ఆగమన కాల రెండవ వారము - శనివారం (II)

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు

ఆగమన కాల రెండవ వారము - శనివారం

సీరా.  48:1-4, 9-11; మత్తయి 17:10-13

ధ్యానాంశము:  బప్తిస్త యోహానులో ఏలియా రాక

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “తప్పక ఏలియా మందుగా వచ్చి సమస్తమును చక్కదిద్దును... ఏలియా వచ్చియే యున్నాడు” (17:11-12).

ధ్యానము: నేటి పఠనాలు ముగ్గురు గొప్ప ప్రవక్తల గురించి తెలియజేయు చున్నాయి. వారే ఏలియా, బప్తిస్త యోహాను, ప్రవక్తలకు ప్రవక్తయైన మనుష్యకుమారుడగు యేసుక్రీస్తు. దేవుని గురించి, దేవుని గూర్చిన సత్యమును ప్రకటించుటకు వారు ఈ లోకమునకు పంపబడినారు. ప్రజలు వారి సందేశాన్ని వినడానికి నిరాకరించారు. వారిని విమర్శించారు, తిరస్కరించారు. వారికి జరగబోయే అవమానములు, ప్రమాదముల గురించి వారు ఎన్నడు భయపడలేదు. ఎందుకన, ప్రవక్తలు దేవుని వాక్కును నిర్భయముగా ప్రవచించేవారు. దేవుని సందేశమును ఎరిగించువారు (ద్వితీ. 18:18; యిర్మి. 1:9); ప్రవక్తలు దైవసేవకులు (జెక. 1:9) ప్రవక్తలు సత్యమునకు సాక్షమిచ్చువారు.

ఏలియా గొప్ప ప్రవక్త. అతను నిప్పు గుర్రములు లాగు అగ్నిరధ మొకటి అకస్మాత్తుగా ప్రవేశించగా, వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గమునకు కొనిపోయెను (2 రాజు. 2:11). ప్రభువు రాకను సంసిద్ధము చేయడానికి ఏలియా ముదుగా వచ్చునని మలాకీ ప్రవక్త ప్రవచించి యున్నాడు (3:1; మత్తయి 11:10; లూకా 7:27). “ఏలియా వచ్చియే యున్నాడు” (17:12) అని యేసు చెప్పిన మాటలు బప్తిస్త యోహానుని సూచిస్తూ పలికిన మాటలు. ఆవిధముగానే, బప్తిస్త యోహాను పశ్చాత్తాపము, మారుమనస్సు (హృదయ పరివర్తనము) సందేశముద్వారా మెస్సయ్య రాకకోసం ప్రజలను సిద్ధంచేసాడు. వాస్తవానికి, బప్తిస్త యోహాను, ఏలియా ప్రవక్త పాత్రను నెరవేర్చాడు.

అయితే, దురదృష్టవశాత్తు, ఈ విషయాన్ని ఆనాటి యూదులు గ్రహించలేక పోయారు. అందుకే, బప్తిస్త యోహానుపట్ల వారి ప్రతికూల వైఖరికి యేసు యూదమతాధికారులను ఖండించారు. బప్తిస్త యోహాను సందేశం వలన వారు అసౌకర్యానికి లోనవడము వలన వారు అతన్ని తిరస్కరించారు. పశ్చాత్తాపపడి, మారుమనస్సు పొందడానికి నిరాకరించారు.

హేరోదు యోహానును బంధించి, చెరసాలలో ఉంచి, అటుపిమ్మట, శిరచ్చేదనము గావించాడు (మత్తయి 14:1-12). ఏలియా ఆహాబు, యెసెబెలులచే హింసించబడ్డాడు (1 రాజు. 19:1-18). అందుకే, యేసుకూడా “మనుష్యకుమారుడును అట్లే వారి వలన శ్రమలు (సిలువ మరణం) పొందబోవు చున్నాడు” అని తన శిష్యులతో పలికారు.

యేసు జననం దగ్గర పడుచుండగా, మనలో మార్చుకోవలసినవి, పునరుద్ధరించుకోవలసినవి ఏమిటి? సరిచేసుకోవలసినవి ఏమిటి? 

No comments:

Post a Comment

Pages (150)1234 Next