సామాన్య 1వ వారము - మంగళవారం (II)

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 1వ వారము - మంగళవారం
1 సమూ 1:9-20; మార్కు 1:21-28

ధ్యానాంశము:  అధికారపూర్వకమైన బోధన - దయ్యము పట్టిన వానికి స్వస్థత

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “అధికార పూర్వకముగా యేసు బోధించెను” (మార్కు 1:22).

ధ్యానము: యేసు విశ్రాంతి దినమున కఫర్నాములోని ప్రార్ధనా మందిరమున అధికార పూర్వకముగా బోధించారు. ఆయన బోధకు అచటనున్న వారు ఆశ్చర్యపడిరి. వారి ఆశ్చర్యానికి రెండు కారణాలను చూడవచ్చు: ఒకటి ఆయన అధికార పూర్వకమైన బోధనలను విని ఆశ్చర్యపడ్డారు. ధర్మశాస్త్ర బోధకుల మరియు యేసు బోధనల మధ్యనున్న బేధాన్ని గుర్తించారు. యేసు బోధనలు అధికార పూర్వకమైనవి, ఎందుకన, ఆయన దేవుడు, నిత్యజీవపు మాటలు కలవాడు. యోహాను 15:15లో “నేను నా తండ్రి వలన వినినదంతయు మీక విశదపరచితిని” అని చెప్పారు. యోహాను 17:4లో “నీవు నాకు అప్పగించిన పనిని పూర్తిచేసి, నిన్ను ఈ లోకమున మహిమ పరచితిని” అని తెలిపారు. యోహాను 16:28లో “నేను తండ్రి యొద్దనుండి బయలుదేరి లోకములోనికి వచ్చితిని. మరల నేను లోకమును విడచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను” అని పలికారు. తన అధికారము తండ్రి దేవునినుండి అర్ధమగుచున్నది. యేసు మెస్సయ్యగా తండ్రి దేవునిచేత ఈ లోకమునకు పంపబడి యున్నారు.

తన అధికారముతో బోధించడానికి కారణం, ఆయన పలుకులు హృదయము నుండి వచ్చినవి. ఎంతో మక్కువతో బోధించాడు. ఆత్మవిశ్వాసముతో బోధించాడు. ఆయన బోధనలను కార్యములలో ప్రదర్శించారు.

రెండవది, యేసు అపవిత్రాత్మను, తన అధికారపూర్వకమైన మాటలతో, “నోరు మూసికొని వీనినుండి వెడలి పొమ్ము” (మార్కు 1:25) అని గద్దించగా వదలి పోయెను. అది చూచి ఆచటివారు ఆశ్చర్యపడి, “ఇది యేమి? ఈ నూతన బోధ యేమి? అధికారముతో ఆజ్ఞాపించగా అపవిత్రాత్మలు సహితము ఈయనకు లోబడుచున్నవి!” (మార్కు 1:27) అని తమలో తాము గుసగుసలాడు కొనసాగిరి. ఆయన దయ, కరుణగలవారు, ప్రేమగలవారు  గనుక స్వస్థతను చేకూర్చారు. అపవిత్రాత్మలు క్రీస్తు శక్తికి లోబడ్డాయి, భయపడ్డాయి. క్రీస్తు తన వాక్కుతో, అపవిత్రాత్మల నోరు మూయించారు. యేసు దైవశక్తిని కలిగి యున్నారు. ఆయన వాక్కు శక్తిగలదని జ్ఞాపకం చేసుకుందాం.

నేడు ప్రార్ధనాలయములాంటి మన హృదయములో అధికారముతో మనకు బోధిస్తున్నారు. ఆయన మాటలను హృదయపూర్వకముగా ఆలకించు చున్నామా? ప్రస్తుత కాలములో ఎన్నో విధములైన ‘అపవిత్రాత్మలతో’, నిండియున్నాము, శోధింప బడుచున్నాము. స్వస్థపరచమని యేసు క్రీస్తును వేడుకుందాం.

No comments:

Post a Comment