క్రిస్మస్ 1వ వారము - బుధవారం (II) 29.12

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
క్రిస్మస్ 1వ వారము - బుధవారం
1 యోహాను 2:3-11; లూకా 2:22-35

ధ్యానాంశము: యెరూషేలేము దేవాలయములో బాలయేసు సమర్పణ

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులార గాంచితిని. అది అన్యులకు ఎరుకపరచు వెలుగు; నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు” (లూకా 2:30-32) అని సిమియోను దేవుని స్తుతించెను.

ధ్యానము: ఇచ్చట రెండు విషయాలను ధ్యానించాలి: ఒకటి మరియ, యోసేపులు ప్రతీది ధర్మశాస్త్రము ప్రకారం నెరవేర్చటం, మోషే చట్టమునకు విధేయులై యుండుట (లూకా 1:22, 24), ఆచార విధులు నిర్వర్తించుట (2:27). శుద్ధిగావింపబడు దినములు కనుక, యేసు జన్మించన 40 దినముల తరువాత, మరియ, యోసేపులు యెరూషేలేము దేవాలయమునకు వచ్చి, జత గువ్వలనైనను, రెండు పావురముల పిల్లలనైనను సమర్పణ చేయుటకు వచ్చిరి. శుద్ధిగావించుటకు వాటిని పూజారిద్వారా దేవునకు సమర్పించేవారు. రెండవదిగా, తొలిచూలు బిడ్డను దేవాలయములో సమర్పించాలనేది మోషే చట్టం (నిర్గమ 13:2, 12). సర్వం దేవునిదే అన్న దానికి సూచన! సమర్పించిన తరువాత, కొంత డబ్బుతోను, నిర్దిష్ట త్యాగాలతోను ఆ బిడ్డను విడిపించు కొనేవారు.

రెండు, సిమియోను అను నీతిమంతుడు, దైవభక్తుడు పలికిన పలుకులు: “ఇదిగో! ఈ బాలుడు యిస్రాయేలీయులలో అనేకుల పతనమునకు, ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి యున్నాడు. అనేకుల మనోగత భావములను బయలు పరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొని పోనున్నది” (2:34-35). సిమియోను యిస్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. క్రీస్తును చూచువరకు మరణింపడని పవిత్రాత్మ తెలియజేసెను. నిత్యమూ దేవాలయములో ప్రార్ధనలు చేసాడు. రక్షకుని రాకకొరకు ఎదురుచూశాడు. నిరాశ చెందలేదు. కష్టాలను, అవమానాలను లెక్కచేయలేదు. ఆ సమయం రాగానే, బాలయేసును హస్తములలోనికి తీసికొని దేవుని స్తుతించాడు, తిరు కుటుంబమును ఆశీర్వదించాడు. దేవుని వాగ్దానములను విశ్వసించుట వలన, అతడు రక్షకుడిని గాంచగలిగాడు. విశ్వాసమునకు, నిరీక్షణకు గొప్ప నిదర్శనం సిమియోను. అలాగే, బాలుని భవితవ్యమును గురించి ప్రవచించాడు.

సిమియోనువలె విశ్వాసముతో, నిరీక్షణతో ప్రార్ధన చేయాలి. రక్షకుడైన యేసును గుర్తించాలి; దేవునికి స్తుతులు చెల్లించాలి. తన కోసం ఎదురుచూచు వారిని దేవుడు నిరాశపరచడు; సిమియోనువలె మనం కూడా దేవుని కోసం ఓర్పుతో ఎదురుచూద్దాం!

నేటి పునీతుడు: పునీత తోమాసు బకెట్ (అగ్రపీఠాధిపతి)

క్రీ.శ. 21 డిశంబరు 1118న లండనులో జన్మించారు. న్యాయవిధ్యను పూర్తిచేసారు. తన 36వ యేట తోమాసు ప్రధాన డీకనుగా నున్నప్పుడు, తన స్నేహితుడు 2వ హెన్రి రాజు తనను ఇంగ్లండు దేశానికి ఛాన్సలరుగా నియమించాడు. 

1162 మే నెలలో అభిషిక్తులై, కాంటరుబరికి అగ్ర పీఠాధిపతులుగా నియమింప బడినారు. వెంటనే ఛాన్సలరు పదవికి రాజీనామా చేసారు. అప్పుడే అతనికి కష్టాలు ఆరంభమయ్యాయి. హెన్రి శ్రీసభ హక్కులను లాక్కోవాలని చూసాడు. ఆధ్యాత్మిక పాలనలో అండదండగా ఉండొచ్చుగాని, జోక్యం చేసుకోకూడదని తోమాసుగారు హెన్రి రాజును హెచ్చరించారు. ఆధ్యాత్మిక విషయములో పీఠాభివృద్ధికి ఎంతగానో కృషి చేసాడు. అనేక విషయాలలో తోమాసుగారు హెన్రి రాజుకు విరుద్ధముగా వెళ్ళడముతో, రాజు బెదిరింపుతో ఫ్రాన్సు దేశానికి పారిపోవాల్సి వచ్చినది. సేన్సు పట్టణములోని పునీత కొలుంబ మఠాలయములో ఆశ్రయం పొందాడు. 

ఫ్రాన్సు చక్రవర్తి 7వ లూయిసు కృషివలన తోమాసు, హెన్రిల మధ్యన రాజీ కుదరటంతో 1170లో ఇంగ్లండు దేశానికి తిరిగి రావడం జరిగింది. అయితే నెల రోజులకే హెన్రి తన సైనికులతో తోమాసు వారిని చుట్టుముట్టించి 29 డిసెంబరు 1170న చంపించాడు. శ్రీసభ చట్టానికి విధేయించడమే ఏకైక మార్గముగా ఎంచుకొని, అందునిమిత్తమై తన ప్రాణాలను సైతం అర్పించాడు. 

తోమాసు వారిని వేదసాక్షిగా శ్రీసభ గుర్తించింది. కేవలం రెండు సంవత్సరములలో, 1173లో 3వ అలెగ్జాండరు పోపుగారు ఆయనను పునీతునిగా ప్రకటించారు. మరుసటి సంవత్సరమే హెన్రి రాజు బహిరంగముగా తన పశ్చాత్తాపాన్ని ప్రకటించి శ్రీసభకు తన విధేయతను చాటుకున్నాడు.

కష్టాలు లేకుండా ఎవరు పునీతులు కాలేరు. సత్యం, ధర్మం కొరకు నిలబడినప్పుడు, ప్రాణాలను సైతం కోల్పోవలసి యుంటుందని తోమాసు బకెట్ గారు ముందుగానే ఎరిగియున్నారు. మనంకూడా నేటి ఒత్తిళ్ళ మధ్యలో, అనైతికత, మోసం, విధ్వసం మొ.గు వాటికి వ్యతిరేకముగా నిలబడదాం.

No comments:

Post a Comment