దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు
గురువారం, ఆగమన కాల రెండవ వారము
యెషయా 41:13-20; మత్తయి 11:11-15
ధ్యానాంశము: యోహాను వినయము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "మానవులందరిలో స్నాపకుడగు యోహానుకంటే అధికుడగువాడు ఎవ్వడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (11:11).
ధ్యానము: ఇప్పటివరకు జన్మించిన వారిలో అధికుడు, గొప్పవాడని యేసు బప్తిస్మ యోహానును పొగడుచున్నారు. యేసు యోహానుకు ఇచ్చిన గొప్ప నివాళి. వెమ్మటే యేసు ఆశ్చర్యమును గొలిపే మాటలు పలికారు: "అయినను పరలోక రాజ్యమున అత్యల్పుడు అతనికంటే గొప్పవాడు" (11:11). ఈ మాటలకు అర్ధం బహుశా, సిలువపై దేవుని అత్యంత ప్రేమను యోహాను చూడలేక పోయియుండటం కావచ్చు! ఈ విషయములో మనం ఎంతో అదృష్ట వంతులము అని అర్ధమగుచున్నది! మనం సిలువలో దేవుని ప్రేమను లోతుగా చవిచూడ గలుగుచున్నాము. అంతమాత్రాన, మనం యోహానుకంటే మెరుగైన వారమని, గొప్పవారమని యేసు చెప్పడం లేదు. మన రక్షణ కొరకు దేవుని ప్రణాళికలో యోహాను తన వంతు పాత్రను వీరోచితముగా నెరవేర్చాడు. లోకరక్షకుడైన యేసును కలుసుకోవడానికి, తద్వారా తండ్రి దేవునితో బంధానికి, ఐక్యతకు మన హృదయాలను యోహాను సంసిద్ధం చేసాడు. మన హృదయ పరివర్తనకు, జీవన శైలిలో మార్పునకు, దేవునిపట్ల, తోటివారిపట్ల మన వైఖరిలో మార్పునకు పిలుపునిచ్చాడు. మన విశ్వాసాన్ని అనుదిన జీవితములో పాటించాలని, దానధర్మాలు చేయాలని, పేదవారిని ఆదరించాలని, నీతి, న్యాయములతో జీవించాలని బోధించాడు. యేసు కూడా మనలనుండి ఆశించేది ఇదియే కదా!
యోహాను వినయాన్ని మనం గుర్తించాలి. ఆచరించాలి. ప్రజలు తన బోధనలు ఆలకించడానికి వచ్చినప్పుడు తానే మెస్సయ్య అని చెప్పుకోలేదు. మెస్సయ్య పాదరక్షలు అయినను విప్పుటకు యోగ్యుడను కాను అని తన వినయాన్ని చాటుకున్నాడు. "వినయం" అనగా 'తననుతాను తగ్గించుకోవడం', 'గర్వం, అహంకారం లేకపోవడం', 'తనపైతాను ఆధారపడక, దేవునిపై ఆధారపడి యుండటం'. కోర్కెలను జయించడం. సాత్వికత, సమాధానము కలిగి ఉండటం. వినయాత్ములు దేవుని వాగ్ధానాలను గుర్తిస్తారు. వినయాత్ములు క్రీస్తు రక్షణను అనుభవిస్తారు. దేవుని రాజ్యం వారి హృదయాలలో పనిచేయడం గుర్తిస్తారు. వినయాత్ములు తమనుతాము తెలుసుకోగలరు. ఎవరికి చెందినవారేమో తెలిసికోగలరు. అలాగే, వారి పిలుపును తెలుసుకోగలరు.
యోహాను మెస్సయ్య మార్గాన్ని సిద్ధం చేసాడు. "ఇదిగో దేవుని గొర్రెపిల్ల" అని సూచించాడు. తన శిష్యులను యేసు శిష్యులుగా మార్చాడు. మనం కూడా యోహాను వంటి వినయాన్ని కలిగి జీవిద్దామా? యేసు చేత 'శభాష్' అని అనిపించుకుందామా?
No comments:
Post a Comment