ఆగమన కాల నాలుగవ వారము - మంగళవారం (II) 21.12

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
ఆగమన కాల నాలుగవ వారము - మంగళవారం
పరమ 2:8-14; లూకా 1:39-45

ధ్యానాంశము:  మరియమ్మ ఎలిశబేతమ్మను దర్శించుట

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. నీ గర్భ ఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను” (1:42-43).

ధ్యానము: తన చుట్టమగు ఎలిశబేతమ్మను మరియ సందర్శించుట గురించి నేటి సువార్తలో వింటున్నాము. ఎలిశబేతమ్మ ఎంతగానో సంతోషించినది, కృతజ్ఞురాలైనది. మరియ జెకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిశబేతమ్మకు వందన వచనము పలుకగానే, ఆ శుభవచనములు ఎలిశబేతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిశబేతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను: “స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. నీ గర్భ ఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను. ఆశీర్వదిమ్పబడుట (గ్రీకు – మకారియోస్) ‘సంతోషం’ ‘ధన్యత’ అని అర్ధం. ఈ సంతోషం నిర్మలమైనది, ప్రశాంతమైనది. మరియ ఆశీర్వదింపబడినది, ధన్యురాలు, ఎందుకనగా దేవుని కుమారుని తల్లి. మరియ ఎలిశబేతమ్మకు (ముసలి ప్రాయములో గర్భము దాల్చినది) సేవ, సహాయం చేయుటకు మాత్రమే వెళ్ళలేదు. అన్నింటికంటే ముఖ్యముగా, రక్షకుడైన యేసును పరిచయం చేయుటకు వెళ్ళినది. యేసు రాకతో ఎలిశబేతమ్మలోని భయం, ఆందోళనలు తొలగిపోయాయి.

మనం కూడా యేసును ఇతరులకు పరిచయం చేయాలి, తెలియజేయాలి. జ్ఞానస్నానము ద్వారా, దేవుని ప్రేషిత కార్యములో భాగస్థుల మవుచున్నాము. మన పిలుపును బట్టి, పవిత్ర జీవితముద్వారా, మనం సువార్తకు సాక్ష్యమిస్తూ ప్రకటించాలి.

మన పిలుపు సంతోషం కొరకు. మరియ గర్భములోని యేసు సాన్నిధ్యం ఎలిశబేతమ్మ గర్భములోని శిశువు గంతులు వేసేలా చేసింది. ఆయనను ఆలకించు వారిని, సంపూర్ణ సంతోషముతో నింపును.

దేవునియందు మన నమ్మకం ఉంచాలి. అన్ని సందర్భాలలో ముఖ్యంగా కష్టాలు, బాధల సమయములో ప్రభువునందు విశ్వాసం, నమ్మకం ఉంచాలి. క్రిస్మస్ అనగా దేవుడు మనలను సందర్శించడం. కనుక, ఆయనను స్వీకరించి, మన హృదయములో సంపూర్ణ ఆనందాన్ని, సంతోషాన్ని నింపుకుందాం!

No comments:

Post a Comment