సామాన్య 1వ వారము - బుధవారం (II)

దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 1వ వారము
 - బుధవారం
1
సమూ 3:1-10
; మార్కు 1
:29-39

ధ్యానాంశము: సీమోను అత్తకు ఆరోగ్య ప్రదానము – వేదప్రచారము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “మనము పరిసర గ్రామములకు పోవుదము రండు. అచట కూడా నేను సువార్తను ప్రకటింప వలయును. ఇందు కొరకే నేను బయలుదేరి వచ్చితిని” (మార్కు 1:38).
ధ్యానము: యేసు కఫర్నాములోని ప్రార్ధనా మందిరమునుండి యాకోబు, యోహానులతో తిన్నగా సీమోను, అంద్రేయల ఇంటికి వెళ్ళారు. యేసు జ్వరముతో మంచము పట్టిన సీమోను అత్తకు సంపూర్ణ స్వస్థతను కలుగజేశారు. బహుశా, సీమోను పేతురు, యేసును యింటికి పిలిచి ఉండవచ్చు! అప్పటికే యేసు అనేకమందికి స్వస్థతను చేకూర్చియున్న విషయం శిష్యులకు తెలుసు! అందులకే, పేతురు ప్రభువునకు మనవి ప్రార్ధన చేసియుండవచ్చు! ప్రభువు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా, జ్వరము వీడిపోయెను. అంతట ఆమె వారికి పరిచర్య చేయసాగెను. క్రీస్తు ఒసగిన బలముతో, శక్తితో, స్వస్థతతో ఆమె సేవలో మునిగిపోయింది. తద్వారా, ఆమె సంపూర్ణ స్వస్థతను పొందియున్నదని తెలియుచున్నది. మనం స్వస్థత పొందినప్పుడు, మనంకూడా ఇతరుల జీవితాలలో ‘స్వస్థత’ను తీసుకొని రావాలి. ఇతరులకు సహాయం చేయాలి. ఇతరులకు సేవ చేయడంద్వారా, మనకున్నది ఇతరులతో పంచుకోవడంద్వారా, దేవునినుండి మనం పొందిన వరములకు ఆయనకు కృతజ్ఞులమై యుండగలము.
కొన్నిసార్లు ప్రభువు సాన్నిధ్యాన్ని, ఆయన స్వస్థత శక్తిని మనం గుర్తించలేక పోతూ ఉంటాము. “మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనను మీరు ఎరుగరు” (యోహాను 1:26) అని బప్తిస్మ యోహాను పలికిన విధముగా, మనం ఆయనను గుర్తించలేక పోవుచున్నాము. యేసు ఎల్లప్పుడు అందరికీ సహాయం చేయడానికి, స్వస్థత చేకూర్చడానికి అందుబాటులో ఉంటాడని తెలుసుకుందాం. ఆయన మనలను కనుగొనే వరకు ఆగడు. యేసు మనలనుకూడా తాకినచో, మన పాపాలనుండి స్వస్థత పొందుతాము. అలాగే, యేసు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరిని స్వస్థత పరచారు. అనేక దయ్యములను వెడల గొట్టారు. ఈ అద్భుతాలు, స్వస్థతలన్నీకూడా దైవరాజ్యమును గురించిన ప్రబోధమును (1:14-15) ధృవీకరిస్తున్నాయి. యేసును ప్రేమించిన వారిని, ఆయన కొరకు జీవితమును అంకితము చేసిన వారి కుటుంబ సభ్యులను ఆయన ఎప్పుడు కాచి కాపాడును.
వేకువ జాముననే లేచి, తన తండ్రితో సన్నిహితముగా సంభాషించుటకు, తండ్రి చిత్తమును తెలుసుకొనుటకు, తండ్రి దేవుని శక్తిని పొందుటకు, ఒక నిర్జన ప్రదేశమునకు (‘దేవున్ని కలుసుకొను స్థలము’) వెళ్లి, ప్రార్ధన చేసుకొనెను (1:35). యేసు ప్రార్ధించడం ఎప్పుడు మానలేదు, మరువలేదు. మనం కూడా ప్రతీరోజు వేకువ జామున, లేవగానే ప్రార్ధనకు కొంత సమయాన్ని కేటాయించాలి. అప్పుడు దినమంతయు దేవుని శక్తితో జీవించగలము. అటుపిమ్మట సువార్తను ప్రకటించుటకై పరిసర ప్రాంతములకు వెళ్ళెను. యేసు గలిలీయ సీమ యంతట పర్యటించెను (1:39). ఆయన సువార్త అందరికీ అని అర్ధమగుచున్నది.
మొదటి పఠనములో ప్రభువు సమూవేలును పిలుచుట గురించి వింటున్నాము. అప్పటికి సమూవేలు ఇంకా బాలుడే! ప్రభువు పిలచినప్పుడు, మొదటిగా ఏలీ పిలిచెనని అనుకున్నాడు. అయితే, ప్రభువు పిలుపుకు ఎలా స్పందించాలో ఏలీ సమూవేలుకు తెల్పియున్నాడు: “ప్రభూ! ఆనతి యిమ్ము. నీ దాసుడు ఆలించుచునే యున్నాడు” (1 సమూ. 3:9). అలాగే, ప్రభువు పిలుపునకు స్పందించిన సమూవేలును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. తనకు ప్రవక్తగా, యాజకునిగా, న్యాయాధిపతిగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు మనలను కూడా ఆశీర్వదించును గాక!

No comments:

Post a Comment