ప్రధమ కృతజ్ఞతా పూజాబలి
పఠనాలు: నిర్గమ 40:12-15; హెబ్రీ 7:23-28; మత్తయి 19:27-30
ప్రభువా, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి. మాకు ఏమి లభించును?
ప్రధమ కృతజ్ఞతా పూజాబలి
ప్రతీ నూతన గురువు ప్రధమ
కృతజ్ఞతా దివ్య పూజాబలిని అర్పిస్తూ ఉంటారు. నేడు నూతన గురువులు ... తన
కృతజ్ఞతా దివ్య పూజాబలిని అర్పిస్తున్నారు. యాజకత్వం దేవుని పిలుపు, అనుగ్రహం.
దేవుడు చేసిన ఈ గొప్ప కార్యానికి నూతన గురువులు దేవునికి కృతజ్ఞతలు
అర్పిస్తుంటారు. అలాగే, తల్లిదండ్రులు, తోబుట్టువులు చేసిన త్యాగం, ఇచ్చిన
ప్రోత్సాహం, మరియు నూతన గురువుల జీవితానికి ఇతరులు చేసిన త్యాగమును బట్టి, దేవునికి
కృతజ్ఞతలు అర్పిస్తుంటారు. నూతన గురువులతో మనమందరం ఏకమై, ఈ నూతన గురువుద్వారా
తల్లి శ్రీసభకు ప్రభువు చేసిన గొప్ప కార్యమును బట్టి, దేవునకు స్తోత్రములు
చెల్లించుదాం.
మ. 19:27లో పేతురు యేసును, “మేము
సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి. మాకు ఏమి లభించును?” అని ప్రశ్నించాడు. ఈ
ప్రశ్నకు నేపధ్యం ఒక యువ ధనికుడు యేసు వద్దకు వచ్చి, నిత్యజీవము పొందుటకు చేయవలసిన
మంచి పని యేమి? (మ 19:16) అని ప్రశ్నించ్నప్పుడు యేసు, “వెళ్లి నీ ఆస్తిని అమ్మి,
బీదలకు దానము చేయుము. అపుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను
అనుసరింపుము” (మ. 19:21) అని సమాధాన మిచ్చారు. అలాగే, యేసు తన శిష్యులతో,
“ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించట కష్టము” (మ. 19:23) అని చెప్పారు. ఈ మాటలు విని
శిష్యులు మిక్కిలిగా ఆశ్చర్యపడ్డారు. అప్పుడు పేతురు యేసుతో, “మేము సమస్తమును
త్యజించి నిన్ను అనుసరించితిమి. మాకు ఏమి లభించును?” (మ. 19:27) అని అన్నాడు.
శిష్యులకు ఇది చాలా ప్రాధమికమైన
ప్రశ్న. ఎందుకన, వారు యేసు పిలువగానే, సమస్తమును విడిచి ఆయనను అనుసరించారు. ప్రభువు
నిమిత్తము గృహములను, తోబుట్టువులను, తల్లిదండ్రులను, బిడ్డలను, భూములను త్యజించి,
ఆయనను అనుసరించారు. ప్రభవు కొరకు పేదవారిగా మారారు. మార్కు 1:17లో “మీరు నన్ను
అనుసరింపుడు. మిమ్ము మనుష్యులను పట్టు జాలరులనుగాచేసెదను” అని యేసు పిలువగానే, పేతురు,
అంద్రేయ, యాకోబు యోహానులు వెంటనే వారి వలలను విడచిపెట్టి ఆయనను అనుసరించారు.
మార్కు 2:14లో యేసు వెళ్ళుచు సుంకపు మెట్టుకడ కూర్చుండి వున్న ‘లేవి’ అను
మత్తయిని, “నన్ను అనుసరింపుము” అని పిలువగానే, అతడు లేచి యేసును అనుసరించెను.
మార్కు 3:13లో యేసు కోరుకొనిన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు
యేసు పన్నిద్దరు శిష్యులను నియమించెను.
