దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 7వ వారము - బుధవారం
యాకోబు 4:13-17; మార్కు 9:38-40
ధ్యానాంశము: అనుకూలుడు - ప్రతికూలుడు
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "మనకు విరోధికాని వాడు మన పక్షమున ఉండువాడు" (9:40).
ధ్యానము: దైవరాజ్యము అందరి కొరకు అని నేటి సువిశేష భాగం బోధిస్తుంది. క్రీస్తు సువార్త అందరి కొరకు! నేటి సువిషేశములో, యేసును-శిష్యులను అనుసరింపని ఒకడు యేసు పేరిట దయ్యములను పారద్రోలుట చూచి వానిని నిషేధించితిమి అని శిష్యుడు యోహాను యేసుతో చెప్పుచున్నాడు. బహుశా, శిష్యులు వాని పట్ల అసూయ చెందారు. వారిలో ఒకలాంటి నిరాశ కనిపిస్తుంది. ఎందుకంటే, ఇంతకు ముందు, శిష్యులు ఒక బాలునిలోని మూగదయ్యమును వెడలగొట్టలేక పోయారు (మార్కు 9:17-18). ఇప్పుడు, ఎవరో ఆ పని చేస్తుండటముతో, వారిలో నిరాశ, అసూయ!
వెంటనే యేసు, వారితో, "మీరు అతనిని నిషేధింప వలదు. ఏలయన, నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధికాని వాడు మన పక్షమున ఉండువాడు" (9:39-40). మనమందరమూ దేవుని బిడ్డలమే! దేవుని కృప లేనిచో, ఎవరు మంచి కార్యాలు చేయలేరు.
ఇలాంటి సంఘటనే, పాత నిబంధన గ్రంథములోకూడా చూడవచ్చు. మోషే ఎన్నుకున్న డెబ్బదిమంది పెద్దలు ఆత్మను పొందగానే, వారు ప్రవచనములు పల్కిరి (సంఖ్యా 11:25). అయితే, డెబ్బదిమంది పెద్దలలో లేని ఎల్దాదు, మేదాదు అను ఇద్దరిపై కూడా ఆత్మ దిగివచ్చినది. వారును వెంటనే ప్రవచనములు పల్కిరి (11:26). అప్పుడు యెహోషువ, మోషే వద్దకు వచ్చి, "అయ్యా! వారిని ప్రవచింప వలదని చెప్పుము" అని అనెను (11:28). కాని మోషే అతనితో, "ఓయి! నా యెడలగల అభిమానముచే నీవు వారిమీద అసూయ పడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికి ఆత్మను అనుగ్రహించి వీరిచేగూడ ప్రవచనములు పల్కించిన ఎంత బాగుండెడిది" అని అనెను (11:29).
పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఆరంభమునుండి యేసుకు ప్రతికూలముగా ఉన్నారు; కాని ఈ వ్యక్తి వారివలె గాక, అనుకూలునిగా ఉన్నాడు. యేసు అతని పనిని సమర్ధిస్తూ, శిష్యులను కూడా అలాగే చేయమని ప్రోత్సహిస్తున్నారు. అయితే, యేసు నామము శక్తిగల నామము; ఆ నామమును దుర్వినియోగం చేయకూడదు; స్వార్ధంకొరకు, స్వలాభంకొరకు ఉపయోగించ కూడదు. అ.కా. 19:13-16లో యూదులు కొందరు, యేసు నామమున దయ్యములను వెడలగొట్టడానికి ప్రయత్నం చేసారు. కాని వారు చేయలేక పోయారు. వారందరు వస్త్రహీనులై గాయపడి పరుగెత్తారు. బహుశా, యేసునందు వారికి సంపూర్ణ విశ్వాసం లేకపోయి యుండవచ్చు! యేసు నామమునందు సంపూర్ణ విశ్వాసమును కలిగి యుండాలి!
ఇతరులపట్ల, మంచి చేయువారిపట్ల, అసూయ కలిగియుండక, మన విశ్వాసం ఎలాంటి కార్యాలు చేయునో దృష్టిని సారించాలి.
No comments:
Post a Comment