దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 4వ వారము - గురువారం
1 రాజు 2:1-4, 10-12; మార్కు 6:7-13
ధ్యానాంశము: శిష్యుల వేదప్రచారము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "శిష్యులు పోయి, ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలెనని బోధించిరి. వారు అనేక పిశాచములను పారద్రోలిరి. రోగులను అనేకులకు తైలము అద్ది స్వస్థ పరచిరి" (మార్కు 6:12-13).
ధ్యానము: యేసు పన్నిద్దరు శిష్యులను తన చెంతకు పిలిచి, బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపెను. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తిని ఇచ్చెను. యేసు ప్రారంభించిన ప్రేషిత కార్యం లోకాంతము వరకు కొనసాగాలి. అందుకే, ప్రభువు శిష్యులను ఎన్నుకొని, వారిని లోకములోనికి సువార్తా ప్రచారమునకై పంపియున్నారు. దేవుని రాజ్యము గురించి, దానికి సంసిద్ధత గురించి వారు బోధించాలి.
మొదటిగా, వారిని తనతో ఉండటానికి పిలచియున్నారు (మార్కు 1:16-20; 2:14). రెండవదిగా, తన శక్తిగల వాక్కుద్వారా, అద్భుత క్రియలద్వారా విశ్వాసములో తర్ఫీదునిచ్చి, పశ్చాత్తాపమునకు నడిపించారు (మార్కు 4:1-2, 10-12, 34-41). మూడవదిగా, తన ప్రేషిత కార్యమును శిష్యులతో పంచుకుంటున్నారు. ఇద్దరిద్దరిగా వారిని లోకములోనికి పంపుచున్నారు (మార్కు 6:7-13). ఇద్దరిద్దరు చొప్పున వెళ్ళడం, యేసు కాలములోని ధ్రువీకరింపబడిన యూదుల ఆచారం. యేసు బోధనకు, ప్రేషితకార్యము, శిష్యుల మధ్యననున్న బంధాన్ని చూడవచ్చు: "శిష్యులు పోయి, ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలెనని బోధించిరి. వారు అనేక పిశాచములను పారద్రోలిరి. రోగులను అనేకులకు తైలము అద్ది స్వస్థ పరచిరి" (మార్కు 6:12-13). "తైలము అద్దటం" [అభిషేకించడం] నూతన నిబంధనలో మూడు సార్లు కనిపిస్తుంది: మార్కు 6:13; లూకా 10:34; యాకోబు 5:14-15. [లేవీయ 14లో తైలమును ఉపయోగించుటను చూడవచ్చు]
యేసు తన శిష్యులను "పంపెను". అపోస్తలుడు [గ్రీకు - అపోస్తెల్లో] అనే పదానికి 'పంపబడుట' అని అర్ధము. ప్రయాణములో చేతి కఱ్ఱను తప్ప ఏమియు వారు తీసుకోని పోరాదు (6:8). అనగా, వారు సంపూర్ణముగా దేవున్ని విశ్వసించాలి, సంపూర్ణముగా దేవునిపై ఆధారపడి యుండాలి అని యేసు ఉద్దేశ్యం. హృదయపరివర్తనం సంపూర్ణముగా ఉండాలి; క్రీస్తునందు విశ్వాసం, నమ్మకం సంపూర్ణముగా ఉండాలి. శిష్యరికం సంపూర్ణ త్యాగాన్ని కోరుకుంటుంది. అనుదిన సిలువను ఎత్తుకొని సాగాలి. అనగా, శిష్యులు వారికోసంగాక, ఇతరులకోసం జీవించాలి.
వారు యేసు 'సువార్త'ను, సందేశమును ప్రకటించుటకు వెళ్ళారు - పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలెనని బోధించారు. 'హృదయ పరివర్తనము' అనగా ప్రవర్తనను, వైఖరులను సంపూర్ణముగా దేవుని వైపుకు మరల్చు కోవడం. స్వీయ-కేంద్రీకృత (self-centered) జీవితమునుండి దైవ-కేంద్రీకృత (God-centered) జీవితానికి మారటం. వ్యసనపరులు, పాపాత్ముల సమస్య ఏమిటంటే, వారి జీవితాలను వారి కోరికలపైనే (false self) కేంద్రీకరిస్తారు. కాని, విశ్వాసులు 'నేను ఎవరు?, యేసు క్రీస్తు ఎవరు?' అన్న గుర్తింపుపై (true self) కేంద్రీకరించాలి. శిష్యుల వేదప్రచారం, యేసు సువార్తా బోధనకు కొనసాగింపు. వారి వేదప్రచారం, యేసు పర్యవేక్షణలో జరుగుతుంది.
శిష్యులు యేసుతో కలిసి 'యెరూషలేమునకు వెళ్ళుటలోనే' [శ్రమలు, సిలువ, మరణం వైపుకు] వారు ఆయనను అర్ధం చేసుకున్నారు. సిలువ సందేశమును అర్ధం చేసుకున్నప్పుడే, శిష్యులు యేసు క్రీస్తును [ప్రభువు మార్గమును] అర్ధం చేసుకొనగలరు. గురువు మార్గమే, శిష్యుని మార్గం కావాలి.
జ్ఞానస్నానం పొందిన వారందరూ కూడా క్రీస్తు సువార్తా పరిచారకులే! నేడు మనము కూడా ప్రభువుచేత పంపబడుచున్నాము. మనం ఉన్న చోటనే [గృహము, ఆఫీసు, మన చుట్టూ ఉన్నవారు...], సువార్త పరిచర్యను చేయవచ్చు. మనకు ఉండవలసినది, క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసం, ప్రేమ. క్రీస్తుకు మనం సాక్షులుగా జీవించాలి. దైవానుభూతి, క్రీస్తానుభూతి పొందాలి. ప్రేమ, దయ, క్షమాపణలను ఇతరులతో పంచుకోవాలి. అలాగే, అపవిత్రాత్మలనుండి విముక్తిని కలిగించాలి. మద్యం, మాదకద్రవ్యాలు, జూదం, అశ్లీలత, వ్యభిచారం, లౌకికవాదం, భౌతికవాదం...మొదలగు దుష్టశక్తులనుండి విడుదల చేయాలి. వీటినుండి, మనలను మనం, అలాగే ఇతరులను విడుదల పొందడానికి యేసు క్రీస్తు సహాయం మనకు కావాలి.
No comments:
Post a Comment