కనుక, పేతురు, శిష్యుల సమూహము
తరుపున ప్రభువును అలా ప్రశ్నించాడు. పేతురు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది,
ఎందుకన, నేటి మన సమకాలీన ప్రపంచములో, మన విశ్వాసం పట్ల చాలా భయం, అనిశ్చితి,
ఉదాసీనత, ద్వేషం నెలకొన్నాయి. యేసు శిష్యులముగా ఉండటం అనగా ప్రధానముగా, ఆయనే
నిజమైన మార్గం, సత్యం, జీవం అని అర్ధం చేసుకోవాలి, అప్పుడే మనం చేసే త్యాగాలకు,
ప్రార్ధనలకు ఫలితం ఉంటుంది.
నేటి గురువులందరికీ కూడా,
ముఖ్యముగా ఇక్కడనున్న నూతన గురువులందరికీ పేతురు అడిగిన ప్రశ్న, చాలా సందర్భోచితముగా
ఉంటుంది. మేము సమస్తాన్ని వదులుకున్నాము, త్యాగం చేసాము, మరి మాకోసం ఏముంటుంది?
మాకోసం ఏ ‘సంపద’ లభిస్తుంది? దీనికంటే ముందుగా మరో ప్రశ్న వేసుకుందాం? ఎందుకు
ఇంతటి త్యాగం, త్యజింపు! ఈ త్యాగానికి, త్యజింపునకు ప్రేరణ ఎవరు?
స్వయముగా క్రీస్తు ప్రభువే మనకు
ప్రేరణ! ఎందుకన, యేసు సర్వాన్ని వదులుకున్నారు, సర్వాన్ని విడిచిపెట్టారు;
సర్వాన్ని త్యజించారు. తననుతాను తగ్గించుకున్నారు. మానవ శరీరాన్ని ధరించి మన మధ్య
నివసించారు (ఫిలిప్పీ 2:6-7). మన ద్వేషానికి గురయ్యారు. దేవుని వాక్యాన్ని
నమ్మకముగా ప్రకటించడానికి ధైర్యం చేసారు. మనందరికోసం, తన శక్తిని వెచ్చించారు;
చెమటను చిందించారు; కన్నీళ్లు కార్చారు; తన రక్తాన్ని సిలువపై చిందించారు. ఆయనే మన
అంతిమ త్యాగం, బలి, అర్పణం. యాజకుడిగా మనకోసం సమస్తాన్ని త్యజించారు, బలిగా
అర్పించారు.
పేతురు ప్రశ్నను మరోలా
అడుగుదాం: యేసు సమస్తాన్ని వదులుకున్నారు, మరి ఆయనకు ఏమి లాభం ఉంటుంది? ఈ ప్రశ్నకు
సమాధానం – శ్రీసభ. శ్రీసభ అనేది ప్రభువు పొందుకున్న గొప్ప బహుమానం. దేవుని
అనుగ్రహముతో జీవించడం; పాపాత్ములు రక్షింప బడటం. శత్రువులు దేవుని స్నేహితులుగా
మారడం. నిత్యజీవమునకు లేపబడటం. అవును! ప్రభువు సిలువ ఫలితమే దేవుడు ఒసగిన
అమూల్యమైన బహుమానం తల్లి శ్రీసభ! యోహాను 17:24లో “తండ్రీ వారు నీవు నాకు ఒసగిన
బహుమానము” అని ప్రార్ధిస్తున్నారు. యేసు శ్రీసభ గురించి మాట్లాడుచున్నారు: “తండ్రీ!
నా శిష్యులు నీవు నాకొసగిన బహుమానం. వారే నా మహిమ, కీర్తి. వారు ఎప్పటికీ నాతో
ఉండాలని కోరుకుంటున్నాను. మీరే వారిని నా వైపు ఆకర్షించారు. నా అంతిమ త్యాగానికి
కారణం వారే!” (యోహాను 17:24-26). ఇది దేవుని ప్రేమకు, మంచితనానికి తార్కాణం,
నిదర్శనం. మనం బలహీనులం, పాపాత్ములం. అయినను దేవుడు మనలను తన వారినిగా, తన సంఘముగా
(శ్రీసభ) చేసుకున్నారు.
