దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 7వ వారము - సోమవారం
యాకోబు 3:1-10; మార్కు 9:14-29
ధ్యానాంశము: పిశాచ గ్రస్తునకు స్వస్థత - విశ్వాసము, ప్రార్ధన
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "ప్రార్ధన వలన తప్ప మరేవిధమునను ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్య పడదు అని యేసు తన శిష్యులతో చెప్పెను" (9:29).
ధ్యానము: నేటి సువిషేశములో, యేసు ప్రభువు మూగ చెవిటి దయ్యము (9:25) పట్టిన ఒక బాలుని స్వస్థత పరుస్తున్నారు. ఈ పఠనాన్ని మూడు భాగాలుగా విభజించుకొనవచ్చు:
(1) శిష్యులు స్వస్థత చేయలేక పోవడం (9:14-19);
(2) బాలుని తండ్రి విశ్వాసం - ప్రార్ధన (9:20-24);
(3) ప్రార్ధన యొక్క అవసరత (9:25-29);
మొదటిగా, మూగ చెవిటి దయ్యము పట్టిన లేదా ఆవహించిన బాలుని శిష్యుల వద్దకు తీసుకొనిరాగా, శిష్యులు ఆ దయ్యమును వెడలగొట్ట లేకపోయారు. శిష్యులకు స్వస్థత సాధ్యపడక పోవడానికి రెండు కారణాలు స్పష్టముగా తెలియు చున్నవి: మొదటి కారణం, విశ్వాసలేమి లేదా అవిశ్వాసము - ప్రభువు మాటలలో, "మీరు ఎంత అవిశ్వాసులు! నేను ఎంతకాలము మీ మధ్యనుందును? ఎంత వరకు మిమ్ము సహింతును?" (9:19) అని చెప్పెను. రెండవ కారణం ప్రార్ధనలేమి లేదా ప్రార్ధన జీవితం సన్నగిల్లడం! ప్రభువు మాటలలో, "ప్రార్ధన వలన తప్ప మరేవిధమునను ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్యపడదు" (9:29) అని యేసు తన శిష్యులతో చెప్పెను.
శిష్యులు దేవుని వాక్యమును ఆలకించుటలో, వాక్యమునకు స్పందించుటలో వారి వైఫల్యానికి మూగ చెవిటి దయ్యము సూచనగా నున్నది. దేవుని వాక్యములోని నిగూఢ అర్ధాలను తెలుసుకొనుటలో వారు విఫలమయ్యారు. దేవుని శక్తి మాత్రమే దయ్యములను వెడలగొట్ట గలదు. విశ్వాసము లేకుండా ఏ కార్యాలు దయ్యములను వెడలగొట్టలేవు. యేసు, తన అద్భుత శక్తి వలన, కార్యాల వలన దయ్యములను, పిశాచ శక్తులను జయించారు. తన ఉత్థానం ద్వారా సాతాను శక్తిని జయించారు. శిష్యులు ప్రార్ధనను నిర్లక్ష్యం చేయుట వలన, సాతాను శక్తులను జయించలేక పోయారు. ఏ దుష్టత్వమునైనను విశ్వాసము, ప్రార్ధనతో జయించవచ్చు.
విశ్వాసము, ప్రార్ధన ఎంతో అవసరం, తప్పనిసరి!
బాలుని తండ్రి విశ్వాసం మెచ్చదగినది. తండ్రి విశ్వాసం, కుమారునికి స్వస్థత కలిగేలా చేసింది. ఆ బాలుని తండ్రి, "నేను నమ్ముచున్నాను" అని తన విశ్వాసాన్ని వెల్లడి చేసాడు. అలాగే, "నాకు అవిశ్వాసము లేకుండునట్లు తోడ్పడుము" అని ప్రార్ధన చేసాడు (9:24). విశ్వాసం మరియు ప్రార్ధన; రెండింటినీ ఆ తండ్రిలో చూస్తున్నాము. మన జీవితములో ఈ రెండు ఎంత ముఖ్యమైనవో స్పష్టమగుచున్నది. "విశ్వసించు వారికి అంతయు సాధ్యమే" (9:23) అని యేసు పలికారు.
విశ్వాసము, ప్రార్ధన, సంఘము యొక్క మద్దతు ఉంటె, పరిపూర్ణ పరివర్తన సాధ్యమని నిరూపితమైనది. బాధల సమయములో శిష్యులు విశ్వాసం కలిగి యుండాలని అర్ధమగుచున్నది. వారి నమ్మకం బలపడాలంటే, ప్రార్ధన తప్పనిసరి!
క్రీస్తు తన ఉత్థాన మహిమ ప్రదర్శన!
అయితే, అక్కడ జరిగింది కేవలం స్వస్థత మాత్రమే కాదు; క్రీస్తు తన ఉత్థాన మహిమను ఈ స్వస్థత ద్వారా ముందుగానే ప్రదర్శించారు! యేసు, "మూగ చెవిటి దయ్యమా! ఈ బాలుని విడచి పొమ్ము. మరెన్నడు వీనిని ఆవహింపకుము" (9:25) అని శాసించినపుడు, ఆ భూతము ఆర్భటించుచు, బాలుని విలవిలలాడించి వెళ్ళిపోయెను. బాలుడు పీనుగువలె పడిపోయెను. ప్రభువు అంత గొప్ప అద్భుతం చేసినను, సమూహములో కొంతమంది విశ్వసింపలేదు. బాలుడు పడిపోయినప్పుడు, అనేకులు వాడు చనిపోయెననిరి. కాని, యేసు వాని చేతిని పట్టి లేవనెత్తగా వాడు లేచి నిలుచుండెను" (9:26-27).
నేడు మనలో ఉన్న పిశాచాల నుండి (గర్వం, ద్వేషం, కామం, అసూయ, స్వార్ధం...) విముక్తి, విడుదల, స్వస్థత కావాలి! విశ్వాసముతో, ప్రార్ధన చేద్దాం!
No comments:
Post a Comment