శుక్రవారం, ఆగమన కాల రెండవ వారము (II)

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు

శుక్రవారం, ఆగమన కాల రెండవ వారము

యెషయా 48:17-19; మత్తయి 11:16-19

ధ్యానాంశము: యేసు విలాపము

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "దైవజ్ఞానము దాని క్రియలనుబట్టి నిరూపింపబడును" (11:19).

ధ్యానము: "ఈ తరము వారిని ఎవ్వరితో పోల్చెదను?" (11:16). ఈ వాక్యము ద్వారా, యేసు యూదుల చిన్న పిల్లల చేష్టలను ఖండిస్తున్నారు. వారిని మందలిస్తున్నారు. దేవుడు సాధ్యమైనవన్నీ యూదులకు చేశారు. అయినప్పటికినీ, వారు విశ్వసించడానికి, అంగీకరించడానికి, సహకరించడానికి నిరాకరించారు. 

యోహాను, యేసు వేరువేరు జీవితాలను గడిపారు. యోహాను పుట్టుకతోనే దేవునికి అంకితం గావింప బడ్డాడు. "ద్రాక్షారసముగాని, మద్యమునుగాని పానము చేయడు" (లూకా 1:15) అని దేవదూత చెప్పడం జరిగింది. తరువాత అతను కఠినమైన, సన్యాస జీవితాన్ని ఎడారిలో జీవించాడు. అతను అన్నపానీయములు పుచ్చుకొనక పోవుటచే, అతనికి దయ్యము పట్టినదని అతని విరోధులు భావించారు. 

యేసు అందరితో కలిసి సాధారణమైన జీవితాన్ని జీవించాడు. అందరి రబ్బీల (యూద బోధకులు) వలెనె ప్రజలతో మమేకమై జీవించాడు. అతను అన్నపానీయములు పుచ్చుకొనుటచే, అతడు భోజనప్రియుడు, మద్యపానరతుడు, సుంకరులకు, పాపాత్ములకు మిత్రుడు అని భావించారు. ఎలాంటి జీవిత విధానం కూడా వారిని సంతృప్తి పరచలేక పోయింది. దేవుడు వారికి చేసిన పురోగతిని తిరస్కరించారు. మొండి పట్టుదలతో, కఠిన హృదయులై ఉండిపోయారు. యేసును మెస్సయ్యగా గుర్తించలేక పోయారు, అంగీకరించలేక పోయారు. ఆయన బోధనలను అర్ధం చేసుకోలేక పోయారు.

అందుకే, పశ్చాత్తాప జీవితముద్వారా, దేవుని రక్షణను అంగీకరించని వారిని అంగడి వీధులలో కూర్చుండియున్న పసిపిల్లలతో పోల్చియున్నాడు. వారు కేవలం విమర్శనాత్మక పరిశీలకులుగా, ప్రేక్షకులుగా మాత్రమే ఉండిపోయారు.

మన తరం సంగతి ఏమిటి? పరిశుద్ధాత్మ మార్గాలకు మన హృదయాలు తెరచియున్నాయా? ప్రపంచములోను, శ్రీసభలోను దేవుని మార్గాలకు, మార్పులకు మనం సంసిద్ధులమై ఉన్నామా?  ఈ మార్పులద్వారా, దేవుని చిత్తాన్ని స్వాగతిస్తున్నామా? మనలో మార్పు ఎలా సంభవిస్తుంది? మొదటిగా, దేవుని కృపకొరకు వేడుకోవాలి. తరువాత, క్రీస్తు అను వ్యక్తితో మనం ప్రేమలో పడాలి. ఆయనతో ప్రేమలో పడితే, మనలో తప్పక మార్పు వస్తుంది. ప్రేమ మనలను మార్పు వైపునకు నడిపిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, లోకమంతా మారాలని అనుకుంటాము, కానీ నేను మారాలని అనుకోము. మన హృదయాలను తెరచి, క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవిద్దాం.

No comments:

Post a Comment