క్రిస్మస్ 2వ వారము - శుక్రవారం (II)

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
క్రిస్మస్ 2వ వారము - శుక్రవారం
1 యోహాను 5:5-13; లూకా 5:12-16

ధ్యానాంశము: కుష్ఠ రోగికి స్వస్థత

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “ప్రభూ నీ చిత్తమైనచో నన్ను ఆరోగ్యవంతుని చేయగలరు” (లూకా 5:12).

ధ్యానము: ఆ కాలములో చర్మసంబంధ రోగాలన్నీ కూడా ఆశుద్ధతగా పరిగణించేవారు. అలాంటివారు ప్రజలనుండి బహిష్కరింప బడేవారు. ప్రజలనుండి దూరముగా ఒంటరిగా జీవించేవారు. అద్దె బట్టలు, గీసిన తల, పైపెదవిని కప్పుకొని ఉండేవారు. వెళ్ళేటప్పుడు, ‘ఆశుద్ధుడను, ఆశుద్ధుడను’ అంటూ కేకలిడుతూ వెళ్ళేవారు. కుష్ఠ రోగులను మరణించిన వారిగా చూసేవారు. బ్రతికిన శవంలా పరిగణించేవారు. వారి పాపాలే లేక వారి పూర్వీకుల పాపాలే కుష్ఠ రోగానికి కారణముగా భావించేవారు. వారిని ద్వేషించేవారు. కుష్ఠ రోగులకు నియమముల గురించి లేవీయ కాండము 13:45-46లో చూడవచ్చు.

నేటి సువార్తలో అలాంటి ఒక కుష్ఠ రోగిని యేసు స్వస్థ పరుస్తున్నారు. దేవుని ప్రేమకు, దయ, కనికరమునకు గొప్ప నిదర్శనం. యేసు దూరముగా ఉండి ఆ వ్యక్తిని స్వస్థపరచలేదు. యేసు తన చేయి చాపి, అతనిని తాకి, “నీవు స్వస్థుడవు కమ్ము” అని పలికి స్వస్థత ఒసగెను. ఇచట రెండు విషయాలు ధ్యానించాలి: ఒకటి దేవుని అనంతమైన, షరతులులేని ప్రేమ; పాపమువలన, రోగము వలన సమాజమునుండి వెలివేయబడిన వారిని ఐఖ్యము చేయడమే యేసు ముఖోద్దేశముగా చూడాలి. రెండవది కుష్ఠ రోగి విశ్వాసం. యేసు చేసిన అద్భుతాల గురించి కుష్ఠ రోగి విని, తన అవకాశం కొరకు ఆశతో, ఓపికతో వేచి చూసాడు. అవకాశం రాగానే, యేసు వద్దకు వచ్చి సాగిలపడి, స్వస్థపరచమని ప్రార్ధించాడు. తన హృదయములోని విశ్వాసమును చూడవచ్చు. ఆ విశ్వాసమే అతనిని స్వస్థ పరచినది.

నేడు కుష్ఠ రోగులు ఎవరు? మన ప్రేమకు అనర్హులుగా భావించేవారు, మానసిక బాధలు అనుభవించేవారు, సమాజములో పెద్దపెద్ద తప్పులు చేసేవారు; అలాంటి వారిని మనం చీదరించుకుంటాం. తప్పును, పాపాన్ని ఖండించాలి, కానీ పాపాత్ములను ప్రేమించాలి. వారు మారుమనస్సు చెందుతారనే ఆశను కలిగి యుండాలి. నేటి సమాజములోని అట్టడుగు, బడుగు వర్గాలవారితో మనం ఎలా ఉంటున్నాము? రోగులపట్ల మనం ఎలా ఉంటున్నాము? పాపం మన ఆత్మకు పట్టిన కుష్ఠ రోగం. ఏదోరకముగా మనమందరం కుష్ఠ రోగులమే! మనకీ ప్రభువు స్వస్థత అవసరమే! ప్రభువా! నీ హస్తమును మాపై చాచి మా ఆధ్యాత్మిక కుష్ఠ రోగమును స్వస్థపరచుము!

No comments:

Post a Comment