క్రిస్మస్ 2వ వారము - శనివారం
1 యోహాను 5:14-21; యోహాను 3:22-30
ధ్యానాంశము: యోహాను చివరి సాక్ష్యము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “ఆయన
హెచ్చింప బడవలెను. నేను తగ్గింపబడ వలెను” (యోహాను 3:30).
ధ్యానము:
యేసు తన శిష్యులతో యూదయా సీమకు వెళ్లి జ్ఞానస్నాన మిచ్చుచుండెను. యోహాను కూడా జ్ఞానస్నాన
మిచ్చుచుండెను. జ్ఞానస్నానం యూదుల శుద్ధీకరణ ఆచారము. యేసు జ్ఞానస్నాన మిచ్చుచున్నాడని,
యోహాను శిష్యులు ఆశ్చర్య పడ్డారు. యోహాను వద్దకు వెళ్లి చెప్పారు. కాని యోహాను
ఎప్పుడు కోపపడలేదు, అసూయ పడలేదు. దైవ ప్రణాళికలో తన పాత్ర ఏమిటో స్పష్టముగా
ఎరిగినవాడు; మెస్సయ్య మార్గమును సిద్దపరచుటయే తన కర్తవ్యమని తెలిసినవాడు. “నేను
క్రీస్తును కాననియు, ఆయన కంటే ముందుగా పంపబడిన వాడననియు” (3:28) అని మరోసారి
సాక్ష్యమిచ్చాడు. పెండ్లి కుమారుడు యేసు అయితే, తాను అతను చెప్పినట్లు చేయు
మిత్రునిగా, సేవకునిగా భావించాడు. “దేవుని చిత్తానుసారముగా” జీవించాడు. క్రీస్తే “యధార్ధమగు
దేవుడు. నిత్య జీవము” (1 యోహాను 5:20) అని యోహాను ఎరిగియున్నాడు.
ఒకానొక సందర్భములో యేసు శిష్యులు ఎవరు మొదటివారని
వాదులాడుకున్నారు. కాని బప్తిస్మ యోహాను అందుకు విరుద్ధం. తన గుర్తింపు కొరకు,
ప్రసిద్ధి కొరకు, ఎప్పుడు యోహాను ప్రాకులాడలేదు. యేసు గుర్తింప బడుటను చూసి,
యోహాను మిక్కిలిగా సంతోషించాడు. ఎలిశబేతమ్మ గర్భమందలి శిశువు యోహాను ఆనందముతో
గంతులు వేసాడు (లూకా 1:41, 44). “ఈ నా ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది. ఆయన హెచ్చింప
బడవలెను. నేను తగ్గింపబడ వలెను” (3:30) అని పలికాడు. ఇది యోహాను వినయానికి
తార్కాణం. అతనే దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేసి, తన శిష్యులను కూడా క్రీస్తు
శిష్యులు కమ్మని ప్రోత్సహించాడు.
మన సంగతి ఏమిటి? ఇతరుల విజయాన్ని మనం ఎలా
స్వీకరిస్తున్నాం? అసూయతో వారిని అణచివేయాలని చూస్తున్నామా? క్రైస్తవులముగా,
యోహానువలె క్రీస్తును ఇతరులకు తెలియజేయాలి. ఇది మన బాధ్యత! యోహాను వంటి వినయాన్ని
అలవర్చుకుందాం! పౌలుతో కలిసి, “ఇక జీవించునది నేను కాదు. క్రీస్తే నాయందు జీవించు
చున్నాడు” (గలతీ 2:20) అని చెప్పగలగాలి.
No comments:
Post a Comment