పునీత పౌలుగారు ఇలా అంటారు:
చదువుము: 1 కొరి. 1:27-29. నమ్ము, నమ్మకపో! మన ‘ఏమిలేనితనమే’ యేసు పొందుకున్న
గొప్ప బహుమానం. ఆ ‘ఏమిలేనితనము’ నుండి పొందిన విజయం, మహిమ పరిపూర్ణముగా క్రీస్తుకే
చెందుతుంది, మనది ఎంతమాత్రము కాదు! కనుక మనం గొప్పలు చెప్పుకునేది ఏమీ లేదు. కనుక
“పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగ, గొప్పలు చెప్పదలచిన వారు ప్రభువు చేసిన దానిని
గూర్చి గొప్పలు చెప్పవలయును” (1 కొరి 1:31). క్రీస్తు మనందరినీ ఇలా
ప్రశ్నిస్తున్నారు: నేను మీ కోసం ప్రతీది వదులుకున్నాము. నాకు ఏమి లాభం? నాకు ఏమి
ప్రయోజనం? నీవు నా వానిగా ఉంటావా? మీరు యేసుకు అనుకూలంగా ఉంటారా? లేదా
వ్యతిరేకముగా ఉంటారా? నిన్ను నీవు ఆయనకు సంపూర్ణముగా అంకితం చేసుకుంటావా? మనం
ప్రభువుతో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. దానికి ఆయన సమస్తాన్ని వదులుకున్నారు. ఆయన
త్యాగానికి ఫలమైన మనం, త్యాగానికి, త్యజింపుకు సిద్ధంగా ఉన్నావా? మరియ తల్లి మనకు
పరిపూర్ణ ఆదర్శం: “ఇదిగో నేను ప్రభువు దాసురాలను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక”
(లూకా 1:38) అని తన సంపూర్ణ త్యాగాన్ని వ్యక్తపరచింది.
అలాగే, శ్రీసభ క్రీస్తుతో పాటు
మనకు గొప్ప బహుమానమే! జ్ఞానస్నానములో క్రీస్తుతో సమాధి చేయబడి ఆయనతో లేపబడి నూతన
జీవితాన్ని పొందాం. శ్రీసభద్వారా దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నాం. శ్రీసభద్వారా
దివ్యసంస్కారాల అనుగ్రహాన్ని పొందుతున్నాం. శ్రీసభద్వారా సజీవుడైన క్రీస్తును
కలుస్తున్నాం.
మరి పేతురు అడిగిన ప్రశ్నకు,
ప్రభువు ఇచ్చిన సమాధానం ఏమిటి? “నా నిమిత్తము గృహములనుగాని, సోదరులనుగాని,
సోదరీలనుగాని, తల్లినిగాని, తండ్రినిగాని, బిడ్డలనుగాని, భూములనుగాని త్యజించిన
ప్రతి వాడు నూరంతలు పొంది, నిత్యజీవమునకు వారసుడగును” (మ. 19:29). శ్రీసభ మనం
పొందుకున్న నమ్మశక్యముగాని బహుమానము! శ్రీసభ భూలోకములో పరలోక రాజ్యానికి నాంది.
మనం శ్రీసభలో ఉంటే, క్రీస్తుతో ఉంటాము. కనుక మనం ఖచ్చితముగా నిత్యజీవితానికి
వారసుల మవుతాం.
ఈ నూతన గురువులు సమస్తాన్ని త్యజించారు.
