దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 6వ వారము - శనివారం
యాకోబు 3:1-10; మార్కు 9:2-13
ధ్యానాంశము: యేసు దివ్యరూపమును ధరించుట
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకింపుడు" (9:7).
ధ్యానము: దివ్యరూపధారణ, యేసు జీవితములో జరిగిన మహత్కర సంఘటన. యేసు శ్రమలానంతరం పొందబోవు మహిమకు తార్కాణం. ఇదొక గొప్ప దివ్యదర్శనము. యేసు మెస్సయ్య అని ధృవీకరించబడిన సంఘటన. రాబోవు దైవరాజ్యమునకు సూచన. ఈ అద్భుతమైన సంఘటనను మత్త. 17:1-8; మార్కు. 9:2-9; లూకా. 9:28-36; 2పేతు. 1:16-18లో చూడవచ్చు.
యేసు ప్రభువు సిలువ పాటులు భరించడానికి ఒక ఏడాది ముందుగా తన ప్రియ శిష్యులైన పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని కైసరియా ఫిలిప్పినుండి ఎనిమిది రోజులు ప్రయాణంచేసి అక్కడనున్న ఒక ఉన్నత పర్వతం పైకి ఎక్కివెళ్లారు. ఆ పర్వతం ఏదని పరిశోధింపగా, అది గలిలీయ ప్రదేశంలో తిబేరియా సరస్సుకు దాదాపు రెండువేల అడుగుల ఎత్తున ఉన్న తాబోరు పర్వతంగా క్రీ.శ. 254లో గుర్తించబడింది.
“అచట వారి యెదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లగానయ్యెను. ఆయనతో మోషే, ఏలీయాలు సంభాషించుచున్నట్లు వారికి కనబడిరి” (మత్త. 17:2-3; మార్కు. 9:2-3) మోషే ధర్మశాస్త్రానికి గుర్తుకాగా, ఏలీయా ప్రవక్తలకు ప్రతినిధి. వారు యేసు ప్రభువును ఆరాధించారు. ఆయనతో సంభాషించారు. ఇదే సమయంలో, మేఘ మండలము [మేఘము, దైవసాన్నిధ్యానికి సూచన - నిర్గమ 16:10; 19:9, 16; 24:15-18; 33:9; ఆత్మ దేవుని సాన్నిధ్యం] నుండి, పరలోక తండ్రి దివ్యవాణి మరొక్కసారి “ఈయన నా ప్రియమైన కుమారుడు. ఈయనను గూర్చి నేను ఆనంద భరితుడనైతిని. ఈయనను ఆలకింపుడు” (మత్త. 17:5; మార్కు. 9:7) అని వినిపించెను. యేసు నిజముగా ‘దేవుని కుమారుడు’ అని శిష్యులు అర్ధముచేసుకుంటున్న విషయాన్ని, ఆ వాణి ధృవపరుస్తున్నది.
మహోన్నతమైన గొప్పతనంతో ప్రభువు బహిరంగ జీవితం ఆరంభించడానికి, రాబోవు మహిమలో ముందుగానే రుచిచూసిన భాగ్యంపొంది యేసు ప్రభువు అనుభవింపబోతున్న వేదన, శ్రమలు చూసి, బెదరి చెదరిపోకుండ ప్రభుశిష్యులు తమ విశ్వాసంలో బలపడటానికిగాను ఈ యేసు దివ్యరూపధారణ మహాత్మ్యంయొక్క దృశ్యం పేతురు, యాకోబు, యోహానులలో హృదయం నిండా బాగా వేళ్లూనింది.
దివ్యరూపధారణలో దాగియున్న పరమార్ధము:
ఇప్పటి వరకు శిష్యులచేత ఒక బోధకునిగా, నాయకునిగా, రక్షకునిగా, మెస్సయాగా, పరిగణింపబడిన యేసు, తన నిజస్వరూపమును తెలియపరచడం ఎంతోముఖ్యం. ఫలితముగా, శిష్యుల విశ్వాసము దృఢపరచబడినది. ప్రభువులోనున్న దైవత్వమును చూపించి, ఫలితముగా, శిష్యులను బలపరచియున్నారు. తండ్రి తనకు అప్పగించిన పనిని నెరవేర్చుచున్నారు (యెషయ 42:1-4, లూకా. 9:35. యోహాను. 4:34). తాను మోషేతోను (ధర్మశాస్త్రము), ఏలియాతోను (ప్రవక్తలు) మాట్లాడుటద్వారా తాను ప్రవక్తల ప్రబోధములను, ధర్మశాస్త్రమును రద్దుచేయక, సంపూర్ణ మొనర్చుటకు వచ్చితినని (మత్త. 5:17) తెలియ జేయుచున్నారు.
అలాగే, యేసు దివ్యరూపధారణ, పరలోక పరమరహస్య అనుభూతిని తెలియజేయుచున్నది. పరలోకం అంటే ఒక స్థలము కాదని, అది ఒక వ్యక్తి అని, ఆ వ్యక్తి యేసు క్రీస్తు అని తెలియజేయుచున్నది. యేసు ప్రభువే ఆ దైవరాజ్యము. త్రిత్వైక దేవుడే ఆ పరలోక రాజ్యము (నిత్యజీవము).
యేసు ప్రార్ధనా జీవితానికి తార్కాణం ఆయన దివ్యరూప ధారణ. ప్రార్ధన, తండ్రి-కుమారుల మధ్యననున్న బాంధవ్యము. ప్రభువు ప్రేషిత పరిచర్య అంతయు కూడా అతని ప్రార్ధన ఫలమే!
No comments:
Post a Comment