దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 6వ వారము - గురువారం
యాకోబు 2:1-9; మార్కు 8:27-33
ధ్యానాంశము: యేసు ప్రశ్న - పేతురు సమాధానము ("నేను ఎవరు?" - "నీవు క్రీస్తువు")
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: పేతురు "నీవు క్రీస్తువు" అని ప్రత్యుత్తర మిచ్చెను (మార్కు 8:29).
ధ్యానము: యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు (ఎక్కువగా గ్రీకులు, రోమనులు ఉండే ప్రాంతం) వెళ్ళుచూ, మార్గమధ్యమున "ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు?" అని అడిగారు. "కొందరు బప్తిస్త యోహాను అని, మరికొందరు ఏలియా అని, లేదా మరియొక ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు" అని సమాధానం ఇచ్చారు. హేరోదుతో సహా ప్రజలు ఇలా అనుకోవడం మార్కు 6:14-15లో చూడవచ్చు. వారు మెస్సయ్య గురించి బిన్నాభిప్రాయాలను కలిగి యున్నారు. దావీదు మహారాజు వారసుడిగా, రోమను సామ్రాజ్యాన్ని నాశనం చేసి, ఇశ్రాయేలు రాజ్య కీర్తిని తిరిగి స్థాపిస్తాడని భావించారు.
అప్పుడు యేసు "మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు?" (వ్యక్తిగత ప్రశ్న) అని ప్రశ్నింపగా, పేతురు, "నీవు క్రీస్తువు" అని సమాధాన మిచ్చాడు. పేతురు (మరియు ఇతర శిష్యులు) యేసును అభిషిక్తునిగా, మెస్సయ్యగా, క్రీస్తుగా గుర్తించారు. [Christos - "క్రీస్తు" గ్రీకు పదం; "మెస్సయ్య" హీబ్రూ పదం. మెస్సయ్య అనగా 'అభిషిక్తుడు' అని అర్ధం]. మార్కు తన సువార్తను "దేవుని కుమారుడు యేసు క్రీస్తు సువార్త" (1:1) అంటూ ప్రారంభించాడు. యేసు కూడా స్వయముగా "నేనే క్రీస్తు" అని చెప్పారు: ప్రధానార్చకుడు 'దేవుని కుమారుడవు అగు క్రీస్తువు నీవేనా?' అని ప్రశ్నింపగా, అందుకు యేసు "ఔను, నేనే" అని సమాధాన మిచ్చారు (మార్కు 14:61-62).
వారి ప్రయాణం, గలిలీయ ప్రాంతము నుండి, యెరూషలేము వైపునకు మొదలైనది. ఇది యేసు శ్రమల, మరణం వైపునకు పయణం. బహుషా, అందులకే ప్రభువు తనను గురించి ప్రజలుగాని, శిష్యులుగాని ఎలా అర్ధం చేసుకొనుచున్నారో తెలుసుకోవాలని అనుకున్నారు. అందుకే యేసు శిష్యులకు, "మనుష్యకుమారుడు [బాధామయ సేవకునిగా] అనేక శ్రమలను అనుభవించి, పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్రబోధకులచే [Sanhedrin, యూదప్రజలకు న్యాయసభ, న్యాయస్థానం] నిరాకరించబడి, చంపబడి, మూడవరోజున ఉత్థాన మగుట అగత్యము" అని ఉపదేశించారు (8:31). "నీవు క్రీస్తువు" అని చాటిచెప్పిన పేతురుకు ఈ విషయం బోధపడలేదు. అందుకే, పేతురు యేసును ప్రక్కకు తీసికొనిపోయి, "అట్లు పలుకరాదు" అని వారించాడు (8:32). దీనిని బట్టి, శిష్యులు యేసును "క్రీస్తు, మెస్సయ్య"గా గుర్తించారు, కాని దానిలోని అర్ధాన్ని గ్రహించలేక పోయారు. బహుశా, పేతురు మరియు ఇతర శిష్యులు, మెస్సయ్య అంటే ఒక రాజుగా యూదులను పాలిస్తాడని, రోమను సామ్రాజ్యాన్ని కూలద్రోస్తాడని భావించి ఉంటారు! యేసు శిష్యులవైపు చూచి, "సైతాను! నీవు నా వెనుకకు పొమ్ము. నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని, దేవునికి సంబంధించినవి కావు" (8:33) అని అన్నారు. ప్రభువు ఉత్థానము తరువాత, మెస్సయ్య అనగా ఏమిటో, శిష్యులకు అర్ధమయినది.
యేసు నాకు ఎవరు? అని ప్రతి ఒక్కరం ప్రశ్నించుకోవాలి! యేసు గురించి ఎన్నో విన్నాము, చదివాము. కాని, ప్రభువు మనలనుండి మన వ్యక్తిగత అభిప్రాయాన్ని కోరుచున్నారు. ప్రభువును తెలుసుకోవాలంటే, జ్ఞానం ఉంటె సరిపోదు. ఆయన జీవిత బాటలో మనం పయనించాలి; ఆయనవలె ప్రేమించాలి, క్షమించాలి.
No comments:
Post a Comment