దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు
ఆగమన కాల మూడవ వారము - బుధవారం
యెషయ 45:6-8, 18,21-25; లూకా 7:19-23
ధ్యానాంశము: విశ్వాసాన్ని దృఢపరచుకుందాం
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "నన్ను గురించి అభ్యంతర పడనివాడు ధన్యుడు" (7:23)
ధ్యానము: బప్తిస్మ యోహాను చెరసాలలో ఉండగా (మత్తయి 11:2-6 - from 'Q' Source), తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, 'రానున్నవాడవు నీవేనా? లేక మేము మరియొకని కొరకు నిరీక్షింప వలెనా?' అని అడుగుటకు వారిని యేసు ప్రభువు వద్దకు పంపాడు. మరియ గర్భములో ఉండగానే, ఎలిశబేతమ్మ గర్భములోనే గంతులు వేసిన శిశువు యోహాను (లూకా 1:44), యేసు మెస్సయానేనా అని అనుమానిస్తున్నాడా? ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. లేదా తన శిష్యుల విశ్వాసం కొరకై కూడా పంపియుండవచ్చు. ఎందుకన, అప్పుటికే యోహాను యేసు గురించి సాక్ష్యమిచ్చి యున్నాడు (యోహాను 1:15). యేసును లోకరక్షకునిగా,మెస్సయ్యగా, దేవుని గొర్రెపిల్లగా ప్రజలకు పరిచయం చేసాడు.
బప్తిస్మ యోహాను మనందరివలె సామాన్య మానవుడేనని మనం గుర్తించాలి. అప్పటికి అతను చెరసాలలో బంధీగావింప బడియున్నాడు. చెరసాలలో ఒంటరితనంతో నిరుత్సాహానికి, భయానికి లోకావడం సాధారణం! బహుశా! యోహాను మదిలో యెషయ ప్రవక్త ప్రవచనాలు మదిలోకి వచ్చి ఉంటాయి: "మిమ్ము కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు... అప్పుడు గ్రుడ్డివారు చూతురు. చెవిటివారు విందురు. కుంటివారు లేడివలె గంతులు వేయుదురు. మూగవారు సంతసముతో కేకలిడుదురు" (35:4-6; 61:1-3; లూకా 4:18). యోహానును సంతృప్తి పరచడానికి, మరల సందేహించకుండా ఉండటానికి, యెషయ ప్రవచనం, తన అద్భుత కార్యాల ద్వారా, నెరవేరిందని యేసు సూచించారు. ప్రజలు ఎదురు చూచుచున్న మెస్సయ్య ఆయనేనని స్పష్టముగా తెలియజేసారు. యేసు అద్భుత కార్యాలు దైవారాజ్యాన్ని, అలాగే ఆయనే మెస్సయ్య అని తెలియజేయుచున్నాయి.
క్రీస్తునందు మన విశ్వాసం బలముగా దృఢముగా ఉన్నదా? యోహానువలె మన సహజమైన, ఆరోగ్యకరమైన అనుమానాలను నివృత్తి చేసుకోవడములో తప్పులేదు. అలాంటి అనుమానాలను కొట్టివేయకూడదు, పాతిపెట్టకూడదు. అవి మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. మన విశ్వాసం గుడ్డిగా ఉండకూడదు; స్పష్టముగా, వివేచనతో ఉండాలి. మన విశ్వాస సంక్షోభాన్ని ఎదుర్కోగలగాలి.
పరిశుద్ధాత్మ దేవా, నాపైకి రండి! నా మనస్సును ప్రజ్వరిల్ల జేయండి! నీ వాక్కును నా హృదయములో నాటండి. యేసు ప్రభువా! నా హృదయాన్ని పాలించండి!
No comments:
Post a Comment