దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 4వ వారము - శుక్రవారం
సిరాకు 47:2-13; మార్కు 6:14-29
ధ్యానాంశము: యోహాను శిరచ్చేదనము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "ఈ సంఘటనను వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి, ఆ భౌతిక దేహమును తీసికొని పోయి సమాధి చేసిరి" (మార్కు 6:29).
ధ్యానము: మార్కు తన సువార్తను బప్తిస్మ యోహాను పరిచయముతో ప్రారంభించాడు (1:2-8). నేటి సువార్త భాగములో బప్తిస్మ యోహాను మరణాన్ని గురించి వివరముగా తెలియజేయు చున్నాడు (6:14-29). యోహాను వేదసాక్షి మరణం, సిలువపై క్రీస్తు మరణాన్ని సూచిస్తుంది. ఈ వివరణ శిష్యరిక స్వభావమును తెలియజేస్తుంది. యేసు శిష్యులు వేదప్రచారమునకై గ్రామాలకు పంపబడిన సంఘటన తరువాత యోహాను మరణము గురించి వ్రాయబడింది. శిష్యులు ఏ సమయములోనైనా వేదసాక్షి మరణానికి లోనుకావచ్చు. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. రాత్రి వచ్చే దొంగవలె, ఎప్పుడైనా రావచ్చు! యోహాను మరణం, దైవకుమారుడు యేసు క్రీస్తు పరమరహస్యమైన బాధామయ మెస్సయ్యగా శిష్యులకు, అలాగే ప్రతీ విశ్వాసికి తెలియజేస్తుంది.
పాపక్షమాపణ, హృదయ పరివర్తనము అనెడు బప్తిస్మమును ప్రకటించుచు, యోహాను ప్రభువు మార్గమును సిద్ధామొనర్చెను (1:4). యోహాను చెరసాలలో బంధింప బడిన పిమ్మట, యేసు గలిలీయ సీమకు వచ్చి, అదే సందేశాన్ని, "హృదయ పరివర్తనము చెంది, సువార్తను విశ్వసింపుడు" (1:14-15) అని ప్రకటించెను. శిష్యులు వేదప్రచారానికి పంపబడిన తరువాత (6:7-13), వారు తిరిగి రాకముందే యోహాను మరణం గురించి చెప్పబడింది. దీనికి కారణం, ఎన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు, చివరికి గొప్ప వ్యక్తి, బప్తిస్మ యోహాను వేదసాక్షి మరణం పొందిననూ, దేవుని సువార్త ప్రచారం కొనసాగునని తెలియజేయుటకు. యోహాను మరణం గురించి చెప్పబడిన తరువాతనే, "శిష్యులు తిరిగి వచ్చి, తమ ప్రేషిత కార్యములను, బోధలను తెలియ జేసిరి" (6:30). ఎందుకన, 'మార్కు సంఘము' ఘోరమైన వేదహింసలను పొందుచున్నది. మనం కూడా నేడు ఈ సందేశములోని అర్ధాన్ని గ్రహించాలి!
"ప్రభువు పేరు ప్రసిద్ధి కెక్కెను. హేరోదు రాజు అది వినెను" (6:14). యేసు ప్రేషిత కార్యములు, బోధనలను వినగానే, హేరోదు వెంటనే, తాను శిరచ్చేదన గావించిన యోహానేనని తలంచాడు. యోహాను మరణం హేరోదును వెంటాడుతూనే ఉంది. అందుకే, "నేను శిరచ్చేదనము గావించిన యోహానే మృతుల నుండి లేపబడెను" (6:16) అని పలికాడు. వాస్తవానికి, యేసు మమృతుల నుండి లేచును. ప్రజలు కొంతమంది 'ఏలియా' అని అనుకున్నారు (మలాకి 4:5-6 ప్రకారం). యోహానే ఏలియా ప్రవక్త అని తన శిష్యులకు తెలిపియున్నారు (మార్కు 9:13; మత్తయి 11:14). ఏలియా (ఆహాబు, ఎసెబెలు), యోహానులు (హేరోదు, హేరోదియా) ఇరువురుకూడా దుష్టరాజులను ప్రవచానాత్మకముగా సవాలు చేసారు. దీనివలన, ఎసెబెలు, హేరోదులు హత్యకు పథకం వేసారు. ఎసెబెలు ఏలియాను చంపుటలో విఫలమైతే, హేరోదియా, యోహానును చంపుటలో సఫలమైనది.
హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య హీరోదియాను పెండ్లాడుట సరికాదని హెచ్చరించు చుండెను. దీనికారణమున, హేరోదియా యోహానుపై పగబట్టి అతనిని చంప దలచెను. హేరోదు, హేరోదియా నిమిత్తము, యోహానును పట్టి, బంధించి, చెరసాలలో పడవేసెను (6:17-19). సోదరుని భార్యను వివాహ మాడటం ధర్మశాస్త్రానికి విరుద్ధం (లేవీ 18:16; 20:21). ఒకవేళ ఫిలిప్పు చనిపోయియుంటే, చట్టబద్ధమై యుండేది (ద్వితీ 25:5-10). యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగి, అతనికి భయపడి అతనిని కాపాడ చూచెను. అందులకే హేరోదియా అవకాశము కొరకు ఎదురుచూచెను. చివరికి, హీరోదియాకు అవకాశం వచ్చింది.
హేరోదు జన్మదినోత్సవ సందర్భముగా, హేరోదియా కూతురు [సలోమీ] ప్రీతికరముగా నృత్యము చేసినందున, హేరోదు ఆ బాలికతో, 'నీ ఇష్టమైన దానిని కోరుకొనుము. ఇచ్చెదను" అని ప్రమాణ పూర్వకముగా పలికెను. తల్లి హేరోదియా సలహా మేరకు, యోహాను తలను కోరెను. అతిధుల ఎదుట శపథము చేసినందున ఆమె కోరికను కాదనలేక పోయెను (6:21-28).
యోహాను సత్యమును మాట్లాడుటకు వెనుకాడలేదు. నిజాయితీగా, ధైర్యముగా సత్యమును మాట్లాడాడు. దానివలన వచ్చు పరిణామాలకు జడవలేదు. సత్యము కొరకు తన ప్రాణాలనైనను అర్పించుటకు సిద్ధపడ్డాడు. నేడు మనం అనేక 'హీరోదుల'ను ఎదుర్కొంటున్నాము. అనేక సార్లు, క్రైస్తవ, నైతిక విలువల పట్ల రాజీపడియున్నాము. క్రీస్తు కొరకు, ఆయన సువార్త కొరకు నిలబడాలని మనకు తెలుసు, కాని భయముతో, వెనుకాడుతూ ఉంటాము. బప్తిస్మ యోహానును ఆదర్శముగా తీసుకుందాం! సత్యము, న్యాయము కొరకు పాటుపడదాం!
No comments:
Post a Comment