దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
ఆగమన కాల నాలుగవ వారము - గురువారం
మలా. 3:1-4; లూకా 1:57-66
ధ్యానాంశము: యోహాను జననము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “దేవుని హస్తము అతనికి తోడై ఉండెను” (లూకా 1:66).
ధ్యానము: ప్రసవ కాలము రాగానే ఎలిశబేతమ్మ కుమారుని కనెను. ఎనిమిదవనాడు ఆ శిశువునకు సున్నతి చేసిరి. బాలునికి ‘యోహాను’ అని పేరు పెట్టిరి. ఆ బాలుడు ఎట్టివాడగునో! అని అనుకొనిరి. దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. యూదులకు, అలాగే అనాధి కాలములో ఒక వ్యక్తి పేరు ఎంతో ముఖ్యమైనది. పేరు ఆ వ్యక్తి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, గుర్తింపును, తాను చేయవలసిన కార్యాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు, గబ్రియేలు దూత మరియ, యోసేపులతో బాలునికి “యేసు” అని పేరును సూచించినది (లూకా 1:31). “యేసు” అనగా ‘రక్షకుడు’ (పాపము, మరణము నుండి) అని అర్ధం.
ఎలిశబేతమ్మ అనగా ‘దేవుడు నా వాగ్దానం’ అని, జెకర్యా అనగా 'దేవుడు గుర్తుంచుకొనును’ అని అర్ధం. వీరి విషయములో కూడా ఇలాగే జరిగింది. ఇరుగు పొరుగువారు, బంధువులు, బిడ్డకు ‘జెకర్యా’ అని పేరు పెట్టాలని తలంచారు. కాని ఎలిశబేతమ్మ, జెకర్యాలు మాత్రము ‘యోహాను’ అని పేరుపెట్టాలని పట్టుబట్టారు. ఎందుకనగా, జెకర్యా దేవుని సన్నిధిలో యాజక విధిని నేరవేర్చుచుండగా, దేవుడు గబ్రియేలు దూతద్వారా యోహాను జనన సూచన గురించి తెలిపినప్పుడు, తన కుమారునికి ‘యోహాను’ అను పేరు పెట్టమని చెప్పడం జరిగింది (లూకా 1:13). యోహాను జన్మ అనేకులకు సంతోష కారణమగును. ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును. తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును. అనేకులను ప్రభువగు దేవునివైపు మరలించును. ఏలియా ఆత్మయును, శక్తియును కలవాడై ప్రభువునకు ముందుగా నడచును. తల్లిదండ్రులను, బిడ్డలను సమాధానపరచును. అవిధేయులను నీతిమంతుల మార్గమునకు మరల్చును. ప్రభువు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్తపరచును.
“యోహాను’ అనగా ‘దేవుడు దయామయుడు’ అని అర్ధం. దేవుడు నిజముగా దయకలవాడని, ఆయన కుమారుడైన యేసుద్వారా మనలను పాపమునుండి, మరణమునుండి రక్షించునని యోహాను ప్రకటించాడు. ‘యేసు’ మార్గమును సుగమం చేసాడు. ప్రజలను ఆయనవైపుకు నడిపించాడు. దేవుని ప్రణాలికను అక్షరాల నెరవేర్చాడు.
దేవుడు మనలను రక్షించుటకు తన కుమారున్ని ఈ లోకానికి పంపాడు. అలాగే, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడు. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను” (యోహాను 3:16). ఆ ప్రేమే ఆయన సిలువలో మనకోసం మరణించేలా చేసింది.
దేవుని దయ, ప్రేమకు మన సమాధానం ఏమిటి? మనం దేవునికి విధేయులమై జీవించాలి. ఆయన చిత్తమును ఎరిగి దాని ప్రకారం జీవించాలి. ఆయన వాక్కును విశ్వసించాలి. జెకర్యా దేవుని వాక్కును విశ్వసించనందు వలన మూగవాడైనాడు (లూకా 1:20). ‘యోహాను’ అని పేరు పెట్టిన తరువాత, మరల మాట్లాడ సాగాడు (లూకా 1:63-64). “దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడినవారికి, అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియును” (రోమీ 8:28) అని పౌలు తెలియజేసాడు.
No comments:
Post a Comment