేడుకొనేవారు. మరియ తల్లి దర్శనం కలిగినప్పుడు, హృదయ శుద్ధిని పొంది పూర్తిగా దేవునికి సమర్పణ చేసుకున్నారు. తన ఆధ్యాత్మిక జీవనానికి, మారుమనస్సుకు మరియతల్లియే కారణమని సాక్ష్యమిచ్చారు.
పునీత సిలువ యోహాను: "ప్రతిరోజు జపమాలను జపించు వారు సాతాను శోధనలను జయించగలరు." ఆధ్యాత్మిక మౌనముని! 'మరియతల్లి మన ఆత్మకు సహాయం చేస్తుంది. ఆమె ఆధ్యాత్మిక జీవితమే మనకు ఆదర్శం" అని చెప్పేవారు.
పునీత మరియ వియాన్ని: "దేవున్ని ప్రేమించుటలో, కోరుకొనుటలో, తెలుసుకొనుటలో మనకు విశిష్ట మార్గదర్శి మరియతల్లి." ఆదర్శ గురువు! తన గురుత్వ పరిచర్యలో మరియమ్మపై ఎంతో ఆధారపడి జీవించారు. తన పడకపై ఎప్పుడూ చిన్న మరియతల్లి స్వరూపం ఉండేది. విచారణ దేవాలయాన్ని వ్రుద్ధిచేస్తూ, మరియతల్లికి చిన్న పీఠమును ఏర్పాటు చేసి, "గృహాల మాత" అని కొనియాడారు. విచారణ కుటుంబాలను నిష్కళంక హృదయానికి సమర్పణ చేసారు. "మరియతల్లి ద్వారానే నేను క్రీస్తుకు దగ్గరయ్యాను" అని చెప్పేవారు.
పునీత చిన్న తెరేజమ్మ: "అమ్మ మరియా! నీవు నాకు అమ్మగా ఉన్నందుకు నేను ఆనందిస్తున్నాను." వేదవ్యాపక పాలక పునీతురాలు! మరియతల్లి తనకు ఎంత సహాయం చేసిందో, ముఖ్యముగా తన కష్టములో అమ్మతోడు మరువరానిది అంటూ తన ఆత్మకథలో వ్రాసారు. మరియతల్లి జపమాలను, ఉత్తరీయమును ధరించుటకు ఎప్పుడు సిగ్గుపడేవారు కాదు! మరియ నామ ఉచ్చరణే మనకు ఆనంద నిధి అని ఆమె చెప్పేవారు.
పునీత పాద్రే పియో: "పరలోక మాతకు సమీపమున జీవించండి. ఎందుకనగా, మరియతల్లి నదిప్రవాహము ద్వారానే జీవజల నాధుని చేరుకోగలము." పంచగాయాలను కలిగిన పియోగారు మరియతల్లికి చిన్నపిల్లలవలె దగ్గరయ్యేవారు. "నా నమ్మకానికి కారణం మరియమ్మ" అని తన గది ముందు వ్రాసేవారు. "జపమాల ఎక్కువ ఖర్చు కాకపోయిన, చాలా విలువైనది. దానిద్వారా యుద్ధాలను సహితం గెలవవచ్చు" అని చెప్పేవారు. అమ్మ మనకు ఎప్పుడూ తోడుగా ఉండేలాగున, మనం ఆమెకు అనువైన వాతావరణం కల్పించాలని కోరేవారు.
పునీత మదర్ తెరెసా: "జీవితములో నిరుత్సాహం కలిగినప్పుడు, అమ్మను ఈవిధముగా వేడుకొనాలి. అమ్మా మరియా! క్రీస్తు ప్రభుని తల్లీ! నాకుకూడా అమ్మగా ఉండండి. ఈ ప్రార్ధన ఎప్పుడుకూడా నిష్పలం కాదు." సేవద్వారా అనేకమంది జీవితాలకు చైతన్యం తెచ్చిన వీర సేవకురాలు! అభాగ్యుల జీవితాలలో ఆశాకిరణం! అపోహలు, ఇబ్బందులు వచ్చిన సమయములో మరియతల్లి శరణు వేడుకున్నారు. తన సభను, కన్యాస్త్రీలను నిష్కళంక మాతకు సమర్పణ చేసారు. "నీకులాగా, క్రీస్తును ప్రేమించే హృదయం నాకివ్వు" అని ప్రార్ధించేవారు. జపమాలను జపిస్తూ, మనం ఏ స్థితిలోనైనా నిలబడగలం అని చెప్పేవారు.
పునీత రెండవ జాన్ పౌలు: "క్రీస్తు చెంతకు మరియతల్లి మనల్ని నడిపిస్తుందని నేను నమ్ముచున్నాను. అయితే, క్రీస్తు కూడా అమ్మ దగ్గరకే మనల్ని నడిపిస్తున్నారు. ఎందుకనగా, ఆయనకు అమ్మ దగ్గర ఉండటమే ఇష్టం." యువతకు ఆదర్శ పాలక పునీతులు! జాన్ పౌలు మరియతల్లిని ఎంతగానో ప్రేమించారు. ఆమెను గురించి ఎన్నో విశ్వలేఖలు వ్రాసారు. జగద్గురువులు 13వ లియో జపమాల గూర్చి 12 విశ్వలేఖలు వ్రాసారు. "వెలుగు దేవరహస్యాలను" జపమాలకు జతపరిచారు.
పునీత జాన్ హెన్రి న్యూమాన్: "మరియతల్లి తనకోసం జీవించలేదు. మరియతల్లి అతిసుందరమైన పుష్పం. అందుకే, దేవుడు ఆమెను ఆత్మ శరీరములతో పరలోక భూలోక రాజ్ఞిగా చేశారు."
Let us reflect on two following passages:
Constitutions of CSA:
Blessed Virgin Mary is the Mother of the Church and ours too, and is consecrated to her Divine Son. Our Father Founder, who was offered to the Mother of God by his mother, had tender affection to her and merited the title of "Servant of Mary". Imitating him, we too owe her our filial love and ardent devotion. We conduct ourselves as her dear daughters and handmaids. We have recourse to her powerful intercession, especially by meditating and reciting the Rosary which contains the mysteries of her association with her son Jesus Christ in the work of our redemption" (pp.63-64)
General Directory of CSA:
"We look upon Mother Mary's life and her sharing in the mystery of Christ as a model of our religious consecration. We venerate Mary, our mother, especially by celebrating her feast of the visitation in a solemn manner, on 31st Mary, every year. We pray the rosary together daily as it develops devotion and love towards Blessed Virgin Mary and through her towards Jesus her divine Son" (p. 56).
No comments:
Post a Comment