తాని ఫలితముగా, ఈ నెల 12న వారు గురువులుగా అభిషిక్తాన్ని పొంది, అమూల్యమైన బహుమతి
మరియు పరలోక రాజ్యమును, నిత్యజీవితమును ఈ భూలోకములో తలపించే తల్లి శ్రీసభను, వారు పొందియున్నారు.
మరి ప్రభువు వాగ్దానం చేసిన విధముగా, గురువులైన మాకు మీ యందరిని నూరంతలుగా
బహుమానమును ఒసగారు. మీరందరూ మాకు సోదరీ సోదరులు, తల్లిదండ్రులు! దేవుడు ఇచ్చిన ఈ
బహుమానం (శ్రీసభ) కొరకే ప్రతీ గురువు జీవించాలి, పాటుబడాలి. దైవప్రజల జీవన
భద్రతకు, ఆత్మగౌరవానికి కృషి చేయాలి. దారితప్పిన గొర్రెలకు. కాపరులం కావాలి.
తప్పిపోయిన కుమారులకు, ద్వారములు తీసి ఉంచాలి. మన నిర్లిప్త ధోరణి వలన, పట్టీ
పట్టనట్లున్న వైఖరి వలన, వారిని క్రీస్తు సహవాసానికి, సాన్నిహిత్యానికి దూరం
చేయకూడదు. ఇతరులపట్ల కాటిన్యంగల తీర్పరులుగా ఉండకూడదు.
పేదవారిని ఆదరించాలి. “పేద
ప్రజలే సువార్తా సందేశాన్ని స్వీకరించడానికి యోగ్యులైనవారు. అది వారి హక్కు.”
వాస్తవానికి, పేదలకు సువార్తను బోధించడమే, యేసు ప్రభువు స్థాపించిన దైవరాజ్యానికి
నిలువెత్తు నిదర్శనం, సంకేతం (సువార్తానందం, నం. 48). లూకా 14:14లో ఇలా
చదువుచున్నాం: “పేదవారు నీకు ప్రతిఫలము ఈయలేరు. కనుక నీవు ధన్యుడవు అగుదువు.
నీతిమంతుల పునరుత్థాన కాలమున దీనికి ప్రతిఫలము లభించును” అని యేసు పలికెను. ప్రభువా,
మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి. మాకు ఏమి లభించును?
ప్రభువు ఒసగు పరలోక సంపదయైన
నిత్యజీవము కొరకు మనం ఆశించాలి. యువకుడైన ధనికుడు తనకున్న సంపదలపై మోజుతో
నిత్యజీవితానికి దూరమయ్యాడు. ఈ ధనికుని మనస్తత్వం ఒక్కోసారి మనలోకూడా విలయతాండవం
చేస్తూ ఉంటుంది. పరలోక సంపదపైగాక, ఇహలోక సంపదలపై ఎక్కువ ఆసక్తిని చూపుతున్నాం. ఇదీ
ప్రతీ గురువు ఆత్మపరిశీలన చేసుకోవాలి!
శోధనలు, సవాళ్ళు:
నేడు గురువులు ఎన్నో శోధనలను,
సవాళ్ళను ఎదుర్కుంటున్నారు. వ్యక్తిగత స్వేచ్చకోసం, విశ్రాంతి విరామాలకోసం
ఎక్కువగా తాపత్రయ పడుటం. సువార్తా పరిచర్యను భారంగా భావించడం. చేసే పనిని తగిన
ప్రేరణతో చేయక పోవడం. నిరాశకు గురవడం. రోమీ 5:20 వచనాన్ని గుర్తుకు చేసుకుందాం:
“పాపము ఎచ్చట పెరిగెనో, అచ్చట దేవుని అనుగ్రహము అంత కంటెను అధిక మయ్యెను.”
గురుత్వ జీవితం ఎన్నో సవాళ్ళతో
కూడిన జీవితం. మొక్కవోని ఆశాభావముతో ఉండాలి. పవిత్రాత్మ పట్ల దృఢ విశ్వాసం కలిగి
యుండాలి. 2 కొరి 12:9 వచనాన్ని గుర్తుచేసుకుందాం: “నా కృప నీకు చాలును. బలహీనత
యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది.”
