సామాన్య 5వ వారము - గురువారం (II)

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 5వ వారము - గురువారం
1 రాజు 11:4-13; మార్కు 7:24-30

ధ్యానాంశము: సిరోపెనిష్యా స్త్రీ విశ్వాసము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "యేసు, బిడ్డలు మొదట తృప్తి చెందవలెను. బిడ్డల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయుట తగదు అని పలికెను. అప్పుడు ఆమె, అది నిజమే స్వామీ! కాని, బిడ్డలు పడవేయు రొట్టె ముక్కలను భోజనపు బల్లక్రింద ఉన్న కుక్క పిల్లలును తినునుగదా! అని బదులు పలికెను. అందుకు యేసు, నీ సమాధానము మెచ్చదగినది అని చెప్పెను" (మార్కు 7:27-29).
ధ్యానము: "అపుడు యేసు ఆ స్థలమును వీడి, తూరు, సీదోను ప్రాంతములకు వెళ్ళెను" (7:24). తూరు, సీదోను ప్రాంతములు అన్యులు ఉండే ప్రాంతములు. ఈ ప్రాంతం ఏలియా ప్రవక్తకు శత్రువైన ఎసెబెలు వచ్చిన ప్రాంతం. ఈ ప్రాంతం ప్రవక్తల కోపానికి గురియైనది (యెహెజ్కె 26:15-17; జెకర్యా 9:3). యేసు ఇలాంటి ప్రదేశాన్ని సందర్శించడం విశేషం! ఆయన ప్రజలను విభజించే అడ్డుగోడలను బ్రద్దలు చేయడానికి వచ్చాడు. ఆయన అందరి రక్షణార్ధమై ఈ లోకానికి వచ్చారు. ప్రభువు ఎందులకు ఈ ప్రాంతానికి వచ్చారో స్పష్టత లేదు. బహుశా, గలిలీయ పరిచర్య తరువాత, జనసమూహములనుండి ఏకాంతము కొరకు వచ్చి యుండవచ్చు. లేదా బహుశా, తన శిష్యులతో ఏకాంతముగా గడపాలని ఆశించి యుండవచ్చు! "ఆయన ఒక గృహమున ప్రవేశించి, అచట ఎవ్వరికి తెలియకుండ ఉండగోరెను" (7:24). అది బహుశా యూద కుటుంబమునకు చెందిన గృహమై యుండవచ్చు! ఎవరికీ తెలియకుండ ఉండ ప్రభువు తలంచారు, "కాని అది సాధ్య పడ లేదు" (7:24).

అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తెగల ఒక స్త్రీ యేసును గూర్చి విని వచ్చి, ఆయన పాదములపై పడి, దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరచుమని ప్రార్ధించెను. ఆమె గ్రీసు దేశీయురాలు. సిరోపెనిష్యాలో పుట్టినది (7:25-26). ఆమె అన్యురాలు, అనగా యూదేతరురాలు. పెనిష్యా పశ్చిమాన మధ్యధరా సముద్రం మరియు తూర్పున పర్వతాలతో సరిహద్దులుగా ఉన్న పొడవైన ఇరుకైన తీరప్రాంతం - ఆధునిక లెబనాన్ తీర మైదానం. దీని దక్షిణ సరిహద్దు కార్మెల్ కొండ (గలిలీ సముద్రానికి తూర్పున) మరియు అది అక్కడి నుండి ఉత్తరంగా దాదాపు 185 మైళ్ళు (300 కిమీ) విస్తరించి ఉంది. ప్రధాన నగరాలలో టోలెమైస్, తూరు మరియు సీదోను ఉన్నాయి. సిరోపెనిష్యా అనగా ఈ స్త్రీని సిరియా మరియు పెనిష్యాతో కలుపుతుంది. యేసును గూర్చి విని వచ్చినది: 'చూచుట', 'వినుట' పరివర్తనమునకు, విశ్వాసమునకు ప్రాముఖ్యమైనవి. ఆమె యేసు పాదములపై పడినది: మారుమనస్సుకు, హృదయ పరివర్తనమునకు సూచనలు. ఏమిలేమితనమునకు, విశ్వాసమునకు గురుతు.

యేసు సమాధానం మనందరిని ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురి చేస్తుంది - "యేసు, బిడ్డలు మొదట తృప్తి చెందవలెను. బిడ్డల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయుట తగదు" (7:27). ఇచట "బిడ్డలు" అనగా  బహుశా 'ఇశ్రాయేలు ప్రజలు' (నిర్గమ 4:22; ద్వితీ 14:1; హోషె 11:1). మార్కు సువార్తకన్న ముందుగా వ్రాయబడిన రోమీయులకు పౌలు లేఖ 1:16లో, "మొదట యూదులకు, తరువాత గ్రీకులకు కూడా" రక్షణ అని చదువుచున్నాం. ప్రతీ పనిలో సహజమైన క్రమం అనేది ఉంటుంది. ఉదా. ఇల్లుకట్టువారు మొదటగా గట్టి పునాది వేయాలి, ఆ తరువాతే గోడలు కట్టాలి. అన్యులకు పరిచర్య తగిన సమయములో వచ్చునని ప్రభువుకు తెలుసు! కాని, ఆమె సమాధానాన్ని యేసు మెచ్చుకున్నారు. వినయముతో కూడిన గొప్ప విశ్వాసముతో ఆమె సమాధాన మిచ్చినది: "అది నిజమే స్వామీ! కాని, బిడ్డలు పడవేయు రొట్టె ముక్కలను భోజనపు బల్లక్రింద ఉన్న కుక్క పిల్లలును తినునుగదా!" మెస్సయ్య విందులో అన్యులు పాల్గొనడములో హాని ఏముంది? యేసు ఆమెతో, "నీ కుమార్తె స్వస్థత పొందినది. ఇక నీవు పోయిరమ్ము" (7:29) అని చెప్పారు. యేసు ఆ స్త్రీ గృహమునకు వెళ్ళలేదు. ఆ బాలికను తాకలేదు. కాని, ఆ బాలిక స్వస్థత పొందినదని తెలిపారు. మత్తయి 15:28లో యేసు ఆమె విశ్వాసాన్ని మెచ్చారు. ప్రభువు మాటలను ఆమె విశ్వసించి, వెంటనే ఇంటికి వెళ్లి పోయినది.

ఈ ఉదాంతము నుండి 'నిరంతర ప్రార్ధన' యొక్క విలువను గ్రహించాలి. ఆ స్త్రీ పట్టుదలతో ప్రార్ధించి, తన విశ్వాసాన్ని వెల్లడి చేసింది. ఆ స్త్రీ ప్రేమ గల తల్లి అని నిరూపించుకున్నది. తన బిడ్డకోసం, ఎన్ని మాటలైనా పడటానికి సిద్ధపడింది. ఆ స్త్రీ వినయాన్ని కూడా గ్రహించాలి. క్రీస్తును గూర్చిన సువార్తను చూచువారందరికి, వినువారందరికి, దేవుని రాజ్యము  అందుబాటులోనున్నదని, ఈ ఉదాంతం తెలియజేయు చున్నది.

No comments:

Post a Comment