దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 5వ వారము - శనివారం
1 రాజు 12:26-32; 13:33-34; మార్కు 8:1-10
ధ్యానాంశము: నాలుగు వేల మందికి ఆహారము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "ఏడు రొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి, వానిని త్రుంచి, వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను" (మార్కు 8:6).
ధ్యానము: ఈ అద్భుతము అన్యులు ఉండు ప్రాంతములో జరిగినది. ఈ ఉదాంతములో, జన సమూహము యేసు ప్రభువుతో మూడు రోజులు ఉండిరి. వారిలో కొంతమంది చాలా దూర ప్రాంతముల నుండి వచ్చియున్నారు. జన సమూహము యేసు వద్దకు ఎందుకు వచ్చినది చెప్పబడ లేదు. ఆయన బోధనలను, దేవుని సువార్తను ఆలకించుటకు వచ్చి యుండవచ్చు. యేసు వారికి దైవ రాజ్యము గురించి బోధనలను చేసి యుండవచ్చు.
మూడు రోజులు గడచి పోవుట వలన, వారి యొద్ద తినుటకు భోజనము లేకుండెను. అప్పుడు, "ఏడు రొట్టెల"తో నాలుగు వేల మందికి ఆహారమును పెట్టియున్నారు. అందరు సంతృప్తిగా భుజించిన తరువాత, మిగిలిన భోజనమును ఏడు గంపలకు నింపిరి. యేసు అనంతమైన ప్రేమకు ఇదంతా గొప్ప నిదర్శనం!
ఐదువేల మందికి ఆహారము పెట్టినప్పుడు (మార్కు 6:30-44), మిగిలిన రొట్టె ముక్కలను పండ్రెండు గంపలకు నింపిరి. పండ్రెండు నంబరు [విశ్వజనీనతకు సూచన] పండ్రెండు ఇశ్రాయేలు గోత్రములకు, పండ్రెండు అపోస్తలులకు సూచనగా ఉండినది. ఇక్కడ ఏడు నంబరు [పరిపూర్ణత, సంపూర్ణత, దైవత్వములకు సూచన - దేవుడు సృష్టిని ఆరు రోజులలో పూర్తిచేసి ఏడవ దినమున విశ్రాంతి పొందెను; నామాను ఏడు సార్లు నీటిలో మునిగి స్వస్థత పొందెను], యెరూషలేములో, గ్రీకు మాట్లాడెడి క్రైస్తవుల ఏడుగురు నాయకులకు సూచనగా నున్నది (అ.కా. 6:1-6). దేవుడు అందరిని తన పరిపూర్ణతలోనికి ఆహ్వానిస్తున్నారు.
ఈ అద్భుతం దివ్యబలి పూజకుకూడా సూచనగా నున్నది. దివ్యపూజలో, క్రీస్తు తననుతాను భోజనముగా ఇచ్చుటను సూచిస్తుంది. ఐదువేల మందికి ఆహారము పంచుట యూదులకు 'దివ్యసత్ర్పసాదము'ను సూచిస్తే, ఇక్కడ నాలుగు వేల మందికి ఆహారము పంచుట అన్యులకు 'దివ్యసత్ర్పసాదము'ను సూచిస్తుంది. ఇది ఎంత గొప్ప భాగ్యం! అనుగ్రహం!
మన అనుదిన జీవితములో ఏదైనా కొరత కలిగినప్పుడు, ఎవరి వైపుకు చూస్తాము? క్రీస్తుపై మన సంపూర్ణ నమ్మకము ఉంచాలి. దేవునిపై ఆధారపడి జీవించాలి. దివ్యపూజలో శాశ్వత భోజనాన్ని స్వీకరిస్తున్నాము.
No comments:
Post a Comment