దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 5వ వారము - బుధవారం
1 రాజు 10:1-10; మార్కు 7:14-23
ధ్యానాంశము: మాలిన్య పరచు క్రియలు
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "వెలుపలనుండి లోపలి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియును లేదు. కాని, లోపలనుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయును" (మార్కు 7:15).
ధ్యానము: పిదప యేసు జనసమూహమును తిరిగి పిలిచి, "వెలుపలనుండి లోపలి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియును లేదు. కాని, లోపలనుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయును" అని బోధించెను (7:14-15). ప్రజలు ప్రభువు బోధనలను ఆలకించడానికి ఆసక్తిని చూపారని అర్ధమగుచున్నది. అయితే, ఈ బోధన శిష్యులకు అర్ధము కాలేదు. వారు దాని భావమును వివరింపుమని ప్రార్ధించారు (7:17). అప్పుడు ప్రభువు వారికి వివరించారు (7:18-20). మనలను అపవిత్రము చేయునది మనము భుజించే ఆహారము కాదు, కాని మన హృదయమునుండి వెలువడు చెడు ఆలోచనలు, భావాలు అని ప్రభువు వారికి వివరించారు (ఉదా. మత్త 5:28). దుష్ట హృదయమునుండి వెలువడు చెడుగులు మనలను అపవిత్రము చేయును - దురాలోచనలు, వేశ్యాసంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము (7:21-22).
వీటిలో ఎక్కువగా పది ఆజ్ఞలను ఉల్లంఘించేవి ఉన్నాయి. అనైతిక ప్రవర్తనకు దారితేసే ఆలోచనలపట్ల జాగరూకులమై యుండాలి. ఈ దురాలోచనలే ఘోరమైన పాపాలకు దారితీస్తాయి. చెడుగులు అన్ని మన హృదయమునుండి వెలువడుతాయి కనుక మనలను మనం అదుపులో ఉంచుకోవాలి. హృదయంనుండి వెలువడు చెడు మన / ఇతరుల గౌరవాన్ని, ప్రతిష్టను, విశ్వసనీయతను, స్నేహాన్ని నాశనం చేస్తాయి. కనుక, ఇతరులను నిందిస్తే లాభం లేదు. చెడు విషయాలకన్న, మన హృదయాలలో, మంచి విషయాలను పెంపొందించుకొనే బాధ్యత మనపై యున్నది. శరీరములోనికిగాక, మన హృదయములోనికి, మనస్సులోనికి వెళ్ళే వాటిపై ఎక్కువ శ్రద్ధను పెట్టాలి. ఎందుకన, అవి మనలను ఆధ్యాత్మికముగా, భౌతికముగా హానికలిగించే అవకాశం ఉన్నది. "శరీరమును మాత్రము నాశనము చేయగలిగి, ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడ కూడదు. ఆత్మను, శరీరమును కూడ నరక కూపమున నాశనము చేయగల వానికి భయపడుడు" (మత్త 10:28).
హృదయం మన నిర్ణయాలకు, చర్యలకు కేంద్రం, మూలము. దేవుడు మనలను కలుసుకొనే చోటుకూడా హృదయమే! అలాగే, చెడుగు మొదలయ్యేది కూడా ఇక్కడే! పవిత్రత అనేది మన హృదయములో (మనస్సాక్షి, అంతరాత్మ, ఆత్మగౌరవం), మనం చేసే లోతైన ఆలోచనలలో, నిర్ణయాలలో ఉంటుంది. వాటికన్ II అధికార పత్రం, "ఆధునిక ప్రపంచములో శ్రీసభ"లో ఇలా చెప్పబడింది: ప్రతి మనిషిలోనూ మనస్సాక్షి అనే అగోచరమిన వ్యవస్థ ఒకటి ఉంటుంది. దేనిని అంతరాత్మ అనికూడా అంటూ ఉంటాం. ఈ అంతరాత్మ నిరంతరమూ ఒక నీతి చట్టాన్ని బోధిస్తూ ఉంటుంది. 'ఈ పని మంచిది. ఇది చెయ్యి; ఈ పని మంచిది కాదు. దీనిని చెయ్యొద్దు; అందరినీ ప్రేమించు, ద్వేషించకు, అసూయ చెందకు' - ఇలా ప్రతీసారి మంచి చెడులను గుర్తుచేస్తూ - ఎప్పుడు ఏది చేయాలో, ఏది చేయకూడదో అప్పటికప్పుడు గుర్తుచేస్తూ మనిషికి మార్గదర్శిగా ఉంటుంది... అంతరాత్మ - మానవుడి అంతరంగములో అత్యంత నిగూఢముగా అత్యంత పవిత్రముగా నెలకొని ఉండే దైవసన్నిధానం. అక్కడ మానవుడు దేవుని కలుసుకోవచ్చును. దేవుని స్వరాన్ని ఆలకించ వచ్చును... అంతరాత్మ ప్రబోధాలకు విధేయుడై జీవించేవాడు దేవున్ని ప్రేమించగలుగుతాడు. దేవుడిచ్చిన పది ఆజ్ఞల సారాంశమే అంతరాత్మ సైతం ప్రబోధించడం విశేషం. అయితే - మానవుడి అజ్ఞానం కారణంగా అంతరాత్మ సైతం కొన్నిసార్లు తొట్రుపాటుకు గురయ్యే సందర్భాలుంటాయి. అయితే - ఈ తరహా పొరపాటుల వల్ల అంతరాత్మ గౌరవానికేమీ హాని జరగదు. అయితే - మంచీ చెడుల విచక్షణ కోల్పోయిన వ్యక్తి, ఏది నైతికమో ఏది అనైతికమో తెలుసుకొనే ప్రయత్నమైనా చేయని వ్యక్తి, పాపకర్మ లాచరించడమే అలవాటుగా చేసుకున్న వ్యక్తి - ఈ తరహా వ్యక్తుల అంతరంగాలు క్రమ క్రమంగా మసగబారుతాయి, మొద్దుబారుతాయి, గౌరవహీనంగా మారుతాయి (నం. 16).
హృదయశుద్ధి కొరకు మంచి పుస్తక పఠనం (బైబులు, ఆధ్యాత్మిక రచనలు, పునీతుల జీవిత చరిత్రలు...), టీవీలో మంచి కార్యక్రమాలు దోహద పడతాయి. డ్రగ్స్, అల్కహాలు, హింసాత్మక వీడియో గేములు, అశ్లీలత, జూదం మొ.గు వాటికి దూరముగా ఉండాలి. నిజమైన పునరుద్ధరణ హృదయానికి చెందినది. అందుకే యేసు, "హృదయపరివర్తనము చెందండి" (మార్కు 1:15) అని సువార్తను ప్రకటించారు.
మన హృదయములో దైవప్రేమను నింపుకుందాం! అదే అంధకార శక్తులను విచ్చిన్నం చేస్తుంది!
No comments:
Post a Comment