దేవుని ప్రేమ
సందేశం:
అనుదిన ధ్యానాంశాలు (II)
ఆగమన కాల మూడవ
వారము
- శనివారం
యిర్మి. 23:5-8; మత్తయి 1:18-24
ధ్యానాంశము: యేసు క్రీస్తు పుట్టుక – నీతిమంతుడైన
యోసేపు
ధ్యానమునకు
ఉపకరించు వాక్యములు: “ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు ‘యేసు’ అను పేరు
పెట్టుము. ఏలయన, ఆయన, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఇదిగో కన్య గర్భము
ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ‘ఇమ్మానువేలు’ అని పిలిచెదరు”
(1:21-22).
ధ్యానము: నేటి
సువార్తలో యేసు క్రీస్తు పుట్టుక రీతిని గురించి, అనగా క్రిస్మస్ గాధను
వింటున్నాము. కాపురము చేయక మునుపే, మరియ గర్భము ధరించుట వలన, నీతిమంతుడైన ఆమె
భర్తయగు యోసేపు ఆమెను రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించాడు. అప్పుడు ప్రభువు దూత
కలలో కన్పించి, ఆమె పవిత్రాత్మ వలన గర్భము ధరించినదని, కనుక ఆమెను భార్యగా
స్వీకరించుటకు భయపడవలదు అని చెప్పెను. యోసేపు జీవితమును చూసిన యెడల, దేవుని ఎదుట
నీతిమంతులుగా ఉండటం అంటే ఏమిటో మనం అర్ధం చేసుకోవచ్చు. యూదులకు నీతిమంతులుగా
జీవించడం అనగా ధర్మశాస్త్రమును తు.చ. తప్పక (అక్షరాల) పాటించడం. మోషేద్వారా దేవుడు
ఒసగిన ధర్మశాస్త్రమును పాటించిన యెడల, దేవుని రాజ్యం సాకారం అవుతుందని పరిసయ్యులు
విశ్వసించారు, బోధించారు. యోసేపు ద్వారా, నీతిమంతుడు అనగా మంచివాడు, దేవునితో మంచి
అనుబంధం ఉన్నవాడు అని అర్ధమగుచున్నది. యోసేపు, ధర్మశాస్త్రం ప్రకారం, మరియను అధికారులకు
అప్పగింపవలసినది, వారు శిక్షగా ఆమెను రాళ్ళతో కొట్టవలసి యుండెను. అయితే, మరియను
అవమానింపక ఇష్టములేక, రహస్యముగా ఆమెను పరిత్యజించుటకు నిశ్చయించాడు. ఇందులకే
మత్తయి సువార్తీకుడు యోసేపును నీతిమంతుడు అని పిలిచాడు. నీతిమంతునిగా ఉండటం
అంటే మన పొరుగువారి అవసరాలను తెలుసుకొని సహాయం చేయడం; హృదయపూరకముగా పొరుగువారిని
ప్రేమించడం. ఇది నీతిమంతునిగా జీవించడానికి నూతన అర్ధం.
అలాగే, యోసేపు దేవుని
చిత్తాన్ని శిరసావహించాడు. ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు, యోసేపు మరియను భార్యగా స్వీకరించాడు.
పుట్టబోయే బిడ్డకు చట్టబద్ధమైన తండ్రిగా ఉండాలనే దేవుని చిత్తానికి, ప్రణాళికకు ‘అవును’
అని చెప్పాడు. ఆ బాధ్యతను అక్షరాల నెరవేర్చాడు; బిడ్డకు పేరు పెట్టాడు. సాకుడు
తండ్రిగా బిడ్డను అపాయములనుండి రక్షించాడు, పోషించాడు.
ఈ ఆగమన కాలములో పొరుగువారి
అవసరాలపట్ల మనం ఎంత శ్రద్ధను కలిగియున్నామోయని, అలాగే దేవుని చిత్తముపట్ల మన
విధేయతను పరిశీలించుకుందాం! దేవునికి విధేయత కలిగిన బిడ్డలుగా జీవించుటకు
యోసేపునుండి నేర్చుకుందాం!
No comments:
Post a Comment