దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 2వ వారము - బుధవారం
1 సమూ 17: 32-33, 37, 40-51; మార్కు 3:1-6
ధ్యానాంశము: ఊచ చేయి గలవానికి స్వస్థత
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “అంతట యేసు కోపముతో నలుదెసలు చూచి, ఆ జనుల హృదయ కాటిన్యమునకు చింతించి, రోగితో, ‘నీ చేయి చాపుము’ అనెను. వాడట్లే చాపగా స్వస్తుడాయెను” (మార్కు 3:5).
ధ్యానము: సబ్బాతు దినమున, ప్రార్ధనలో పాల్గొనడానికి, వాక్యమును బోధించడానికి, అలాగే ముఖ్యముగా సబ్బాతు దినమున మంచి చేయుటలో తప్పులేదని నిరూపించుటకు, యేసు మరల ప్రార్ధనా మందిరములో ప్రవేశించెను (బహుషా, కఫర్నాములో). దీనిని ధృవీకరించడానికి యేసు అచట ఊచ చేయి గలవానికి స్వస్థతను ఒసగారు. ఆ వ్యక్తి యొక్క స్థితి దయనీయమైనది. ఊచ చేయి వలన, తన జీవనోపాధి కోసం పని చేసుకోలేక పోవుచున్నాడు. అందుకే, యేసు ఆ వ్యక్తిపై జాలిపడి స్వస్థతను చేకూర్చారు.
అయితే, అచటి జనులు కొందరు మాత్రము, పరిసయ్యులతో సహా, యేసుపై నేరము మోపుటకు కాచుకొని యుండిరి. ఆ వ్యక్తి స్వస్థత కొరకు అర్ధించకుండా, అడ్డుకోవాలని చూసారు. సబ్బాతు దినమున స్వస్థత చేస్తే, చట్టాన్ని నిరాకరించారని నిందలు వేయుటకు వేచి చూస్తూ ఉన్నారు. కాని యేసు మంచి చేయడానికి, ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి వారి బెదిరింపులకు వెనుకాడలేదు.
యేసు సబ్బాతు చట్టాన్ని పాటించాడు; అచట బోధనలు చేసాడు; ప్రార్ధనలలో పాల్గొన్నాడు (మార్కు 6:12; లూకా 4:16, 31). అయితే పరిసయ్యుల సంకుచిత మనస్తత్వాన్ని, హృదయ కాఠీన్యతను తీవ్రముగా ఖండించారు. ప్రత్యేకముగా, విశ్రాంతి దినమున స్వస్థత పరిచర్యను వారు అడ్డుకున్నప్పుడు, తోటి మానవులకు సహాయం, మేలు చేయడానికి ఏ సమయమైన సరియైనదేనని నొక్కిచెప్పారు. విశ్రాంతి దినమున స్వస్థత పరచుట చట్టబద్ధమేనా అని ప్రశ్నించినప్పుడు, యేసు, “ఏమీ! మీలో ఎవడైన విశ్రాంతి దినమున తన గొర్రె గోతిలో పడినచో దానిని పట్టి వెలుపలకు తీయడా? గొర్రెకంటే మనుష్యుడు ఎంతో విలువగల వాడు కదా! కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట తగును” (మత్తయి 12:10-12) అని సమాధాన మిచ్చారు. యేసు తన అభిప్రాయాన్ని నొక్కి చెప్పడానికి, విశ్రాంతి దినమున తన స్వస్థత పరిచర్యను అనేకసార్లు కొనసాగించారు (మార్కు 1:21-28; 1:29-31; లూకా 13:10-17; 14:16; యోహాను 5: 1-18; 9:1-41).
సబ్బాతు చట్టం ప్రాధమికముగా మానవ శ్రేయస్సు, సంక్షేమం కొరకని యేసు బోధించారు. సబ్బాతు చట్టానికి బానిసలుగాక, సబ్బాతు విశ్రాంతి నుండి ప్రయోజనం పొందాలని యేసు కోరుచున్నారు.
యేసు స్వస్థత చేసిన తరువాత, పరిసయ్యులు వెలుపలకు వచ్చి, యేసును చంపుటకు తరుణోపాయమునకై హేరోదీయులతో వెంటనే ఆలోచనలు చేసిరి (3:6).
చట్టాల కంటే, మనుష్యులకు ఎక్కువ విలువను ఇస్తున్నామా? ఇతరులకు మంచి, మేలు చేయడానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం! దేవునికి స్తుతులు అర్పించుదాం! యేసు నామమునకు మహిమ చేకూర్చుదాం! దయగల హృదయం ఆధ్యాత్మిక పరిపక్వతకు సంకేతం!
సబ్బాతు చట్టం – నిర్గమ 20:8; ద్వితీయ 5:12. పరిసయ్యులు సబ్బాతు చట్టాన్ని తప్పుగా వివరించారు. యేసు ఎప్పుడు కూడా చట్టాల వలన దేవుని అసలు ఉద్దేశాన్ని తెలపడానికి ప్రయత్నం చేసారు: దేవున్ని ఆరాధించడం, ధర్మశాస్త్రాన్ని (బైబులు పఠనం) నేర్చుకోవడం, దానిని బోధించడం, ఇతరులకు మంచి / మేలు చేయడం.
ఆదివారం – దివ్యపూజాబలిలో పాల్గొనడం వలన ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకొని, తద్వారా, చెడును నివారించి, ఇతరులకు మంచి చేయగలం. దేవునికి బలిపీటం మీద మన జీవితాలను అర్పించాలి. మన పాపాలకు దేవుని క్షమాపణ కోరుకోవాలి. మన మనవులను దేవునికి విన్నవించుకోవాలి. దివ్యసత్ప్రసాదాన్ని లోకొనడం ద్వారా దైవీక జీవితములో పాలుపంచు కొంటాము. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి. విచారణ కార్యకలాపాలలో పాలుపంచుకోవాలి.
No comments:
Post a Comment