సామాన్య 7వ వారము - గురువారం (II)

  దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 7వ వారము - గురువారం
యాకోబు 5:1-6; మార్కు 9:41-50

ధ్యానాంశము: ఆదర్శ జీవితము ('ఉప్పదనము')
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు:  "మీరు ఉప్పదనమును కలిగి ఒకరితో ఒకరు సమాధానముతో ఉండుడు" (9:50).
ధ్యానము: నేటి సువిశేష పఠనం, వినటానికి చాలా భయానకముగా ఉన్నది! అయితే, ఈ సువిశేష భాగం, నిజమైన పరివర్తన జీవితము గురించి బోధిస్తున్నది. నిజమైన పరివర్తన అనగా కేవలం పాపాలకు దుఖ:పడటం మాత్రమే కాదు! పరివర్తన యనగా ప్రవర్తనలో ఉద్దేశపూర్వకమైన మరియు పరిపూర్ణమైన మార్పు! క్రీస్తుకొరకు, ఆయన సువార్తకొరకు ఇష్టపూర్వకముగా జీవించడం! క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసం, నమ్మకం ఉంచడం! అలాగే, పాపములో పడే ప్రతీ విషయాన్ని, సందర్భాన్ని, క్షణాన్ని తృణీకరించడం లేదా నివారించడం. పాపముపట్ల ఖటినముగా ప్రవర్తించాలని ఉద్దేశ్యం! ఇదియే నేటి క్రీస్తు బోధన సారాంశం. అంతేగాని, వ్యక్తులను నాశనం చేయడంగాని, చేతులు, కాళ్ళను నరికివేసుకోవడంగాని, కన్ను పెరికి పారవేయడంగాని దీని ఉద్దేశ్యము కాదు! ప్రధాన ఉద్దేశ్యం మరియు బోధన - పరిపూర్ణ పరివర్తన, పరిపూర్ణ మారుమనస్సు లేదా పరిపూర్ణ హృదయ పరివర్తన.
పాపమునకు దాసోహం సంపూర్ణ వ్యక్తిని నాశనం చేస్తుంది. కనుక, కేవలం, ఒక చేతును, ఒక కాలును, ఒక కన్నును అదుపుచేస్తే సరిపోదు. సంపూర్ణ వ్యక్తిని (పాపపు హృదయాన్ని, ఆలోచనలను, తలంపులను, ఉద్దేశ్యాలను...) అదుపు చేయాలి. అందుకే పరివర్తన అనగా, కొన్ని విషయాలలో మాత్రమేగాక,  సంపూర్ణ వ్యక్తి మార్పు చెందడం. నిజమైన పరివర్తన మన అంత:ర్గత, అనగా సంపూర్ణ వ్యక్తియొక్క వేదసాక్షి మరణాన్ని సూచిస్తుంది. పాపస్వభావానికి మరణించడం. క్రీస్తుతో మరణించినపుడే, సంపూర్ణ మార్పు మనలో కలుగుతుంది.

పరివర్తన చెందిన వ్యక్తి, ఇతరులు పాపులగుటకు కారకుడు కాడు. ఇతరుల ఆధ్యాత్మిక జీవితములో మనం అడ్డంకిగా మారకూడదు. మరొకరిని పాపములో పడవేసే అపరాధం మనం చేయకూడదు. మరొక మాటలో చెప్పాలంటే, ఇతరులను శోధింపరాదు. 'శోధన' (గ్రీకు - scandalon; ఆంగ్లము scandal) అనగా ఒకరిని పాపములో పడిపోయేలా చేయడానికి వేసే ఉచ్చు లేదా అడ్డంకి! వేరొకరికి పాపం చేయడం నేర్పించడం క్షమించరాని నేరముగా యూదులు భావించేవారు! ముఖ్యముగా, "చిన్నవారు" (9:42) వెంటనే నమ్ముతారు కాబట్టి, వారిని చెడు మార్గములో నడిపించ కూడదు; వారికి చెడు జీవితాదర్శాలను ఎంతమాత్రము ఇవ్వకూడదు.

అందుకే, ప్రభువు అంటున్నారు: "మీరు ఉప్పదనమును కలిగి ఒకరితో ఒకరు సమాధానముతో ఉండుడు" (9:50). "మీరు భూమికి ఉప్పు వలె నున్నారు" (మత్త 5:13). ఉప్పు కేవలం ఆహారానికి రుచిని ఇవ్వడం మాత్రమేగాక, ఆహార తాజాదనాన్ని నిలుపుకోవడానికి, ముఖ్యముగా మాంసం పాడవకుండా ఉండటానికి ఉప్పును విరివిగా ఉపయోగిస్తారు. ఉప్పుకు శుద్ధిచేయు గుణముకూడా ఉన్నది; ఆహారములోనికి చొచ్చుకొనిపోయే గుణమున్నది. అలాగే, ఉప్పు 'పవిత్రతకు' గురుతు. ఉప్పువలె, శిష్యులుకూడా సమాజములో, శాంతి సమాధానమను దైవరాజ్య/సువార్త విలువలతో, ఈ సమాజాన్ని (ఇతరులను) శుద్దిచేయాలి; పాపమునుండి సంరక్షించాలి; పవిత్రముగా జీవించాలి.

ఇది ఎలా సాధ్యం? అందుకే, ప్రభువు మనకు కొన్ని సూచనలు చేస్తున్నారు" మొదటిగా, పాపమును - వ్యసనాలు, మాదకద్రవ్యాలు, మద్యం, అక్రమ సంబంధాలు, జూదం మొ.గు చెడులను  మన జీవితాలనుండి, వ్యవస్థనుండి శాశ్వతముగా నిర్మూలించాలి. వాటిని నరికిపారవేయాలి, పెరికిపారవేయాలి. రెండవదిగా, దాతృత్వ కార్యాలు చేయాలి. "ఎవ్వడు నా పేరిట చెంబెడు నీళ్ళు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును" (9:41). గొప్ప పనులను చేయడములోకన్న, చిన్న పనులను ప్రేమతో, ఔదార్యముతో చేసిన యెడల నిజమైన ఆనందాన్ని పొందుతాము.

లోక సంపదలు మన శరీరములను అగ్నివలె దహించును అని, ఇతరుల పట్ల చేసిన మోసము మొరపెట్టుచున్నది అని, యాకోబు మొదటి పఠనములో తెలియజేయు చున్నారు.

మరి నీవు ఇతరులకు (ఉదా. మీ పిల్లలకు, ఇరుగుపొరుగు వారికి, సంఘములో తోటివారికి...) మంచి ఆదర్శముగా ఉంటున్నావా? "దేవుడు క్షమింపక పోడులే అని యెంచి పాపము మీద పాపము మూటగట్టు కోవలదు... కనుక జాప్యము చేయక శీఘ్రమే దేవుని యొద్దకు మరలి రమ్ము [పరివర్తన]" సీరా 5:5, 7).

No comments:

Post a Comment