దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
క్రిస్మస్ 2వ వారము - మంగళవారం
1 యోహాను 4:7-10; మార్కు 6:34-44
ధ్యానాంశము: ఐదు వేల మందికి ఆహారము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “కాపరి
లేని గొర్రెల వలె నున్న వారిపై కనికరము కలిగి, వారికి అనేక విషయములను బోధించెను” (మార్కు 6:34).
ధ్యానము:
యేసు ఐదు రొట్టెలు, రెండు చేపలను ఆశీర్వదించి అందరికి వడ్డింపుడు అని ఆదేశించారు.
అందరు సంతృప్తిగా భుజించిన పిదప శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను, చేప ముక్కలను
ప్రోవుచేసి పండ్రెండు గంపలకు నింపిరి. భుజించినవారు ఐదువేల మంది పురుషులు.
నీవు ఈ అద్భుతమును విశ్వసించు చున్నావా? నాలుగు
సువార్తలలో పునరావృతమయిన యేసు చేసిన ఏకైక అద్భుతం ఇదేనని మనందరికీ తెలుసు! జనసమూహము
దేవుని వాక్కుకై ఆకలి గొనిరి. కాపరి లేని గొర్రెల వలె నున్న వారిపై కనికరము కలిగి,
వారికి అనేక విషయములను బోధించెను (ఆధ్యాత్మిక పోషణ). బోధన ముగిసిన తరువాత, చాలా
ప్రొద్దు పోయినదని, వారిని పంపివేయుడని శిష్యులు యేసుకు విన్నవించిరి. కాని యేసు ఐదు
రొట్టెలు, రెండు చేపలతో అక్కడనున్న వారందరి ఆకలి తీర్చారు (శారీరక పోషణ).
ఈ అద్భుతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? దేవుని దయకు,
ఉదారస్వభావానికి, కనికరమునకు గొప్ప నిదర్శనం (ఎడారిలో తన ప్రజలకు మన్నాను
కురిపించాడు; కానా పెళ్ళిలో నీటిని ద్రాక్షరసముగా మార్చాడు; సమరీయ స్త్రీకి
జీవజలమును వాగ్దానం చేసాడు;). మనకు అవసరమైన దానికంటే ఎక్కువగానే దేవుడు మనకు
ఒసగుతాడు; అయితే, మనం మిగిలిన దానిని దాచుకొనక, కూడబెట్టుకొనక ఇతరులతో పంచుకోవాలని
దేవుని అభిలాష. అలాగే, దేవుడు మన దగ్గర ఉన్న కొద్దిపాటిని తీసుకొని అందరికి మేలు
చేస్తాడు. మనకున్న దానిని ఇతరులతో పంచుకున్నప్పుడు, నిజమైన అద్భుతం జరుగుతుంది.
యేసుకు వారిపై కలిగిన కనికరము కేవలం ఒక వారిపట్ల జాలిపడటం మాత్రమే కాదు, ఆ కనికరం
కార్యాచరనలోనికి మారింది. “దయ” కు నిజమైన అర్ధం ‘ఇతరులతో బాధననుభవించడం’.
యేసువలె అద్భుతాలు చేయలేకున్నను, మనంకూడా కనికరము,
దయ, దాతృత్వము, ఇతరులతో పంచుకోవడం అనే సుగుణాలను అలవర్చుకోవాలి. శిష్యులు
తప్పించుకోవాలని చూసారు! మనకెందుకు శ్రమ, రిస్కు అని భావించారు. అయితే, తను చేసిన
అద్భుతములో తన శిష్యులను కూడా భాగస్థులను చేసారు. మనం కూడా భాగస్థులం కావాలంటే, మన
సముఖత, దాతృత్వం ప్రభువుకు కావాలి.
నేడు మన చుట్టూ ఎన్నో సమస్యలున్నాయి. ప్రార్ధనతో పాటు చేయూతనివ్వాలి. ఈ అద్భుతమునుండి ప్రభువు నేర్పుచున్నది ఇదియే!
యేసు చేసిన ఈ అద్భుతం దివ్యబలిపూజను (రొట్టెను తీసుకొని ఆశీర్వదించి, పంచడం) జ్ఞప్తికి చేస్తుంది. అప్పము, ద్రాక్షారములను తన శరీరరక్తములుగా మార్చి మన ఆత్మశరీరములను పోషిస్తున్నారు. దివ్యసత్ప్రసాదం ఆత్మీయ భోజనం. మన ఆధ్యాత్మిక పోషణకు ఇది ఎంతో అవసరము. దివ్యసత్ప్రసాదమును లోకునుచున్న మనం ఇతరులతో క్రీస్తు వాక్కును, ప్రేమను పంచుకోవాలి.
No comments:
Post a Comment