దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 3వ వారము - శుక్రవారం
2 సమూ 11: 1-10, 13-17; మార్కు 4:26-34
ధ్యానాంశము: దేవుని రాజ్యమును గూర్చిన ఉపమానములు
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “ప్రజలు గ్రహింప గలిగినంత వరకు అనేక ఉపమానములద్వారా యేసు వారికి బోధించెను” (మార్కు 4:33).
ధ్యానము: నేటి సువిషేశములో రెండు ఉపమానములను వింటున్నాము. మొదటిది "పండిన పంట" (4:26-29). ఇది కేవలము మార్కు సువార్తలో మాత్రమే చూస్తాము. రెండవది ఆవగింజ ఉపమానము (4:30-34). ఈ రెండు ఉపమానములద్వారా, ప్రభువు దైవరాజ్యము గురించి బోధిస్తున్నారు. రెండు వేల సం.ల క్రితమే దైవరాజ్యము అనే ఈ విత్తనాన్ని ప్రభువు ఈ లోకములో నాటారు. అలాగే, జ్ఞానస్నానము పొందినప్పుడు, ఆ విత్తనాన్ని మన హృదయములో నాటారు. దైవరాజ్యం శక్తిగలది. అది మనలో పెరుగుతూనే ఉంటుంది.
దైవరాజ్యం పొలములో నాటబడిన విత్తనమును పోలియున్నది. విత్తనము మొలకెత్తి పెరిగి పెద్దదగును. మొదట మొలకలు, వెన్ను, అటుపిమ్మట కంకులు పుట్టును. దైవరాజ్యము కూడా నెమ్మదిగా, కాని స్థిరముగా అభివృద్ధి చెందును. ప్రకృతిలో ఎదుగుదల స్థిరముగా ఉంటుంది. అది పగలు, రాత్రి, ప్రజలు మేల్కొన్న, నిద్రిస్తున్న ఎదుగుదల జరుగుతూ ఉంటుంది. మానవుని ప్రమేయం లేకున్నను, ప్రకృతిలో ఎదుగుదల స్థిరముగా ఉంటుంది. ఇదంతయు దైవకార్యము. తన కుమారుడైన క్రీస్తుద్వారా, ఈ ఎదుగుదలను దేవుడు కలుగజేయు చున్నారు. ఆధ్యాత్మిక జీవితములో, 'పంటకాలం' లేదా 'కోతకాలం', తీర్పుదినమును సూచిస్తుంది. మన ఎదుగుదలలో అనేకసార్లు, దేవుని తోడ్పాటు లేదని గ్రహిస్తాం. కాని, దేవుని తోడ్పాటు ఎప్పటికీ ఆగదు అని మనం గ్రహించాలి. దేవుని రాజ్యముకూడా స్థిరముగా ఎదుగుతూ, అంతిమ కాలము వరకు కొనసాగును. ఇక్కడ ప్రధానమైన అంశం, విశ్వాసము. విశ్వాసము పెరుగు కొలదీ, దైవరాజ్యము పెరుగును. విశ్వాసములో ఎదగడం అనేది జీవితకాల ప్రక్రియ! విత్తనము ఏవిధముగానైతే, భూమినుండి, పోషణను, బలమును పుంజుకొని పెరుగునో, అలాగే ఒక విశ్వాసి, ప్రార్ధన, వాక్కు, దివ్యసంస్కారాలద్వారా బలపడుచూ ఎదగాలి.
ఆవగింజ ఉపమానము: దేవుని రాజ్యం ఆవగింజను పోలియున్నది. అన్ని విత్తనములకంటే చిన్నదైనను, భూమిలో నాటబడినప్పుడు, మొక్కలన్నింటి కంటే పెద్దదై, కొమ్మలతో, రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. దేవుని రాజ్యం సకల జాతులకు, ప్రజలకు ఆశ్రయమిచ్చును.
దేవుని చిత్తాన్ని తెలుసుకొని, ఆయన వాక్యం ప్రకారం జీవించినప్పుడు, దేవుని రాజ్య అభివృద్ధిలో భాగస్థుల మవుతాము. దేవుని వాక్యం ప్రకారం జీవించాలంటే, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్ధిస్తూ, మన జీవితాలను దేవునికి అర్పించుకోవాలి.
No comments:
Post a Comment