దేవుని ప్రేమ
సందేశం:
అనుదిన ధ్యానాంశాలు (II)
ఆగమన కాల నాలుగవ
వారము
- సోమవారం
యెషయ 7:10-14; లూకా 1:26-38
ధ్యానాంశము: యేసు జననము – దూత ప్రకటన
ధ్యానమునకు
ఉపకరించు వాక్యములు: దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు” (1:37).
ధ్యానము: నేటి
సువార్తలో యేసు జనన ప్రకటన గురించి వింటున్నాము. ఇది లోకరక్షకుని జనన శుభవార్త!
పరమాత్ముడు మనతో ఉండుటకు పరమువీడి భువికి దిగివస్తున్నాడనే శుభవార్త! చీకటి
బ్రతుకులకు వెలుగును నింపే లోకరక్షకుని జనన శుభవార్త! మానవాళిని రక్షించుటకు మరియ కుమారుడు
ఉదయించునని ప్రకటించిన శుభవార్త! శాంతి సమాధానం మనకొసగుటకు ఇమ్మానుయేలుడై ఇలకు
దిగివచ్చు దేవుని జనన శుభవార్త! ఇదంతా దైవప్రేమకు గొప్ప నిదర్శనం!
మరియ ద్వారా దేవుడు చేయబోవు
గొప్ప రక్షణ కార్యము గురించి వింటున్నాము. రక్షకుని తల్లిగా మరియను ఎన్నుకోవడం
దేవుని ఎంపిక. దేవుని ఎంపిక మరియను యోగ్యురాలుగా చేసింది. దేవుని ప్రేమ, “అనుగ్రహ
పరిపూర్ణురాలు”ని చేసింది. ఇదే సత్యం “మరియ స్తోత్ర గీతము”లో చూడవచ్చు: “నా హృదయము
ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడగు దేవుని యందు నా యాత్మ ఆనందించుచున్నది.
ఏలయన, ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇకనుండి తరతరముల వారు నన్ను
ధన్యురాలని పిలిచెదరు” (లూకా 1:47-48). అందుకే నేటికి మనం మరియమ్మను ప్రత్యేకముగా
గౌరవిస్తున్నాము. స్త్రీలందరిలో ఆశీర్వదింప బడినవారు అని స్తుతిస్తున్నాము. మరియను
దేవుడు ఆమె కొరకుగాక, తన రక్షణ ప్రణాళిక నిమిత్తమై ఎన్నుకున్నాడు. మరియ జీవితం,
సేవ దేవునికి అంకితం గావింప బడినది. మరియలోని గొప్పతనం ఏమంటే, దేవుడు ఆమెను ఎంపిక
చేసుకున్నప్పుడు, “ఇదిగో నేను ప్రభువు దాసురాలను. నీ మాట చొప్పున నాకు జరుగును
గాక!” (లూకా 1:38) అని తన సమ్మతిని మనస్ఫూర్తిగా వెల్లడి చేసినది.
No comments:
Post a Comment