దేవుని ప్రేమ సందేశం: అనుదిన
ధ్యానాంశాలు (II)
సామాన్య 1వ వారము - సోమవారం
1 సమూ 1:1-8; మార్కు 1:14-20
ధ్యానాంశము: యేసు ప్రబోధము - ప్రధమ శిష్యులను
పిలుచుట
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “కాలము సంపూర్ణమైనది. దేవుని
రాజ్యము సమీపించినది. హృదయపరివర్తనము చెంది, సువార్తను విశ్వసింపుడు” (మార్కు 1.:15).
ధ్యానము: యేసు యెరూషలేములోగాక
[దేవాలయం, యాజకులు, బలులు, ఆచారాలు], యూదుల ప్రార్ధనాలయములోగాక, దూరప్రాంతమైన గలిలీయ
సీమకు వచ్చి [దేవుని ప్రేషితకార్యం ఎక్కడైనా ప్రారభం కావచ్చని వ్యక్తమగుచున్నది], “కాలము
సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించినది” అని దేవుని సువార్తను ప్రకటించారు. తన
బహిరంగ ప్రేషిత కార్యమున ఆరంభించారు. దేవుని [క్రీస్తు] సువార్త “దేవుని రాజ్య
ఆగమనం”. మానవాళిని పరిపాలించుటకు, దేవుని పరిపాలన లేదా దేవుని రాజ్యం వచ్చుట. దేవుని
చిత్తము మన జీవితాలలో నెరవేరడం. దీనినిమిత్తమై, “హృదయపరివర్తనము చెంది, సువార్తను విశ్వసింపుడు”
అని యేసు ఉద్భోదించారు. కనుక, దేవుని రాజ్యము కొరకు మన హృదయాలను సంసిద్ధం
చేసుకోవాలి.
యేసు తన పరిచర్యను ఒంటరిగా ప్రారంభించిన సమయములో,
తన ప్రేషిత కార్యములో సహచరులుగా, సహకారులుగా ఉండుటకు ప్రధమ శిష్యులను పిలచుచున్నారు.
యేసు పరిసయ్యులను, సద్దూకయ్యులను పిలువలేదు. సాధారణమైన జాలరులను (బెస్తలను) పిలిచారు.
యేసు గలిలీయ సరస్సు తీరమున వెళ్ళుచుండగా, చేపలను పట్టుకొనుచున్న సీమోనును, అతని
సోదరుడు అంద్రేయను, అలాగే పడవలో వలలను బాగుచేసికొనుచున్న జెబదాయి కుమారులు యాకోబు,
యోహానులను, “మీరు నన్ను అనుసరింపుడు మిమ్ము మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదను”
(మార్కు 1:17) అంటూ వారిని పిలిచారు. వారు వెంటనే తమ వలలను విడిచిపెట్టి యేసును
అనుసరించారు. వారిని “మనుష్యులను పట్టువారినిగా”, అనగా దైవరాజ్య వ్యాప్తికొరకు పిలువబడుచున్నారు. సువార్తా బోధనద్వారా, వారు ప్రజలను రక్షింపవలసి యున్నది. వారి పిలుపు
ఎన్నో సవాళ్ళతో కూడుకున్నది. వారి
జీవితాలను సైతం అర్పించవలసి యుంటుంది.
ప్రధమ శిష్యులు, “వెంటనే”
వారి సమస్తమును [కుటుంబము, సన్నిహితులు, జీవనాధారం] విడచి యేసును అనుసరించారు.
యేసు మనలనుకూడా పిలచుచున్నారు. మరి మన సమాధానం, ప్రతిస్పందన ఏమిటి? యేసు పిలుపుకు
ప్రతిస్పందించడానికి నీ సమస్తమును విడనాడుటకు సిద్ధముగా ఉన్నావా? భూలోకమున దైవరాజ్య
స్థాపనలో భాగముగా యేసు ప్రేషిత కార్యములో మనం ఏవిధముగా యేసుతో సహకరిస్తున్నాము? యేసు
పిలుపు ప్రతీ ఒక్కరికీ ఉద్దేశించబడినది. క్రైస్తవులముగా మనం సువార్తను
వ్యాప్తిచేయుటకు పిలువబడి యున్నాము. మనం ఉన్న ప్రాంతములో మనం యేసుకు సాక్షులముగా
జీవించాలి. క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచాలి. సువార్తను, శ్రీసభ బోధనలను
ప్రకటించాలి. నేటి మొదటి పఠనం ఓ చక్కటి ఉదాహరణ. అన్నా గొడ్రాలు అగుటవలన ఆమె సవితి
పెనిన్నా ఆమెను ఎగతాళి చేసి ఏడిపించు చుండెడిది. అన్నా ఎంతగానో దిగులు పడేది.
అప్పుడు ఆమె భర్త ఎల్కానా, “నేను నీకు పదిమంది కుమారుల కంటె ఎక్కువ కాదా?” అని
ఆమెను ఓదార్చెడివాడు. ఎల్కానా వలె మనం బాధలలో నున్నవారిని ఓదార్చుచున్నామా? యేసు
ప్రేషిత కార్యములో భాగస్థులము కావాలంటే, మన పాపాలకై పశ్చాత్తాప పడి, మన జీవితాలను
పునరుద్దరించు కోవాలి. దేవుని శక్తిపై ఆధారపడాలి.
No comments:
Post a Comment