సామాన్య 4వ వారము - మంగళవారం (II)

  దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 4వ వారము - మంగళవారం
2 సమూ 18:9-10, 14, 24-25, 31-19:3; మార్కు 5:21-43

ధ్యానాంశము: యాయీరు కుమార్తెకు ప్రాణదానం - రక్తస్రావ రోగికి స్వస్థత
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "కుమారీ! నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము" (మార్కు 5:34). "నీవు ఏ మాత్రము అధైర్య పడకుము. విశ్వాసము కలిగి యుండుము" (5:36).
ధ్యానము: నేటి సువిషేశములో ఇద్దరు వ్యక్తులు, సహాయమునకై, విశ్వాసముతో యేసు వద్దకు వస్తున్నారు. ప్రార్ధనా మందిరాధ్యక్షులలో ఒకడగు యాయీరు, ప్రభువు పాదములపై పడి [విశ్వాసము, మారుమనస్సు], మరణావస్థలోనున్న తన కుమార్తెపై తమ హస్తములను ఉంచిన ఆమె స్వస్థత పొందునని బ్రతిమాలాడాడు. ఇంతలో పండ్రెండు సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ, యేసును గూర్చి విని, "ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్తురాల నగుదును అని తలంచినది. వీరిరువురి విశ్వాసము గొప్పది. ఆ స్త్రీతో, ప్రభువు, "కుమారీ! నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము" (5:34) అని పలికెను. యాయీరుతో, "నీవు ఏ మాత్రము అధైర్య పడకుము. విశ్వాసము కలిగి యుండుము" (5:36) అని పలికారు.

స్వస్థతకు విశ్వాసం ప్రధానం. ఆ స్త్రీ తన సమస్తాన్ని చికిత్స కోసం వెచ్చించింది. ఆచారపరముగా, అపవిత్రమైనది. సమాజమునుండి వెలివేయబడినది. దిక్కుతోచని పరిస్థితి! ఆమె యేసును గూర్చి విన్నది. అప్పుడు ఆమె భయాలన్నీ తొలగిపోయాయి. యేసునందు సంపూర్ణ విశ్వాసం ఉంచినది. ప్రభువు స్వస్థత శక్తిని అంగీకరించడం పరివర్తనలో భాగం: "తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణకుచు, ఆయన పాదములపై బడి జరిగిన దంతయు విన్నవించెను" (5:33). "వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్తురాల నగుదును" (5:28) అన్న ఆమె విశ్వాసం ఆమె పరివర్తన జీవితానికి సంసిద్ధం అని సూచన. ప్రభువు ఎప్పుడుకూడా సంపూర్ణ మార్పును కోరుకుంటారు. శిష్యులు క్రీస్తుతో లోతైన బంధాన్ని పెంచుకోవాలి. కష్టాల, హింసల సమయములో (మార్కు సంఘము), క్రీస్తునందు విశ్వాసాన్ని బలపరచు కోవాలి. దృఢ విశ్వాసం, మరణ సమయములో కూడా ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. విశ్వాసం రక్షణను ఒసగును. విశ్వాసం జీవాన్ని కల్పిస్తుంది.

యాయీరు కుమార్తెకు ప్రాణదానము చేయుటలో ప్రభువు వాక్కు శక్తిని మనం చూడవచ్చు: ఆ బాలిక చెయ్యి పట్టుకొని, "ఓ బాలికా! లెమ్ము!" (5:41) అని పలుకగానే, వెంటనే ఆ బాలిక లేచి నడువ సాగెను (5:42). రక్తస్రావముతో నున్న స్త్రీ, యేసు వస్త్రమును తాకగానే ఆమె స్వస్థత పొందినది. యేసు బాలికను తాకినప్పుడు, ఆమె నూతన జీవితమును పొందినది. నిరాశలో, ఆశను కలిగియుండాలని ఈ రెండు స్వస్థతలు మనకు బోధిస్తున్నాయి. మనం భయపడనవసరము లేదు. విశ్వాసము కలిగి యుండాలి. 

క్రైస్తవ జీవితానికి నిరీక్షణ చాలా అవసరం. మనల్ని ప్రేమించి, నిత్యజీవానికి పిలిచిన దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడనే నమ్మకం మనకు ఉండాలి. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ వేదాంత సుగుణాలు. క్రైస్తవ నైతిక జీవితానికి పునాది. విశ్వాసుల ఆత్మల్లో దేవుడే వాటిని నాటతారు (సత్యోపదేశం 1813). మనం పొందిన నిరీక్షణ దైవీక వరం. ఆయన కృప మనలను నిరీక్షణతో కూడిన చర్యలను చేయమని పిలుస్తుంది.

ప్రభువా! నేను మిమ్ము ప్రేమిస్తున్నాను. మిమ్ములను తెలుసుకోవాలని, మీరు ప్రతిరోజూ నాతో మాట్లాడటం వినాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి నా విశ్వాసాన్ని బలపరచండి, తద్వారా నా జీవితంలో మీ చిత్తాన్ని తెలుసుకునేలా చేయండి. ఇతరులకు విశ్వాస సాక్షిగా దయచేసి నన్ను సాధనముగా ఉపయోగించు కొనండి. యేసు, నేను నిన్ను విశ్వసిస్తున్నాను!

No comments:

Post a Comment