క్రిస్మస్ 2వ వారము - గురువారం (II)

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
క్రిస్మస్ 2వ వారము - గురువారం
1 యోహాను 4:19-5;4; లూకా 4:14-22

ధ్యానాంశము: నజరేతులో యేసు

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “ప్రభువు ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను బోధించుటకై ...నన్ను పంపెను” (లూకా 4:18-19).

ధ్యానము: యేసు ఆత్మ బలముతో గలిలీయ సీమకు తిరిగి వెళ్ళారు. ఆయన కీర్తి అంతటా వ్యాపించింది. అంతటా యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చారు, అనగా, స్వగ్రామమునకు వచ్చారు. అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్ధనా మందిరమునకు (సినగోగు) వెళ్ళారు. యెషయా ప్రవక్త గ్రంథమును అందించగా దానినుండి ఆయనకు కనిపించిన వాక్యములను చదివారు (యెషయ 61:1-2; 58:6). చదివిన పిమ్మట, “నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది” అని పలికారు. అనగా ప్రజలు ఎదురుచూచుచున్న ‘అభిషిక్తుడు’, ‘మెస్సయ్య’ తనేనని, తాను పేదలకు సువార్తను బోధించుటకై వచ్చెనని, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, పీడితులకు విమోచనమును కలుగజేయుటకు, పాపమునుండి విడుదల ఒసగుటకు, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు వచ్చెనని తెలియజేసాడు. యేసు బోధన కేవలం యెషయ ప్రవక్త ప్రవచనం మాత్రమేగాక, యూదుల పవిత్ర లేఖనాలన్నీ యేసుక్రీస్తు నందు నేరవేరునని అర్ధమగుచున్నది. 

యేసుయొక్క ఈ ప్రేషిత కార్యమును నేడు మనం కొనసాగించాలి. అది మనందరి బాధ్యత! మనంకూడా జ్ఞానస్నానముద్వారా పరిచర్యకు అభిషేకింపబడినాము. అవకాశమున్న ప్రతీసారి యేసు దేవుని గురించి బోధించాడు. మరి క్రీస్తును గురించి బోధించుటకు మనం సిద్ధముగా ఉన్నామా? పరిద్ధాత్మ దేవుడు మొదటి సువార్తీకుడు, కనుక మన సువార్త పరిచర్య సఫలీకృత మవుటకు ఆత్మదేవుని సహాయం వేడుకోవాలి. యేసు వలె మనంకూడా ఇతరులకు సేవ చేయాలి. ఇతరులకు దేవుని సువార్తను ప్రకటించాలి. మన దైనందిన కార్యాలలో ప్రేమపూర్వకమైన కార్యాలను చేయాలి. నేటి మొదటి పఠనములో వింటున్నాం: “దేవుడు మనలను మొదట ప్రేమించుట చేతనే మనమును ప్రేమింతుము. కనుక దేవుని ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింప వలెను అనునదియే క్రీస్తు మనకు ఒసగిన ఆజ్ఞ” (1 యోహాను 4:19,21).

No comments:

Post a Comment