దేవుని ప్రేమ
సందేశం:
అనుదిన ధ్యానాంశాలు
ఆగమన కాల మూడవ
వారము
- సోమవారం
సంఖ్యా. 24:2-7,
15-17;
మత్తయి 21:23-27
ధ్యానాంశము: క్రీస్తు అధికారము
ధ్యానము: యేసుక్రీస్తు
యెరూషలేములోనికి వైభవోపేతముగా ప్రవేశం చేసారు. ప్రజలు విజయధ్వానములతో ఆయనను ఆహ్వానించారు.
అటుపిమ్మట దేవాలయములో ప్రవేశించి క్రయవిక్రయములను చేయువారిని వెడలగొట్టారు. అచట
ఎంతోమంది పాపములను క్షమించి స్వస్థపరచారు. ధర్మశాస్త్రమును గూర్చి బోధించారు.
సహజముగానే, దేవాలయ పెద్దలు, ప్రధానార్చకులు అసహనానికి గురయ్యారు. క్రీస్తు బోధనలు
విని, అద్భుతకార్యాలు చూసి భయపడ్డారు. అందుకే, వారు క్రీస్తు అధికారమును (బోధనలు,
అత్భుతములు) ప్రశ్నించారు. ఎందుకన, క్రీస్తును మెస్సయ్యగా, రక్షకునిగా వారు అంగీకరించలేదు,
విశ్వసించలేదు. అతనిని, అతని ప్రేషిత కార్యమును ఇరకాటములో, ఇబ్బందిలో పడవేయాలని భావించారు.
కాని ప్రభువు చాలా తెలివిగా, చాకచక్యముతో (ఎందుకన, వారి మనసులలో ఏమున్నదో ఆయనకు
తెలుసు!) సమాధానముగా వారికే, “యోహాను బప్తిస్మము ఎచట నుండి వచ్చినది? పరలోకము
నుండియా? లేక మానవుని నుండియా?” అని తిరుగ ప్రశ్నవేసి వారినే ఇరకాటములో పెట్టారు.
ఇబ్బందితో, భయముతో, ‘అది మాకు తెలియదు’ అని సమాధానమిచ్చారు. అందుకే, యేసు, “అట్లయిన,
ఏ అధికారముతో ఈ పనులు చేయు చుంటినో నేనును చెప్పను” అని పలికారు.
యేసు
వారికి నిజం చెప్పినను, వారు విశ్వసించేవారు కాదు. పునీత జాన్ క్రిసోస్తం వారి
మాటలలో, “క్రీస్తు వారికి నిజం చెప్పినప్పటికీ, దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండేదికాదు, ఎందుకంటే చీకటిలో
నున్నవారు వెలుగులోనున్నవాటిని గ్రహించలేరు. నిజం తెలుసుకోవాలనే ఆసక్తి, తపన
ఉన్నవారికి మనం తప్పక ఉపదేశించాలి; కాని మనలను పరీక్షింపగోరువారికి పరమ రహస్యములను గురించి వెల్లడించకూడదు.
క్రీస్తు
అధికారము తండ్రి దేవునినుండి వచ్చినది. ఆయన దైవకుమారుడు. తండ్రి దేవుని చిత్తమును నెరవేర్చుటకు క్రీస్తు వచ్చెను (యోహాను 6:38). ఆయన
బోధనలు విలువలతో కూడినవి; ఆయన జీవించి మనకు ఆదర్శాన్ని చూపారు, అందుకే ఆయన బోధనలు
అధికారముతో కూడియున్నవి.
క్రీస్తు
అధికారములో మనం భాగస్తులం, కనుక మనం కూడా ప్రభువువలె చాకచక్యముగా ఉండాలి. సువార్త
విలువలతో జీవిద్దాం. జీవించినదానినే ఇతరులకు బోధిద్దాం. దానికై పవిత్రాత్మ వరము
కొరకు ప్రార్ధన చేద్దాం.
Good
ReplyDelete