సామాన్య 2వ వారము - మంగళవారం (II)

దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 2వ వారము - మంగళవారం
1 సమూ 16: 1-13; మార్కు 2:23-28

ధ్యానాంశము: యేసు శిష్యులు – సబ్బాతు దినము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింప బడినది గాని, విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింప బడలేదు. కనుక మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడ ప్రభువే” (మార్కు 2:27).
ధ్యానము: విశ్రాంతి దినము దేవుని మంచితనాన్ని బట్టి, సృష్టిలోను, రక్షణలోను ఆయన మంచితనమును గూర్చి కొనియాడటము. దేవుని స్తుతించు దినము. వారం చివరన విశ్రాంతికి వేదాంత పరమైన ఆధారం ఆది. 2:1-3). మరొక కారణం చారిత్రకమైనది: ఇశ్రాయేలీయులును, వారి జంతువులును ఏడవ దినమున విశ్రాంతి తీసుకోవలెను. ఎందుకన వారు ఒకప్పుడు ఐగుప్తున బానిసలుగా ఉంటిరని వారు గుర్తుంచుకొన వలెను (ద్వితీయ 5:12-15). సబ్బాతు దినమును పవిత్రముగా ఉంచవలయును అన్న నియమమును పాటించుటకు, రబ్బీయులు 39 రకాల పనులను ఆ దినమున నిషేధించిరి. వాటిలో మూడవదే, పంట కోయడం.
యేసు పంట పొలములో సాగి పోవుచుండగా, ఆయన శిష్యులు వెన్నులను త్రుంప ఆరంభించిరి. దానిని చూచిన పరిసయ్యులు, “విశ్రాంతి దినమున చేయదగని పనిని వీరేల చేయుచున్నారు?” (2:24) అని యేసును ప్రశ్నించిరి. దానికి సమాధానముగా, ఆచారాలకన్న, మానవ అవసరతలు ప్రాధాన్యము అన్న విషయాన్ని యేసు స్పష్టం చేయుచున్నాడు. దావీదు ఉదంతమును ప్రభువు గుర్తుచేశారు (2:25-26). “మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింప బడినదిగాని, విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింప బడలేదు. కనుక మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడ ప్రభువే” (మార్కు 2:27) అని ప్రభువు పలికియున్నారు.
“మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడ ప్రభువే” అన్న పలుకులు యేసు మన జీవితాలకు, కుటుంబాలకు, బంధాలకు కేంద్రం అని తెలియుచున్నది. అయితే, ప్రధానముగా ఆయన మన ఆరాధనలాన్నింటికీ కేంద్రము. దీని గురించి, ద్వితీయ వాటికన్ మహాసభ అధికార పత్రమైన, “పవిత్ర దైవార్చనా చట్టం”లో ఇలా చదువుచున్నాము: శ్రేసభ ఒంటరి కాదు; ప్రభు క్రీస్తు ఎప్పుడూ శ్రీసభతోనే ఉన్నారు, శ్రీసభలోనే ఉన్నారు. ఆయన సన్నిధానం, సాన్నిహిత్యం దైవార్చనా సాంగ్యాలలో సదా ప్రత్యక్షమవుతూ ఉంటాయి. దివ్యపూజలో ప్రభువు ప్రత్యక్షమవుతున్నారు. పూజలో సమర్పించబడే “అప్పద్రాక్షరస” రూపాల్లోనూ మన మధ్య సాక్షాత్కరిస్తున్నారు. దివ్యసంస్కారాల ద్వారా కూడా మనకు ప్రభువు సాక్షాత్కారం లభిస్తోంది. అదే విధముగా ప్రభువు తన “వాక్కు”లో స్వయముగా తానే కొలువై ఉంటారు. పవిత్ర గ్రంథాన్ని పటించేటప్పుడు, స్వయాన ప్రభువే పలుకుతారు. చివరిగా, శ్రీసభ ప్రార్ధించే వేళల్లోనూ, స్తుతిగానాలతో ప్రభువును కీర్తించే గడియల్లోనూ అక్కడ ప్రభువు ఉంటారు. “ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడుదురో అక్కడ నేను వారి మధ్య” ఉంటానని (మత్తయి 18:20) ఇచ్చిన మాట ప్రకారమే ప్రార్ధానా పరుల మధ్య ప్రభు సాక్షాత్కారం జరుగుతుంది.
రెండవదిగా, మన వ్యతిగత ప్రార్ధనకు ఆయనే కేంద్రం. మనం చేసే ప్రార్ధనలు అన్నీకూడా (జపమాలతో సహా) క్రీస్తు కేంద్రీకృతమైన ప్రార్ధనలు. ఆయన మన ఆధ్యాతిక జీవితాలకు, ప్రయాణానికి ప్రభువు. కనుక ఆయన ప్రతీరోజు మనతో ఉండాలి. మూడవదిగా, మన నైతిక జీవితాలకు ఆయన కేంద్రము, పునాది. “మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింప బడినది గాని, విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింప బడలేదు.” నైతికత అనేది మనిషియొక్క స్వభావం. మన రోజువారి నైతిక నిర్ణయాలలో, ఏది మంచో, ఏది చెడో నిర్ణయించుటలో క్రీస్తే అంతిమ ప్రధానం. మన మంచి-చెడు చర్యలకు తీర్పు విధించునది క్రీస్తే! మన మంచి కార్యాలు క్రీస్తునందు నిత్యజీవితానికి నడిపిస్తాయి.

No comments:

Post a Comment