ఆగమన కాల నాలుగవ వారము - శుక్రవారం (II) 24.12

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
ఆగమన కాల నాలుగవ వారము - శుక్రవారం
2 సమూ. 7:1-5, 8-12, 14, 16; లూకా 1:67-79

ధ్యానాంశము:  జెకర్యా ప్రవచనము

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “ప్రభువగు దేవుడు స్తుతింప బడునుగాక” (లూకా 1:68).

ధ్యానము: క్రిస్మస్ నవదినాలు నేటితో ముగుస్తాయి. రేపు క్రిస్మస్ పండుగ. ఈ దినాలలో దేవుని వాగ్దానాలు గూర్చి ధ్యానించాము. దేవుడు తాను చేసిన వాగ్దానాలకు విశ్వాసపాత్రుడు. వాటన్నింటిని నెరవేర్చాడు. అందుకే నేటి సువిషేశములో జెకర్యా, “ప్రభువగు యిస్రాయేలు దేవుడు స్తుతింప బడునుగాక! ఏలయన, ఆయన తన ప్రజలకు చేయూత నిచ్చి వారిని విముక్తులను చేసెను” అని ప్రవచించాడు. దేవుడు మనకు చేసిన కొన్ని వాగ్దానాలు: దేవుని సన్నిధి (హెబ్రీ. 13:5); దేవుని రక్షణ (ఆది. 15:1); దేవుని శక్తి (యెష. 41:10); దేవుని ఏర్పాటు (యెష. 41:10); దేవుని నడిపింపు (యోహాను 10:4); దేవుని ఉద్దేశాలు (యిర్మీ. 20:11); దేవుని విశ్రాంతి (మత్త. 11:28); దేవుని శుద్ధీకరణ (1 యోహాను 1:9); దేవుని మంచితనం (కీర్తన 84:11); దేవుని విశ్వసనీయత (1 సమూ. 12:22); దేవుని మార్గదర్శకత్వం (కీర్తన 25:9); దేవుని జ్ఞానముగల ప్రణాళిక (రోమా. 8:28).

జెకర్యా ప్రవచనంకూడా యిస్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన వాగ్దానం నెరవేరినందుకు దేవున్ని స్తుతిస్తుంది. అవిశ్వాసం వలన మూగవాడైన జెకర్యా, తనకు కుమారుడు జన్మించి ఎనిమిదవ దినమున, దేవుని వాగ్దానం ప్రకారం, ఆ బాలునికి 'యోహాను' అని పేరు పెట్టిన తరువాత, అతడు మరల మాట్లాడసాగాడు. పవిత్రాత్మపూర్ణుడై దేవుని స్తుతించాడు. జెకర్యా స్తుతికి కారణం: “ప్రవక్తల ద్వారా తెలియజేసిన వాగ్దానం ప్రకారం, మనలను శత్రువులనుండి రక్షించుటకు, మనలను ద్వేషించు వారినుండి రక్షించుటకు, తన సేవకుడగు దావీదు వంశమున మన కొరకు శక్తి సంపన్నుడైన రక్షకుని ఏర్పరచెను” (1:69-71). “ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింప చేసెను. శాంతి మార్గమున మనలను నడిపించుటకు, అంధకారములోను, మరణపు నీడలోను ఉన్నవారిపై దానిని ప్రసరింప చేయును” (1:78-79). ఇది స్పష్టముగా రక్షకుడైన యేసును సూచిస్తుంది. ఆయన మనలను క్షమించును, వెలుగుతో నింపును, రక్షణ ఒసగును. ఈవిధముగా, జెకర్యా ప్రవచనం క్రిస్మస్ మహోత్సవాన్ని చాటుతుంది. కనుక, జెకర్యా, దేవుని వాగ్దాలనుబట్టి, దేవుని రక్షణనుబట్టి, నిరీక్షణనుబట్టి దేవున్ని స్తుతిస్తున్నాడు.

జెకర్యా ప్రవచనం మన ప్రవచనం కావాలి. మనముకూడా దేవున్ని స్తుతించాలి. దేవుని స్తుతించుటకు మనకు ఎన్నో కారణాలున్నాయి!

No comments:

Post a Comment