దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 1వ వారము - గురువారం
సమూ 4:1-11; మార్కు 1:40-45
ధ్యానాంశము: కుష్టరోగికి
స్వస్థత – తిరిగి ఐఖ్యపరచుట
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “నాకు
ఇష్టమే శుద్ధి పొందుము” (మార్కు 1:41).
ధ్యానము: నేటి
సువార్తలో, ఒక కుష్టరోగి ప్రభువు ఎదుట మోకరించి, “నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థ
పరుప గలవు” అని ప్రాధేయ పడ్డాడు. కుష్టరోగిని యేసు ఎంతో ఇష్టముతో, దూరమునుండిగాక, దగ్గరగా
ఉండి, తన చేయిని చాచి, వానిని తాకి స్వస్థత పరచారు. “వెంటనే అతని కుష్ఠరోగము
తొలగిపోయెను. అతడు శుద్ధుడయ్యెను” (1:42). దేవుని శక్తివంతమైన హస్తము చాపబడినది. లేవీయ
కాండములో (అధ్యాయములు 13, 14) వివరించిన విధముగా, కుష్టరోగము అనేక చర్మవ్యాధులను
కలిగి యుంటుంది. అందులకే కుష్టరోగులు సమాజానికి దూరముగా జీవించేవారు. ఎవరైనా దరిలో
కనబడితే, బిగ్గరగా, “ఆశుద్ధుడను, ఆశుద్ధుడను” అని కుష్ఠరోగులు అరిచేవారు.
కుష్ఠరోగులను వేరుచేయడం వలన, చట్టం ఇతరులను కాపాడగలిగింది, కాని చట్టం ఏవిధముగాను కుష్ఠరోగులను
శుద్ధి చేయలేక పోయింది. కుష్ఠరోగమునుండి శుద్ధిని పొందినచో, కేవలం యాజకుడు మాత్రమే
దానిని ధ్రువీకరింప వలయును.
యేసు అప్పటి పరిస్థితులకు భయపడకుండా కుష్ఠరోగిని తాకి
స్వస్థత పరచారు. అయితే, “నీవు వెళ్లి అర్చకునకు కనిపింపుము. నీ స్వస్థతకు నిదర్శనముగా
మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించు కొనుము” (1:44) అని అతనితో చెప్పెను. తద్వారా,
తాను చట్టమును (ధర్మశాస్త్రము) నాశనం చేయక, వ్యతిరేకించక, దానిని పరిపూర్ణము
చేయడానికి వచ్చినారని స్పష్టమగుచున్నది.
రెండు విషయాలు మనం నేర్చుకోవచ్చు: మొదటిగా, మనం ఇతరులను
దూరమునుండి ప్రేమించడం సరిపోదు అని ప్రభువు బోధిస్తున్నారు. ఉదాహరణకు, మన తల్లిదండ్రులను,
వృద్దాశ్రమాలలో ఉంచి, ఎక్కడో ఉండి, ఎంత డబ్బు వెచ్చించినను, ఎంత వైద్యం చేయించినను,
ఎన్ని సదుపాయాలు కల్పించినను, అన్నింటికన్న ముఖ్యముగా వారి జీవితాలలో మన వ్యక్తిగత
ప్రేమేయం ఉన్నప్పుడే, దగ్గరగా ఉన్నప్పుడే, అది నిజమైన ప్రేమకు నిదర్శనం అవుతుంది.
రెండవదిగా, కుష్ఠరోగివలె విశ్వాసమును, ధైర్యమును కలిగి యుండాలి. చట్టం ప్రకారం, సమాజమునుండి
వెలివేయబడిన అతను దృఢవిశ్వాసముతో, ధైర్యముగా ప్రభువు ఎదుట మోకరించాడు. ‘మోకరించుట’
వినయానికి నిదర్శనం. వినయం అనే సుగుణం, మన పాపాలను తెలుసుకొనేలా చేస్తుంది. “నీకు
ఇష్టమగుచో నన్ను స్వస్థ పరప గలవు” (1:40) అని ప్రార్ధించాడు. ధర్మశాస్త్రం
చేయలేనిది, యేసు చేస్తారని భావించాడు. అతని ధైర్యాన్ని, విశ్వాసాన్ని చూసి, యేసు
జాలి పడ్డారు (1:41). “నాకు ఇష్టమే శుద్ధి పొందుము” (1:41) అని పలికారు.
నేడు మన చుట్టూ ఎంతోమంది ‘కుష్ఠరోగులు’ –
నిరాశ్రయులు, వికలాంగులు, బలహీన మనస్సు గలవారు, ఎయిడ్స్ బారిన పడ్డవారు, మానసిక
రోగులు, కరోన బారిన పడ్డవారు – యున్నారు. వారిపట్ల మన దృక్పధం ఏమిటి? వారిపై కరుణ,
ప్రేమ, అంగీకారం చూపగలగాలి. “మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై యుండుడు” (లూకా
6:36).
మనం కూడా అనేకవిధాలుగా ‘కుష్ఠరోగులమై’ యున్నామన్న
విషయం మరువరాదు! ‘కుష్ఠరోగము’ సమాజమునుండి దూరం చేసింది, కాని యేసు స్వస్థత
సమాజములో ప్రజలను తిరిగి ఐఖ్యపరచినది. నేడు మనలను మనమే ఇతరులనుండి వెలివేసు కుంటున్నాము,
కాని యేసు ప్రజలను ఒకతాటిపై నడిపించును. మన అంత:రంగిక కుష్ఠత్వమును స్వస్థత పరచమని
ప్రభువును వేడుకుందాం!
No comments:
Post a Comment