సామాన్య 5వ వారము - మంగళవారం (II)

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 5వ వారము - మంగళవారం
1 రాజు 8:22-23, 27-30; మార్కు 7:1-13

ధ్యానాంశము: పూర్వుల సంప్రదాయము - యేసు దృక్పధము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు కాని వీరి హృదయములు నాకు దూరముగా నున్నవి" (మార్కు 7:6).
ధ్యానము: "అంతట యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి (7:1). పరిసయ్యులు: 'పరిసయ్యులు' అనేపదం అరమాయిక్ భాషలోనిది. పరిసయ్యులు అనగా "వేరుచేయబడిన వారు" లేదా "ప్రత్యేకముగా నుండేవారు" అని అర్ధము. మోషే బోధనలకు నిజవారసులమని చెప్పుకొందురు. మోషే చట్టాన్ని (తోరా - మొదటి ఐదు గ్రంధాలు) లేదా ధర్మశాస్త్రాన్ని ఖచ్చితముగా పాటించువారే యూదులు అని వీరు భావించేవారు. వీరు క్రీస్తు ప్రభువు యొక్క బోధనలను తీవ్రముగా వ్యతిరేకించారు. క్రీస్తు పాపులను, సుంకరులను చేరదీయడం సహించలేక పోయారు. వీరి ప్రవర్తనను యేసు ఖండించారు. వీరిని తప్పుబట్టడములో కూడా న్యాయం లేదు, ఎందుకన, వారి జీవితాలను దేవునిపట్ల విధేయత చూపడానికి, దేవున్ని సంతోష పెట్టడానికి అంకితం చేసుకున్నారు. యూదుల చట్టం చాలా స్పష్టముగా ఉన్నప్పటికిని, అనేక సందర్భాలలో వివరణను కోరుకుంటుంది. దేవునిపట్ల విధేయత చూపే క్రమములో, సంప్రదాయాలపై ప్రాధాన్యత చూపే క్రమములో, చట్టాన్ని వివరించే క్రమములో, ధర్మశాస్త్రములోనున్న పరమార్ధాన్ని, దేవుడు నిర్దేశించిన ఉద్దేశాలను వారు నిర్లక్ష్యం చేసారు. ఇదే విషయాన్ని నేటి సువార్తలో యేసు ప్రభువు స్పష్టము చేసారు (7:6-13).

కొంతమంది పరిసయ్యులు యెరూషలేమునుండి వచ్చారు. అనగా, స్థానికముగా ఉండే పరిసయ్యులు అప్పటికే యేసుపట్ల వారి వ్యతిరేకతను ప్రదర్శించారు (చూడండి 2:16, 24; 3:6). కారణం, సబ్బాతు దినమున స్వస్థత పరచారు (1:21-34; 3:1-6); కుష్ఠరోగిని తాకారు (1:41); "నీ పాపములు క్షమింప బడినవి" అని అన్నారు (2:5); సుంకరిని తన శిష్యునిగా పిలిచారు (2:14); విశ్రాంతి దినమున శిష్యులు వెన్నులను త్రుంచుటకు సమర్ధించారు (2:23-28); తనను తాకిన రక్తస్రావ రోగిని స్వస్థపరచారు (5:24-34). యెరూషలేమునుండి వచ్చినవారు స్థానిక పరిసయ్యులతో కలిసి యేసును వ్యతిరేకిస్తున్నారు. యెరూషలేము యేసుకు వ్యతిరేక స్థలము. ఆయన యెరూషలేములోనే మరణించవలసి యున్నది. ఇప్పటికే, యెరూషలేమునుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు, ఆయనకు బెల్జబూలు పట్టినదని అన్నారు. పిశాచముల అధిపతి సహాయమున ఆయన దయ్యములను వెళ్ళగొట్టు చున్నాడనియు చెప్పారు (3:22). మరియు పరిసయ్యులు ఆయన చంపుటకు ఆలోచనలుకూడా చేసారు (3:6). కనుక, యేసును నాశనం చేసే ఉద్దేశ్యముతోనే వారు యెరూషలేమునుండి వచ్చినట్లుగా స్పష్టమగుచున్నది.

మంచి చేయడానికి యేసుకున్న శక్తిని పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అర్ధంచేసుకొనలేక పోయారు, అందుకే వారు యేసును విస్మరించారు. యూద సంప్రాదాయలను పాటించడములో యేసు శిష్యుల వైఫల్యముపై వారి దృష్టిని సారించారు. వారు దేవుని శక్తిని విస్మరించి, అల్పమైన విషయాలపై దృష్టిని పెట్టారు. నేడు మనము కూడా అనేకసార్లు ప్రాముఖ్యమైన విషయాలు, ఉదాహరణకు, దేవుని వాక్యము, దివ్యసంస్కారములు, సత్యోపదేశము మొ.గు. వాటిపై దృష్టి పెట్టక చిన్నచిన్న విషయాలపై, అనవసరమైన విషయాలపై దృష్టిని పెడుతూ ఉంటాము!

