సామాన్య 6వ వారము -బుధవారం (II)

  దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 6వ వారము -బుధవారం
యాకోబు 1:19-27; మార్కు 8:22-26

ధ్యానాంశము: దృష్టి దానము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "యేసు మరల వాని కన్నులను తాకి సూటిగా వానివైపు చూడగా, వాడు స్వస్థుడై స్పష్టముగా చూడగలిగెను." (మార్కు 8:25).
ధ్యానము: మార్కు 7:31-37లో మూగ, చెవిటి వానికి యేసు స్వస్థతను చేకూర్చారు. శిష్యులు చెవులుండి యేసు బోధనలను వినగలిగను, అర్ధము చేసుకోవడములో విఫలమయ్యారు. నేటి సువిశేష పఠనములో, బెత్సయిదా గ్రామమున, యేసు గ్రుడ్డివానికి చూపును దయచేయుచున్నారు. యేసు చేసిన ప్రతీ అద్భుత కార్యాన్ని, శిష్యులు కనులారా చూసారు. వారికి చూచుటకు కనులున్నను, యేసు బోధనలకు-కార్యాలకు మధ్యనగల సంబంధాన్ని గుర్తించలేక పోయారు.

ప్రభువు, ఈ అద్భుతాన్ని ఒకేసారి గాక, అంచెలంచెలుగా లేదా దశల వారీగా చేసారు. మొదటిగా, యేసు వాని చేయి పట్టుకొని, ఊరి వెలుపలకు తీసికొనిపోయి, వాని కన్నులను ఉమ్మినీటితో తాకి, తన చేతులను వానిపై ఉంచారు (8:23). రెండవదిగా, యేసు మరల వాని కన్నులను తాకి సూటిగా వానివైపు చూచారు (8:25). అప్పుడే, ఆ వ్యక్తి సంపూర్ణ స్వస్థతను పొందియున్నాడు. ప్రభువు ఒకేసారి స్వస్థత చేకూర్చకుండా, ఎందుకు ఇలా చేసారు? దీనిలోని నిగూఢ అర్ధమేమిటి? మారుమనస్సు (హృదయ పరివర్తనము), విశ్వాస వికాసము ఒకేసారిగాక, అంచెలంచెలుగా, వివిధ జీవితానుభవాలను బట్టి ఉంటుందని అర్ధము. మారుమనస్సు, విశ్వాస వికాసము అనుదినము మన జీవితములో జరిగే ప్రక్రియలు.

యూదులు, కొన్నిసార్లు గ్రుడ్డితనాన్ని, అవిధేయతకు శిక్షగా పరిగణించేవారు (1 సమూ 11:2). అలాగే, గ్రుడ్డితనం, ఆధ్యాత్మిక విషయాలలో అజ్ఞానాన్ని లేదా ఆధ్యాత్మిక అంధత్వాన్ని సూచిస్తుంది (యెషయ 6:10; 42:18). అంధులపట్ల కరుణ, శ్రద్ధ కలిగి వ్యవహరించాలని లేవీయ కాండము 19:14లో చూస్తున్నాం. 

శారీరక అంధత్వముకన్న, ఆధ్యాత్మిక అంధత్వము చాలా తీవ్రమైనది. అందుకే, యేసు ఆ వ్యక్తితో, "తిరిగి ఆ ఊరు వెళ్ళవద్దు" (8:26) అని ఆజ్ఞాపించారు. ఆధ్యాత్మిక అంధత్వము గలవారి పట్ల జాగరూకులై ఉండాలని అర్ధం. ఆధ్యాత్మిక అంధత్వముతో నున్నప్పుడు, దేవుని మార్గమును చూడలేము.

గ్రుడ్డివాడు, తనకుతానుగా గాక, "కొందరు ప్రజలు" [అతని స్నేహితులై ఉండవచ్చు] యేసు వద్దకు అతనిని తీసికొని వచ్చి, వానిని తాకవలయునని ఆయనను ప్రార్ధించిరి (8:22). మనలను రక్షణ మార్గములో నడిపించడానికి దేవుడు ఇతరుల సహాయమును అందిస్తూ ఉంటారు. అలాగే మనము ఇతరులను క్రీస్తు రక్షణ మార్గములో నడిపించే ప్రయత్నం చేయాలి.

No comments:

Post a Comment