దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 4వ వారము - సోమవారం
2 సమూ 15:13-14, 30; 16:5-13; మార్కు 5:1-20
ధ్యానాంశము: దయ్యము పట్టిన వానికి స్వస్థత - సాక్ష్యము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "నీవు నీ ఇంటికి, నీ బంధువుల యొద్దకు పోయి, ప్రభువు నిన్ను కనికరినచి, నీకు చేసిన మేలును గూర్చి వారికి తెలియ చెప్పుము అని వానిని ఆజ్ఞాపించెను" (మార్కు 5:19).
ధ్యానము: గెరాసేనుల దేశము, అన్యులు ఎక్కుగా యుండే ప్రాంతము. అచట దయ్యము పట్టిన వానికి యేసు స్వస్థతను చేకూర్చారు (5:15). దయ్యము పట్టినవాడు చాలా బలవంతుడు. గొలుసులను సైతం త్రెంపి వేసేవాడు. సమాధులలో, కొండకోనలలో నివసించేవాడు. వాడు దూరము నుండియే యేసును చూచి, పరుగెత్తుకొని వచ్చి పాదములపై పడి ఎలుగెత్తి, "సర్వోన్నతుడవగు దేవుని కుమారా! యేసూ! నా జోలి నీకేలా? నన్ను హింసింప వలదు. దేవుని సాక్షిగా ప్రాధేయ పడుచున్నాను" (5:7) అని మొర పెట్టెను. ఆ అపవిత్రాత్మ తన పేరు "దళము" (5:9) అని చెప్పెను. అంత శక్తిగల ఆ అపవిత్రాత్మను ఎవరు లొంగదీసుకోలేక పోయినను, యేసుకు అది లొంగిపోయింది, ఆయనకు విధేయించింది.
ఈ సంఘటనలో మూడు విషయాలను ధ్యానించవచ్చు: మొదటిగా, దుష్టాత్మలు మనలో విభజనలను సృష్టిస్తాయి. పాపం చేసి దేవునికి దూరమైన ప్రతీసారి, సాతాను మనలో అంత:ర్గత విభజనను కలుగ జేస్తుంది. మన కుటుంబాలలో, సంఘాలలో, సమాజములోని విభజనలు కూడా సాతాను పనియే లేదా లక్షణమే! సాతాను దేవునికి వ్యతిరేకముగా ఎప్పుడు మనలను శోధిస్తూ ఉంటుంది.
రెండవదిగా, సాతాను దుష్ట శక్తిని మనం అధిగమించాలి. క్రీస్తు లేనిచోట, సాతాను దుష్ట శక్తులు పనిచేస్తూ ఉంటాయి; అవి మనలను నియంత్రిస్తూ ఉంటాయి. ఇంకా అనేకమంది, క్రీస్తును అంగీకరించని వారు ఉన్నారు. తత్ఫలితముగా, అనేకమందిని పాపములో పడవేస్తుంది. అయితే, క్రీస్తు శక్తితో, దుష్ట శక్తిని ఎదుర్కొంటే, సాతాను ఎన్నటికీ మనలను జయించలేదు. క్రీస్తునందు విశ్వాసం, నిరీక్షణ యుంచి, సాతానుతో పోరాటం చేస్తే, పాపమరణములకు మనుగడ యుండదు. పాపముతో రాజీ పడటానికి మనం తరచుగా ప్రయత్నం చేస్తూ ఉంటాము. కాని, చెడుతో, సహజీవనం చేయలేము. కనుక, చెడు నశింప బడాలి; మన జీవితాల నుండి బహిష్కరింప బడాలి.
మూడవదిగా, క్రీస్తునందు విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవాలి. దయ్యం పట్టినవాడు స్వస్థత పొందిన తరువాత, కృతజ్ఞతా భావముతో క్రీస్తును వెంబడించాలని ఆశించాడు. "నన్ను మీ వెంట రానిండు అని ప్రార్ధించాడు" (మార్కు 5:18). అందుకు యేసు సమ్మతించలేదు. కాని, క్రీస్తు అతనికి మరో బాధ్యతను అప్పగించారు. దేవుని శక్తి గురించి, దయ గురించి సాక్ష్యమివ్వమని ఆజ్ఞాపించారు. యేసు అతనితో, "నీవు నీ ఇంటికి, నీ బంధువుల యొద్దకు పోయి, ప్రభువు నిన్ను కనికరించి, నీకు చేసిన మేలును గూర్చి వారికి తెలియ చెప్పుము" (5:19) అని ఆజ్ఞాపించెను. అతడు అట్లే ప్రభువు గొప్ప కార్యమును గూర్చి దెకపోలి, అనగా పది పట్టణములలో ప్రకటింప సాగాడు. కొన్ని నెలల తరువాత యేసు అచట బోధించెను (మార్కు 731).
దురదృష్టవశాత్తు నేడు మనం క్రీస్తుకు సాక్షమివ్వడానికి సిగ్గుపడుచున్నాం, భయపడుచున్నాం. దేవుడు మన జీవితాలలో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేయుచున్నాడు. వాటి గురించి మనం సాక్ష్యమివ్వాలి. నేడు క్రైస్తవ విశ్వాస వ్యాప్తికి మన పూర్వీకుల, తల్లిదండ్రుల, గురువుల, మఠవాసుల, సామాన్య విశ్వాసుల వ్యక్తిగత విశ్వాస సాక్ష్యాలేనని మనం గుర్తించాలి. మనం పొందిన ఆశీర్వాదాలు ఇతరులకు ప్రేరణగా మారాలి. యేసు శక్తిపై విశ్వాసం, మన జీవితములో ధైర్యముగా ముందుకు పోవునట్లు చేస్తుంది.
No comments:
Post a Comment