యేసు శిష్యులు కొందరు చేతులు కడుగు కొనకయే భోజనము చేయుట వారు చూచిరి (7:2). లేవీయ కాండము 11-15 అధ్యాయాలలో శుద్ధీకరణకు సంబంధించిన నియమాలను చూడవచ్చు. భోజనమునకు సంబంధించిన నియమాలను 11:1-23; ద్వితీ 14:3-21లో చూడవచ్చు. ఇది దేవునిచే అందించబడిన చట్టం, అందుకే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తీవ్రముగా పరిగణించారు. నిర్గమ 30:18-21; 40:12, 31, లేవీ 8:6 ప్రకారం, ప్రత్యక్షపు గుడారమున వెళ్ళినప్పుడు, దహన బలులు అర్పించునపుడు, యాజకులు కాలు సేతులు కడుకొన వలయునని చెప్పబడినది. అయితే, పరిసయ్యులు క్రమంగా చేతులు కడుక్కోవడం అనే ఈ పద్ధతిని దేవుని పట్ల భక్తిని చూపించే మార్గంగా మరియు యూదులు అన్యమతస్తులనుండి భిన్నంగా తమ గుర్తింపును ప్రకటించుకోవడానికి అనుసరించారు. అంతేగాని, ఈ ఆచారానికి పరిశుభ్రతకు (hygiene) ఎలాంటి సంబంధం లేదు. అపవిత్రమైన వస్తువును, వ్యక్తిని తాకడం వలన కలిగే అపవిత్రతను తొలగించుటకు ఈ ఆచారాన్ని పాటించేవారు. పాత్రల శుభ్రత గురించి లేవీ 11:33-35లో చూడవచ్చు.

"పూర్వుల సంప్రదాయము" (7:3): ఇచ్చట మౌఖిక  సంప్రాదాయాలని (oral traditions) అర్ధము. అనగా చట్టములో లేనివి. వీటిని పాటించుట ద్వారా, వారు దేవునికి విధేయులని భావించారు. ఇదే వారికి బలహీనతగా మారింది. బాహ్యపరమైన ఆచారాలు, అంత:ర్గత జీవితాన్ని అంధకారమయం చేసాయి. దీనివలన దైవీక విలువలకన్న (ప్రేమ, జాలి...), బాహ్యపరమైన ఆచారాలకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అంతేగాక, వాటిని ప్రజలపై మోయలేని భారముగా మోపడం జరిగింది.

వీరిపట్ల యేసు విముఖత వారు చట్టాన్ని పాటిస్తున్నారని కాదు. వారి కపటభక్తిని యేసు తీవ్రముగా వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నారు. "కపట భక్తులారా! ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు కాని వీరి హృదయములు నాకు దూరముగా నున్నవి (యెషయ 29:13; 1:10-17; ఆమోసు 5:21-24; మీకా 6:6-8). మానవులు ఏర్పరచిన నియమములను దైవప్రబోధములుగా బోధించు చున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్ధము. దేవుని ఆజ్ఞను నిరాకరించి, మానవ నియమములను అనుసరించు చున్నారు. ఆచారముల నెపముతో దేవుని ఆజ్ఞలను నిరాకరించు చున్నారు... పూర్వ సంప్రదాయమును అనుసరించు నెపమున దైవవాక్కునే అనాదరము చేయుచున్నారు" (7:6-9, 13).

కపటము అనగా నటించడం, వేషధారణ అని అర్ధం. కపటము చెడు ప్రవర్తనకు సూచన. కపటభక్తులు, బోధిస్తారు కాని పాటించరు. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని ఆ భారములను మోయు వారికి సాయపడుటకు తమ చిటికెన వ్రేలైనను కదపరు. తమ పనులెల్ల ప్రజలు చూచుటకై చేయుదురు. ప్రజల ప్రశంసలను, బోధకులు అని పిలిపించుకోవడం ఇష్టపడుదురు (మత్త 23:1-13). వితంతువుల ఇండ్లను దోచుకొనుచు, దీర్ఘ జపములను చేయునట్లు నటించెదరు (మార్కు 12:40).

దైవాజ్ఞకు, మానవ నియమములకు మధ్య బేధాన్ని గ్రహించాలి. పరిసయ్యులు లేదా కపట భక్తులు దేవుని చిత్తముపైగాక, మానవ నియమాలపై ఆధారపడుదురు. యేసు సంప్రదాయాలను ఖండించడం లేదు కాని మానవులు ఏర్పరచిన నియమాలను దైవాజ్ఞలకన్న పవిత్రమైనవిగా భావించడాన్ని ఖండిస్తున్నారు. సంప్రదాయాలను తప్పక గౌరవించాలి కాని ప్రాముఖ్యమైన బైబులు బోధనలను, దేవుని ఆజ్ఞలను, దైవవాక్కును, శ్రీసభ బోధనలను నిర్లక్ష్యం చేయరాదు. చేతులు కడుగుకొనుట మాత్రమే గాక, హృదయ శుద్ధి కూడా ముఖ్యమని గ్రహించుదాం!

ప్రభువా! నా బాహ్యపరమైన ఆరాధనలు, కార్యాలు, నా హృదయానికి నిజమైన ప్రతిబింబముగా ఉండనీయ చిత్తగించండి!

No comments:

Post a Comment