ఆగమన కాల నాలుగవ వారము - బుధవారం (II) 22.12

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
ఆగమన కాల నాలుగవ వారము - బుధవారం
1సమూ. 1:24-28; లూకా 1:46-56

ధ్యానాంశము:  మరియమ్మ స్తోత్ర గీతము

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడగు దేవుని యందు నా యాత్మ ఆనందించుచున్నది. ఏలయన, ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇకనుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు” (లూకా 1:47-48).

ధ్యానము: దేవునిపట్ల కలిగియున్న కృతజ్ఞతా భావానికి, వినయానికి, విశ్వాసానికి ప్రతీకయే, మరియమ్మ స్తోత్ర గీతము. “నీవెంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము. అప్పుడు ప్రభువు మన్ననను పొందుదువు” (సీరా. 3:18). మరియమ్మ స్తోత్ర గీతము ఒక ప్రార్ధన, కీర్తన. దేవుని ప్రేమను, దయను గూర్చి తెలియజేస్తుంది. ఇది మరియమ్మ గాధ. తన జీవితములో అనుభవించిన దానిని కృతజ్ఞతాపూర్వకముగా స్పష్టపరచినది: “దేవుడు తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను.” ఆమెను ధన్యురాలుని చేసాడు. ఎందువలన, ధన్యురాలు? ఆమె యేసును (ఇమ్మానుయేలు = దేవుడు మనతో ఉన్నాడు; దైవసాన్నిధ్యం; రక్షణ, ధన్యత) కలిగియున్నది. దేవునికి తల్లియైనది. యేసు గురించి ఆ తల్లికి తెలిసంతగా మరెవ్వరికి తెలియదు! ఇంతటి భాగ్యానికి, “నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడగు దేవునియందు నా యాత్మ ఆనదించుచున్నది” (లూకా 1;46-47) అని ఎన్నో వేలసార్లు ఆమె పెదవులు స్తుతించి యుంటాయి!

దేవుడు దీనులను, దీనావస్థలోనున్నవారిని దీవించును (లేవనెత్తును). “వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు” (మత్త. 5:5).

దేవుడు పేదవారిని అవసరతలోనున్నవారిని దీవించును. “పేదలగు మీరు ధన్యులు. దేవరాజ్యము మీది” (లూకా 6:20). బైబులులో దేవుడు ఎప్పుడుకూడా పేదవారి పక్షాన ఉన్నవాడు (పేదల పక్షపాతి! anavim of Yahweh = దేవుని పేదవారు). ఇతరులకన్న. పేదలకు ఎందుకింత ప్రాధాన్యత, ప్రత్యేక శ్రద్ధ దేవుడు చూపుచున్నారు. వారి అర్హత, యోగ్యత ఏమి? బహుశా, విముక్తి అత్యవసరమని పేదలకు తెలుసు; వారికి దేవునిపై, బలవంతులపై అధారపడటమేగాక, ఒకరిపై ఒకరు అధారపడటముకూడా తెలుసు; వారు తమ భద్రతను వస్తువులపైగాక, ప్రజలపై ఉంచెదరు; సహకారమునుండి ఎక్కువ ఆశిస్తారు. నిత్యావసరాలకు, విలాసాలకు మధ్య తేడాను చెప్పగలరు; పేదలకు సహనం ఎక్కువ; వారి భయాలు వాస్తవికమైనవి; సువార్త బోధించినప్పుడు, అది వారికి శుభవార్తలా వినిపిస్తుంది; సువార్త పిలుపునకు వారు పూర్ణ పరిత్యాగముతో స్పందించగలరు, దేనికైనా సిద్ధముగా ఉంటారు. దేవునిపట్ల భయభక్తులు గలవారు, దేవునిపై ఆధారపడువారు, ఆయన ఆజ్ఞలప్రకారం జీవించువారు నిజమైన పేదలు.

దేవుడు ఆకలితోనున్న వారిని ఆశీర్వదించును. “ఆకలిగొనియున్న మీరు ధన్యులు. మీరు సంతృప్తి పరపబడుదురు” (లూకా 6:21).

మన జీవితములో కూడా దేవుడు ఎన్నో మేలులు, అద్భుతాలు చేసాడు. ఎన్నో వరాలను ఒసగాడు. కనుక, ఎల్లప్పుడు ఆయనపట్ల కృతజ్ఞతా భావాన్ని (ప్రార్ధన) కలిగి ఉందాం. 

No comments:

Post a Comment