ఆధునికముగా అభివృద్ధి చెందిన ఈ
లోకములో ఆధ్యాత్మిక అనుబంధాలను ఆహ్వానించాలి. సాటి వారితో స్నేహ సంబంధాలను
పెంపొందించుకుంటూ అందరితో కలిసి మెలిసి జీవించాలి.
ఆధ్యాత్మిక లౌకికత నుంచి బయట
పడాలి. ఆధ్యాత్మికత ముసుగులో లౌకిక వ్యామోహాలు కలిగి యుండరాదు. దేవుని మహిమకు
బదులుగా వ్యక్తి శ్రీయాన్ని కోరరాదు. యోహాను 5:44 వచనాన్ని గుర్తుకు చేసుకుందాం:
“ఏకైక దేవుని నుండి వచ్చు కీర్తిని గాక, ఒండొరుల పొగడ్తలను ఆశించు మీరు నన్ను
ఎట్లు విశ్వసింప గలరు?” లౌకిక వ్యమోహాలలో జీవించేవారు, ఫిలిప్పీ 2:21లో, పౌలు
చెప్పినట్లుగా, “యేసు క్రీస్తు కార్యములందు శ్రద్ధ చూపరు.” ఈ దుస్థితి నుంచి బయట
పడాలంటే, మన దృష్టిని పూర్తిగా క్రీస్తు ప్రభువుపై కేంద్రీకరించాలి.
గురుపట్టాభిషేకం:
గురుపట్టాభిషేకం దివ్యబలిలో
తననుతాను అర్పణగావించుకొనే క్రీస్తు ప్రభువుకు దివ్య సంకేతం. ప్రజలకు పరిచర్య చేసే
సాధనముగా ప్రభువు గురుత్వాన్ని స్థాపించారు. అభిషిక్తుడైన గురువు – శ్రీసభకు
శిరస్సు అయిన క్రీస్తు ప్రభువుకు ప్రతిరూపం. కనుక, గురుత్వము, గురువులు చేసే
పరిచర్యలు, క్రీస్తు సంఘములో విశ్వాసులందరినీ పవిత్రులను చేయడానికి ఉద్దేశించ
బడినవి.
గురుత్వానికి గల అధికారం,
ఇతరులపై ఆధిపత్యం, పెత్తనం చెలాయించే అధికారం కాదు. అది దివ్యబలి అర్పించడానికి
అవసరమయ్యే అధికారం. వాస్తవానికి, దివ్యబలి నుంచే గురువులకు ఈ అధికారం లభిస్తుంది.
ఈ అధికారానికి అసలైన అర్ధం సేవాభావం. దైవప్రజలను సేవించడానికే గురువులకు ఈ అధికారం
ఇవ్వబడుతుంది. యోహాను 12:26 గుర్తుకు చేసుకుందాం: “నన్ను సేవింప గోరువాడు నన్ను
అనుసరింప వలెను. అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును. ఎవడైననునన్ను
సేవించిన యెడల వానిని నా తండ్రి గౌరవించును.”
పూర్వ నిబంధనలో లేవీ గోత్రానికి
చెందిన వారిని దేవుడు యాజకులుగా ప్రతిష్టించారు. దేవునికి సంబంధించి, ప్రజల తరుపున
పాపాలకోసం కానుకలు, బలులు అర్పించడానికి యాజకులు నియమితులయ్యారు (లేవీ 8; నిర్గమ
29; హెబ్రీ 5:1). దేవుని వాక్కును ప్రకటించడానికి, బలులద్వారా, ప్రార్ధనలద్వారా
దేవునితో సాంగత్యాన్ని పునరుద్ధరించడానికి యాజకత్వం స్థాపించ బడినది (మలా 2:7-9). నూతన
నిబంధనలో, క్రీస్తు యాజకత్వం రక్షణ సాధిస్తుంది. క్రీస్తు బలి మాత్రమే దానిని
సంపూర్తి చేయగలదు (హెబ్రీ 5:3; 7:27; 10:1-4). మెల్కిసెదేకు యాజక క్రమంలో క్రీస్తు
తన సిలువ బలిద్వారా సంపూర్ణం చేసాడు (హెబ్రీ 10:14). తన పిలుపుననుసరించి, గురువు,
బోధకుడు, రాజునైన క్రీస్తు ప్రేషిత కార్యములో విశ్వాసులైన మనమందరం
పాలుపంచుకొంటున్నాం. అయితే, సాధారణ యాజకత్వానికి సేవలు అందించడానికే అభిషిక్త
యాజకత్వం ఉన్నది.
