దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 6వ వారము - సోమవారం
యాకోబు 1:1-11; మార్కు 8:11-13
ధ్యానాంశము: పరిసయ్యుల వంచక బుద్ధి
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "ఈ తరమువారు ఏల ఒక గురుతును కోరుచున్నారు? వారికి ఎట్టి గురుతును ఈయబడదని నిశ్చయముగ చెప్పుచున్నాను" (మార్కు 8:12).
ధ్యానము: నాలుగు వేల మందికి ఆహారము పంచిన 'అద్భుతము' తరువాత, యేసు ఒక పడవను ఎక్కి, శిష్యులతో 'దల్మనూతా' ప్రాంతమునకు వెళ్ళారు. ఇది యూదులు ఉండే ప్రాంతము. అచట మరొకసారి పరిసయ్యులు యేసును శోధించడం, ఆయనతో వాదించడం చూస్తున్నాము. యేసు అప్పటికే తన బోధనలద్వారా, అద్భుతములద్వారా, స్వస్థతలద్వారా ఎన్నో గురుతులను చూపారు. అయినను, పరిసయ్యులు యేసును "శోధించుచు" ['ఉచ్చులో పడవేయడానికి' అని అర్ధము], "పరలోకమునుండి ఒక గురుతును చూపుము" అని ఆయనతో వాదింప సాగారు (8:11). యేసు తన బోధనలద్వారా, అద్భుతములద్వారా, స్వస్థతలద్వారా తన "శక్తిని" (మార్కు 5:30) ప్రదర్శించారు. 'దేవుని సువార్త' ఆలకించ గలిగే హృదయానికి ఇవ్వబడిన అంత:ర్గత గురుతు. దేవుని సువార్త, అంత:ర్గత కన్నులను విప్పి చూడగలుగునట్లు, చెవులను తెరచి వినగలుగునట్లు చేయును. దైవవరమైన విశ్వాసము ప్రభువు మార్గమును గ్రహించునట్లుగ చేయును.
ఏదేమైనను, పరిసయ్యుల లేదా సాతాను 'ఉచ్చు'లో యేసు పడటము లేదు. వారి వంచక బుద్ధిపట్ల జాగ్రత్తగా ఉండాలని, వారి ఉచ్చులో పడకూడదని శిష్యులనూ హెచ్చరించారు (7:15). మెస్సయ్య రాకడ, అనేక సంకేతములతో, అద్భుతాలతో ఉంటుందని ఆనాటి ప్రజలు ఆశించారు. అందుకే పరిసయ్యులు "గురుతును చూపుము" అని అడిగారు. వారు "గురుతు"ను అడగడములో ఎలాంటి తప్పు లేదు. అయితే, యేసు అప్పటికే ఎన్నో గురుతులను చూపినను, ఆనాటి పరిసయ్యులు యేసును విశ్వసించ లేదు. వారు యేసును అవమానపరచ చూచారు. ఆయన అధికారాన్ని అణగద్రొక్క చూచారు. ప్రజాదరణ కోల్పోయేలా చేయాలని చూచారు. వారి వంచక బుద్ధిని ప్రభువు గ్రహించారు. అందులకే ఆయన వేదనతో, "ఈ తరమువారు ఏల ఒక గురుతును కోరుచున్నారు? వారికి ఎట్టి గురుతును ఈయబడదని నిశ్చయముగ చెప్పుచున్నాను" (మార్కు 8:12) అని చెప్పారు. ఒకానొక సందర్భములో, యేసు యూదులతో, "నేను మీకు చెప్పితిని. కాని, మీరు నమ్ముట లేదు. నా తండ్రి పేరిట నేను చేయు పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నా గొర్రెలలో చేరినవారు కారు. కనుక, మీరు నమ్ముట లేదు" (యోహాను 10:25-26) అని స్పష్టం చేసియున్నారు.
మన సంగతేమిటి? మన అనుదిన జీవితములో దేవుడు చేయుచున్న అద్భుత కార్యములను విశ్వసించు చున్నామా? దేవునికి కృతజ్ఞతలు చెల్లించు చున్నామా? ప్రతీరోజు, దేవుడు తననుతాను మనకు బహిర్గత మొనర్చుతున్నారు. విశ్వసించు చున్నామా? అయినను, అద్భుతాలను బట్టి, మన విశ్వాసం ఉండకూడదు. మన విశ్వాసము సంపూర్ణముగా యేసునందు ఉండాలి.
No comments:
Post a Comment