దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 3వ వారము - గురువారం
2 సమూ 7: 18-19, 24-29; మార్కు 4:21-25
ధ్యానాంశము: గంపక్రింద దీపము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “దాచబడినది ఏదియు బట్టబయలు కాకపోదు. బయలు పరచుటకేగాని ఏదియు దాచబడలేదు” (మార్కు 4:22).
ధ్యానము: యేసు ఈ లోకమునకు వెలుగు. తనను అనుసరించు వారందరిని (ఆయన శిష్యులు) ఈ లోకమునకు వెలుగు ప్రసాదించు సాధనములుగా మలిచారు. వెలుగు 'జీవము'నకు గురుతు. వెలుగు అంధకారమును పారద్రోలుతుంది. వెలుగు 'దైవసన్నిధి', 'చట్టం', 'సత్కార్యముల'కు కూడా సూచిస్తుంది. నేటి సువిషేశములో, దీపములు ఎలా వెలుగు నిచ్చునో, మన వెలుగు జీవితాలద్వారా, అనగా సత్కార్యముల వలన, ఇతరుల జీవితాలలో వెలుగును నింపాలని కోరుచున్నారు. అనగా, మనం క్రీస్తుకు, ఆయన వెలుగుకు సాక్షులముగా జీవించాలి. మత్తయి 5:16లో ప్రభువు చెప్పినట్లుగా జీవించాలి: "ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోక మందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి యెదుట ప్రకాశింపనిండు." మన విశ్వాసమే ఆ వెలుగు; మన విశ్వాసపు వెలుగుతో మనం నివసించే ఈ లోకమును క్రీస్తు జ్యోతితో వెలిగించాలి, పునరుద్ధరణ గావించాలి. సత్కార్యములు అనగా, క్రైస్తవ ప్రేమలో జీవించడం. ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించడం. అలా జీవించినప్పుడు, ఆ ప్రేమ, మన దయాపూరిత కార్యములద్వారా వ్యక్తపరచ బడుతుంది. త్యాగపూరితమైన సేవాభావముతో జీవించాలి. అలాంటివారు ఈ లోకమునకు వెలుగు కాగలరు.
ఈ ఉదాంతములో, దీపము 'దేవుని వాక్యము'ను కూడా సూచిస్తుంది. అదియే క్రీస్తు ఈ లోకమునకు కొనివచ్చిన రక్షణ వెలుగు, రూపాంతరం చేయు వెలుగు. కనుక దాచబడిన సందేశం బయలు పరచ బడును. క్రీస్తు ఉత్థానంతో, ఆయన శిష్యులు సంపూర్ణ సందేశాన్ని గ్రహించ గలిగారు. అప్పుడు వారు ఆ సందేశమును లోకమునకు ప్రకటించిరి. లోకమునకు వెలుగుగా మారిరి.
"మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలువబడును" (4:24). అనగా, మనం ఇతరులను ఎంతగా క్షమిస్తామో, దేవుడు కూడా మనలను అంతగానే లేదా అంతకన్న ఎక్కువగానే క్షమిస్తాడు అని ప్రభువు తెలియజేయు చున్నారు. మన శత్రువుల కొరకు ప్రార్ధన చేయాలి; మనలను హింసించువారి కొరకు మంచి చేయాలి.
"ఉన్నవానికే మరింత ఒసగబడును" (4:25). మనం క్రీస్తుకు విశ్వాసపాత్రముగా ఉన్నచో, దైవరాజ్యమునకై పాటుబడినచో, మనలను అధికమధికముగా దీవించును. దేవుడు మనకొసగిన వరములను ఇతరులతో పంచుకోవాలి.
మొదటి పఠనములో, ఎప్పుడైతే, దేవుడు తనకు, తన కుటుంబమునకు ప్రత్యేకమైన ప్రణాలికను కలిగియున్నాడని, తన వంశముద్వారా, ఇశ్రాయేలుపై ఆశీర్వాదములను కలుగజేయునని తెలుసుకున్నాడో, దావీదు వినయముతో దేవున్ని స్తుతించాడు, ఆరాధించాడు, ప్రార్ధించాడు. ఈ శుభవార్తను వెంటనే, తన కుటుంబం వారితో పంచుకున్నాడు.
No comments:
Post a Comment