గురుత్వం దేవుని పిలుపు, దేవుని
కృపానుగ్రహం. హెబ్రీ 5:4లో చదువుచున్నట్లుగా, “యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు
పొందలేరు. దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తియైన యాజకుడిగా చేయబడును. గురువు ప్రధాన
బాధ్యత, రోజువారి దివ్యబలిద్వారా, యేసు క్రీస్తు చేసిన ఒడంబడికను పునరుద్ధరణ చేయటం.
గురువుగా ఉండటం అంటే, గురుత్వానికి అనుగుణముగా జీవించడం – సువార్తను ప్రకటించడం
మాత్రమే కాదు, జీవించడం మరియు సంఘములో భాగం కావడం. ప్రజల విశ్వాసాన్ని
పెంపొందించడం, అభివృద్ధి చేయడం, పంచడం గురువు బాధ్యత.
Dear Fr. ... గురువుగా
ప్రత్యేక విధముగా ప్రజల జీవితాలను స్పర్శిస్తావు. నీవు నీవుగా ఉంటూ ప్రజలను
చేరుకోవాలి. ప్రజల విశ్వాస ప్రయాణములో కలిసి వారితో పయనించడం గొప్ప అనుభూతి
జీవితాంతం పొందుతావు. ప్రజలు మీనుండి ఎన్నో ఆశిస్తారు, సలహాలను కోరతారు. అంచనాలు
ఎల్లప్పుడూ ఉంటాయి. అయితే, మీ కోసం సమయాన్ని తప్పక వెతుక్కోవాలి. ఎందుకో తెలుసా?
ప్రార్ధన చేసుకోవడానికి. గురువుకు బలం ప్రార్ధన. ఎదేమైనప్పటికినీ, మీ ప్రధాన
కర్తవ్యం బైబులు గ్రంథానికి, శ్రీసభ బోధనలకు కట్టుబడి యుండటం. ప్రజలు వారి
సంతోషాలతో, బాధలతో వచ్చినప్పుడు, వారికి ఆదర్శముగా, ఉదాహరణగా యుండాలి. మీరు కలిసే
ప్రతీ వ్యక్తికి, సువార్తా బోధనలను, విలువలను అందించ గలగాలి. కనుక మీరు చేసే ప్రతీ
పనికి బైబులు పునాదిగా యుండాలి. మీరు మాట్లాడే ప్రతీ మాటలో, ప్రతీ బోధనలో దేవుని
వాక్య సుమధురం ఆవరించాలి. అన్ని విషయాలలో మీ పట్ల మీరు నిజాయితీగా ఉండాలి. మీ పరిచర్యపట్ల
నిజాయితీగా యుండాలి. దేవుడు మీకు తప్పక తోడుగా యుంటాడు. మీ గురుత్వ జీవితాన్ని
దేవుడు ఆశీర్వదించాలని, ముందుకు సాగే మీ ప్రయాణం అద్భుతముగా యుండాలని
ఆశిస్తున్నాను, ఆ దేవున్ని ప్రార్ధిస్తున్నాను. ఆమెన్.
Fr. Praveen Gopu OFM Cap.
23 జనవరి 2022
No comments:
Post a Comment