దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 6వ వారము - మంగళవారం
యాకోబు 1:12-18; మార్కు 8:14-21
ధ్యానాంశము: పరిసయ్యుల 'పులిసిన పిండి'
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "పరిసయ్యుల పిండిని గూర్చియు, హేరోదు పులిసిన పిండిని గూర్చియు, జాగరూకులై ఉండుడు అని యేసు శిష్యులను హెచ్చరించెను" (మార్కు 8:15; మత్త 16:6).
ధ్యానము: 'పులిసిన పిండి' (yeast or leaven) కి ఇతర మొత్తం పిండిని పులియబెట్టే శక్తి ఉంటుంది. ప్రభువునకు దహన బలులు అర్పించు ధాన్యబలులలో పులియజేయు పదార్ధము నిషేధింప బడినది (లేవీ 2:11). యూద సంప్రదాయములో, 'పులిసిన పిండి' చెడుకు సంకేతం. 'పులిసిన పిండి' అవినీతికర శక్తికి, వక్రబుద్దికి చిహ్నము. పరిసయ్యులు వారి అవినీతికరమైన శక్తిపై ఆసక్తిని కలిగియుండి, యేసును మెస్సయ్యగా గుర్తించలేక పోయారు. ఈవిధముగా, పరిసయ్యుల వంచక బుద్ధిని, కపట భక్తిని, దుర్బోధనల గురించి యేసు హెచ్చరించుచున్నారు.
అలాగే మరోప్రక్క శిష్యులుకూడా యేసును ఇంకా పూర్తిగా అర్ధంచేసుకొన లేక పోవుచున్నారు. పరిసయ్యుల, హేరోదు 'అవినీతి మార్గము' గురించి హెచ్చరించు చుండగా, శిష్యులు మాత్రం దానిని అర్ధం చేసుకొనలేక పోయారు (ఆధ్యాత్మికముగా చూడలేక పోవటం, వినలేక పోవటం - 8:18). యేసు నిజస్వరూపమును వారు ఇంకా గుర్తించలేక ఉన్నారు. వారి యొద్ద రొట్టెలు లేనందున యేసు అట్లు పలికేనేమో అని అనుకున్నారు. యేసు దానిని గ్రహించి, శిష్యులకు ఏడు ప్రశ్నలను సంధించారు (8:17-20).
ప్రభువును గుర్తించక పోవడానికి, అంగీకరించక పోవడానికి కారణం 'హృదయ కాఠిన్యత' (8:17; చదువుము 6:52). వారి హృదయ కాఠిన్యత వలన, రెండుసార్లు ఆహార విషయములో గొప్ప అద్భుతాలు చేసినను, ప్రభువు బోధనలను ఆలకించినను, వారు ప్రభువును అర్ధంచేసుకొనలేక పోవుచున్నారు. వినే హృదయాన్ని వారు ఇంకను కలిగి లేకున్నారు. అందుకే వారిని కూడా హెచ్చరిస్తున్నారు. హృదయ కాఠిన్యత మరియు కపటబుద్ధి నిజమైన మారుమనస్సుకు, హృదయపరివర్తనమునకు గొప్ప అడ్డంకులు. దేవుడు మాత్రమే కఠిన హృదయాన్ని మార్చగలరు; "మీకు నూతన హృదయమును దయ చేయుదును. నూతన ఆత్మను మీలో నుంచెదను. మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును" (యెహెజ్కె 36:26).
విశ్వాసము, మారుమనస్సు దైవవరములు. వీటి కొరకు ప్రార్ధన చేద్దాం! దుర్బుద్ధినుండి, కపటబుద్ధి నుండి కాపాడమని ప్రార్ధన చేద్దాం! దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. చెడు మార్గమున నడిపించు వారిపట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. మనము ఇతరులను మంచి మార్గములో నడిపించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మన జీవితములో చేసిన కార్యములను ఎప్పుడు "జ్ఞప్తికి తెచ్చుకోవాలి" (8:18), అలాగే, ఎల్లప్పుడు, దేవునికి కృతజ్ఞులమై జీవించాలి.
No comments:
Post a Comment