దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
క్రిస్మస్ 2వ వారము - బుధవారం
1 యోహాను 4:11-18; మార్కు 6:45-52
ధ్యానాంశము: యేసు నీటిపై నడచుట
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “ధైర్యము
వహింపుడు. నేనే కదా! భయపడకుడు” (మార్కు 6:50).
ధ్యానము:
‘ఐదు వేల మందికి ఆహారము’ అద్భుతము తరువాత, ప్రజలు వెళ్ళాక, శిష్యులు ఒక పడవపై
ఎక్కి, ఆవలి తీరమందలి ‘బెత్సయిదా’ పురమునకు చేరవలెనని యేసు వారికి చెప్పారు.
వారిని పంపిన పిదప, ప్రార్ధించుటకై యేసు ఏకాంతముగా పర్వత ప్రాంతమునకు వెళ్ళారు.
ప్రార్ధన అనగా తన తండ్రి దేవునితో సంభాషించుట, తండ్రితో తన బంధాన్ని బలపరచుకొనుట, తన
ప్రేషిత కార్యమునకు బలమును చేకూర్చుకొనుట.
సాయంసమయమునకు ఆ పడవ సరస్సు మధ్యకు చేరినది. యేసు
మాత్రము తీరముననే ఒంటరిగ ఉన్నారు. గాలి ఎదురుగా వీచుచుండుటచే శిష్యులు శ్రమపడుట
యేసు చూసారు. ఈ సన్నివేశం మన జీవితాలలోకూడా తరుచుగా సంభవిస్తూ ఉంటుంది. మన
విశ్వాసం ఊగిసలాడుతున్నప్పుడు, కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు, దేవుడు లేడని, మనకు
ఎక్కడో దూరముగా ఉన్నాడని, మన ప్రార్ధనలను ఆలకించడం లేదని భావిస్తూ ఉంటాము. ఇలాంటి
సమయములో మొదటిగా మనం చేయాల్సినది ప్రార్ధన.
ప్రభువు ఎల్లప్పుడు మన చేరువలోనే, దరిలోనే ఉన్నారు.
సముద్రముపై వచ్చు యేసును చూచి ‘భూతము’ అని తలంచి కేకలు వేసారు. కలవర పడ్డారు. ప్రకృతిపై
దేవునికున్న అధికారం తెలియుచున్నది. ఎందుకన, సర్వం ఆయన సృష్టియే కదా!
అప్పుడు యేసు, “ధైర్యము వహింపుడు. నేనే కదా!
భయపడకుడు” అని చెప్పారు. ఒక్కోసారి భయము మన విశ్వాసాన్ని జయిస్తుంది! అలాంటి
సమయములో విశ్వాసం కొరకు ప్రార్ధన చేయాలి! నేటి మొదటి పఠనములో విన్నట్లుగా, “ప్రేమయందు
భయము ఉండదు. పరిపూర్ణ ప్రేమ భయమును తరిమి వేయును” (1 యోహాను 4:18). భయపడువారు,
క్రీస్తును, ఆయన ప్రేమను గుర్తించలేరు. శిష్యుల హృదయములు కఠీనమాయను, అందుకే ఐదు
రొట్టెల అద్భుతములోని అంతర్యమును గ్రహింపలేక పోయారు (6:52). నీటిపై నడచి వచ్చిన
యేసును గుర్తింపలేక పోయారు.
మన ప్రార్ధన ఎంత బలహీనమైనదైనను ప్రభువు ఆలకిస్తారు.
“యేసు పడవ ఎక్కగా ఆ పెనుగాలి శాంతించెను” (6:51). యేసు మన జీవితములో ఉంటే, ఎలాంటి
కష్టమైనా కరిగిపోతుంది. శాంతి, సమాధానాలు ఉంటాయి. ఆయన సన్నిధి మనలోని భయాలను
తొలగిస్తుంది. క్రీస్తుతో నడచిన, ఎన్ని తుఫానులనైనను మనం దాటవచ్చు.
యేసు నీటిపై నడచుట యేసులోని దైవీక శక్తిని ప్రదర్శిస్తుంది.
దేవుడు మోషేతో “నేను ఉన్నవాడను” (నిర్గమ 3:14) అన్న మాటలు గుర్తుకొస్తాయి. శ్రీసభలోను,
మనలోను ఉన్న పెనుగాలి వంటి భయాలను యేసు క్రీస్తు తొలగించునని విశ్వసించుదాం.
వ్యక్తిగత జీవితములో బలమైన సందేహాలకు, ప్రలోభాలకు, భయాందోళనలకు, చింతలకు
లోనైనప్పుడు, రక్షింపుమని యేసును వేడుకుందాం.
No comments:
Post a Comment