దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు
ఆగమన కాల మూడవ వారము - గురువారం
యెషయ 54:1-10; లూకా 7:23-30
ధ్యానాంశము: యేసు నివాళి - బప్తిస్మ యోహాను వినయం
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "యోహాను ప్రవక్తకంటె గొప్పవాడు... ఇదిగో! నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును" (7:26-27)
ధ్యానము: తాను మెస్సయ్యనా కాదా అని యోహాను అడిగిన ప్రశ్నకు యేసు, యోహాను శిష్యులకు సమాధానమిచ్చి వారు తిరిగి వెళ్లిపోయిన తరువాత, యేసు జనసమూహముతో బప్తిస్మ యోహాను గురించి అద్భుతమైన సాక్ష్యమును ఇస్తున్నారు: అతను ప్రవక్తకంటె గొప్పవాడు; స్త్రీల సంతానంలో బప్తిస్మ యోహానుకంటే అధికుడు ఎవడును లేడు (7:26-27). ఈ సాక్ష్యమునకు ముఖ్య కారణం, యేసును 'దేవుని గొర్రెపిల్ల' అని వినయముగా గుర్తించి చూపిన మొదటి వ్యక్తి బప్తిస్మ యోహాను. "ఇదిగో! లోకపాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల... నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను" (యోహాను 1:29, 27) అని యోహాను యేసుకు గొప్ప సాక్ష్యమును యిచ్చియున్నాడు. ఇప్పుడు యేసు యోహానుకు గొప్ప నివాళిని అర్పిస్తున్నాడు. వారి ప్రేషితకార్యం, గమ్యం ఒకటే అయినా, ఒకరికొకరికి సన్నిహిత పరిచయం ఉన్నను, బంధువులు అయినను, యేసు నివాళికి, సాక్ష్యానికి ప్రధాన కారణం మాత్రం, బప్తిస్మ యోహాను వినయం. యోహాను జీవించిన విలువలు గుర్తించదగినవి. వాటిలో ప్రధానం అతని సంపూర్ణ వినయం.
యోహాను నిజమైన ప్రవక్త (పాత నిబంధన ప్రవక్తలలో చివరి ప్రవక్త). ఎలాంటి ఆడంబరము, విలాసము లేకుండా చాలా సాధారణమైన జీవితాన్ని జీవించాడు. తేనె, మిడతలను తిని జీవించేవాడు. భౌతిక జీవితముకన్న మించిన జీవితమున్నదని సాక్ష్యమిచ్చాడు. అతను పవిత్రమైన జీవితాన్ని జీవించాడు. నిజాయితీపరుడు. తన కర్తవ్యాన్ని తన బోధనలద్వారా నిర్మొహమాటముగా బోధించాడు.
యోహాను వేదసాక్షి. ధైర్యముగా దేవుని రాజ్యానికి సాక్ష్యమిచ్చాడు. తన జీవితాన్ని, బోధనలను అప్పటి శక్తులు వ్యతిరేకించినను ధైర్యముగా విలువలకొరకు నిలబడ్డాడు.
యోహాను దైవసందేశకుడు. యేసునకు పూర్వగామి (precursor). తాను క్రీస్తు కాదని స్పష్టం చేసాడు. క్రిస్మస్ పండుగకు సంసిద్ధతలోని హడావిడిలో పడిపోకముందే, క్రీస్తును ఆహ్వానించుటకు సిద్ధముగా ఉన్నామా? అని ఒకసారి ప్రశ్నించుకుందాం. ఆధ్యాత్మిక సంసిద్ధతపై ఎక్కువ ఆసక్తిని చూపుదాం.
No comments:
Post a Comment