సామాన్య 3వ వారము - శనివారం (II)

దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 3వ వారము - శనివారం
2 సమూ 12:1-7, 10-17; మార్కు 4:35-41

ధ్యానాంశము: యేసు తుఫానును గద్దించుట
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “యేసు లేచి, గాలిని గద్దించి, 'శాంతింపుము' అని సముద్రముతో చెప్పగా, గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను” (మార్కు 4:39).
ధ్యానము: యేసు, ఆ దినము సాయం సమయమున తన శిష్యులతో, "సరస్సు దాటి ఆవలి తీరమునకు [అన్యులు ఉండు ప్రదేశము] పోవుదము రండు" అని చెప్పగా, వారు అచటనున్న జనసమూహమును వీడి [ప్రార్ధించుటకు లేదా వేరొకచోట సువార్తను ప్రకటించుటకు] యేసును పడవలో తీసుకొని పోయిరి. అపుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పడవను ముంచివేయునట్లుండెను. అది చూచి, శిష్యులు భయపడిరి. యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించు చుండెను [తండ్రి దేవునిపై గొప్ప విశ్వాసం - కీర్త 4:8]. నిద్రించుచున్న యేసును లేపిరి. యేసు లేచి, గాలిని గద్దించి, 'శాంతింపుము' అని సముద్రముతో చెప్పగా, గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను [యేసు సర్వాధికారి]. మీకు విశ్వాసము లేదా అని యేసు శిష్యులను మందలించెను. ఈ సంఘటన ద్వారా, మార్కు సువార్తీకుడు, యేసు దేవుడని, సృష్టికర్తయని ప్రకటిస్తున్నాడు. అంతట శిష్యులు మిక్కిలి కలవరపడుతూ "గాలియు, సముద్రము సయితము ఈయనకు లోబడుచున్నవి. ఈయన ఎవరో!" అని అనుకొనిరి (చదువుము: యోబు 38:8-11; కీర్త 65:7; 107:23-30; సామె 30:4). "నీవు క్రీస్తువు" (మార్కు 8:29) అని యేసు ఎవరోయని పేతురు వెల్లడి చేసెను. "నిస్సందేహముగా ఈయన దేవుని కుమారుడే" (మార్కు 15:39) అని యేసు ఎవరోయని శతాధిపతి వెల్లడి చేసెను.

దేవుడు మన చేయి విడనాడడు. మనలను ఎన్నడు ఎడబాయడు. ప్రభువు శిష్యులతో ఉన్నను, వారు ప్రాణభయముతో ఉన్నారు. వారికి ప్రభువునందు విశ్వాసం లేదని అర్ధమగుచున్నది. చీకటి వారిని ఆవరించినది. యేసు బోధనలు, అద్భుతాలు, స్వస్థతలు కళ్ళార చూసినను, వారు యేసును ఇంకను అర్ధం చేసుకొనలేదు. ప్రభువు ఎల్లప్పుడు మనతోనే ఉన్నారని దృఢముగా విశ్వసించాలి. ప్రభువు మనతో ఉంటె, మనం భయపడనవసరం లేదు. ఎన్ని కష్టాలు, బాధలు, శోధనలు ఎదురైనా, భయపడనవసరం లేదు. "చేతలు లేని విశ్వాసము నిష్పలమైనది" (యాకోబు 2:20). మనలోనున్న భయాన్ని విశ్వాసముతో జయించాలి. సముద్రములోని తుఫానువలె, మన జీవితములో అకస్మాత్తుగా ఏ ఆపదైనా రావచ్చు (మరణం, అనారోగ్యం, ఆర్ధిక సమస్య...)! సముద్రములోని తుఫానును మాత్రమేగాక, మన జీవితములోని అలజడులను సైతము ప్రభువు శాంతింప జేయును. ప్రభువుపై నమ్మకముంచాలి. ప్రభువు తప్పక మన జీవితాలను ఒడ్డునకు చేర్చును.

ఉత్థాన క్రీస్తు సాన్నిధ్యం ఉన్నంత వరకు, శ్రీసభ అను పడవకు కూడా ఎలాంటి ప్రమాదం, ఆపద కలుగదు. విశ్వాసముతో ఆ పడవ ముందుకు సాగిపోవాలి. మన జీవిత పడవలోనికి యేసును స్వాగతిద్దాం. మనమందరం కూడా కాలం అను సముద్రముగుండా, నిత్యజీవము అనే ఒడ్డుకు ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణములో, భౌతిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక తుఫానులకు లోనుకావడం సహజం. ఇలాంటి సమయములో, యేసు మాత్రమే మనకు ప్రశాంతతను, నిజమైన శాంతిని ఒసగును. అనుమానం అనే తుఫానులు మన విశ్వాస పునాదులను పెకలించి వేయునపుడు, యేసు తన దైవత్వాన్ని ప్రదర్శించి, మనలను బలపరచును.

No comments:

Post a Comment