క్రిస్మస్ 1వ వారము - శుక్రవారం (II)

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
క్రిస్మస్ 1వ వారము - శుక్రవారం
1 యోహాను 2:18-21; యోహాను 1:1-18

ధ్యానాంశము: క్రీస్తు – వాక్కు, జీవము, వెలుగు

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "ఆదిలో వాక్కు ఉండెను. ఆ వాక్కు దేవునితో ఉండెను. ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయనందు జీవము ఉండెను. ఆ జీవము మానవులకు వెలుగాయెను" (యోహాను 1:1,4).

ధ్యానము: 2021కి చివరి రోజు. ఈ సంవత్సరం ఎన్నో ఇబ్బందులు పడినను, మనం సంతోషముగా, సురక్షితముగా జీవించియున్నాము. దేవునకు కృతజ్ఞతలు తెలుపుదాం. నేటి సువిషేశములో, సువార్తీకుడైన యోహాను, క్రీస్తును మనకు పరిచయం చేయుచున్నాడు.

మొదటిగా, యోహాను క్రీస్తును “వాక్కు”గా (హీబ్రూ 'దాబర్'; గ్రీకు 'లోగోస్') మనకు పరిచయం చేయుచున్నాడు: “ఆదిలో వాక్కు ఉండెను. ఆ వాక్కు ఆదినుండి దేవునితో ఉండెను. ఆ వాక్కు దేవుడై ఉండెను (1:1, 2; చదువుము: యోహాను 17:5). క్రీస్తు ఈ లోకమునకు చెందినవాడు కాదు; శాశ్వతముగా, సృష్టి ఆరంభమునకు పూర్వమే దేవునితో ఉన్నాడు. అందుకే, యేసు "నేను నా తండ్రియొద్ద చూచిన విషయమును" (8:38), "నేను ఆయనను ఎరుగుదును" (8:55) అని చెప్పగలిగాడు. అందుకే, "వాక్కు మూలమున దేవుడు సమస్తమును సృజించెను. ఆయన లేకుండ సృష్టిలో ఏదియు చేయబడలేదు" (1:3). క్రీస్తు దేవుడు (1:1, 18; యోహాను 20:28). క్రీస్తు దేవుని కుమారుడు (1:14, 18; 3:16).

"ఆ వాక్కు మానవుడై (శరీరధారియై) మనమధ్య నివసించెను (1:14). ఎందుకన, "దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను" (3:16). దేవుడు తన 'వాక్కు'తో లోకమును సృష్టించాడు (ఆది 1); దేవుడు తనను, తన రాజ్యమును బహిర్గత మొనర్చుటకు "వాక్కు"ను మన మధ్యకు పంపెను. "నివసించుట" అనగా 'గుడారము'ను ఏర్పరచుకొనుట; దేవునికి-మానవునికి మధ్యనున్న "అగాధము" (లూకా 16:26) తొలగించబడింది. నిర్గమ 25-26 ప్రకారం, 'గుడారము' దేవుని సాన్నిధ్యానికి, యెరూషలేము దేవాలయానికి చిహ్నం. ఒకప్పుడు, గుడారము, దేవాలయములో వారి మధ్య నివసించిన దేవుడు, ఇప్పుడు శరీరధారియై మన మధ్య నివసించెను. క్రీస్తు శరీరము, గుడారాన్ని, దేవాలయాన్ని భర్తీ చేస్తుంది. "ఈ ఆలయమును మీరు పడగొట్టుడు. నేను దీనిని మూడు రోజులలో లేపుదును... వాస్తవముగ ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గురించియే" (3:19-21).

"ఆయన మహిమను చూచితిమి" (1:14). దేవుడు మోషేతో, "నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడు నన్ను చూచి బ్రతక జాలడు" (నిర్గమ 33:20; 1:18). అయినప్పటికిని, మనం క్రీస్తు మహిమను చూడగలిగే భాగ్యాన్ని పొందాము. "నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు" (14:9) అని యేసు పలికెను. లోక ఆరంభమునకు పూర్వమే యేసు తండ్రి దేవునితో మహిమ కలిగి యుండెను (17:5). లోకమున యేసు చేసిన కార్యాలు, (తన) దేవుని మహిమను వెల్లడి చేసాయి (2:11; 11:4, 40). తన మరణం తన 'మహిమ'గా పలికియున్నాడు (12:23; చూడుము. 7;39; 13:31; 14:13; 17:4, 10). 

ఆయన మహిమ "కృపా సత్యములతో నిండినది". 'కృప' అనగా దేవుని దయ, ప్రేమ, విశ్వసనీయత. దేవుడు మనకొసగిన గొప్ప వరం - "వాక్కు" ఏకైక కుమారుడు, కృపతో నిండియుండెను. "సర్వ మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యెను" (తీతు 2:11). 'సత్యము' అనగా వాస్తవం, అసత్యముతో కలుషితం కానిది. "మీరు నా మాటపై నిలిచి యున్నచో... మీరు సత్యమును గ్రహించెదరు. సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును" (8"31-32). మోషే ద్వారా ధర్మశాస్త్రము కాని, "యేసు క్రీస్తు ద్వారా వచ్చినవి కృపాసత్యములు" (1:17). ఇదే ఆయన పరిపూర్ణత. 17వ వచనం, ఇప్పటివరకు చెప్పబడిన "వాక్కు", యేసుక్రీస్తు అని వెల్లడి చేసింది.

రెండవదిగా, క్రీస్తును “జీవము”గా మనకు పరిచయం చేయుచున్నాడు: “ఆయన యందు జీవము ఉండెను” (1:4). మనకు జీవము ఒసగుటకు జీవముగా ఆయన ఈ లోకమునకు వచ్చెను. మానవ రూపములో భువికి ఏతెంచి, మనలను పాపదాస్యమునుండి విముక్తిగావించెను. "జీవము" అనగా 'నిత్యజీవము', 'రక్షణ' అని అర్ధము. 3:16 ప్రకారం, ఆయనను విశ్వసించు వారికి "నిత్యజీవము" ఒసగును. "కుమారుడు తనకు ఇష్టమైన వారిని "సజీవులను" చేయును (5:21, 24; 6:40).

మూడవదిగా, యోహాను క్రీస్తును “వెలుగు”గా మనకు పరిచయం చేయుచున్నాడు: “ఆ జీవము మానవులకు వెలుగాయెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. చీకటి దానిని అధిగమించలేదు. అదియే నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు ('కోస్మోస్') వచ్చి ప్రతి మానవునకు (ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమేగాక, సర్వమానవాళికి) వెలుతురును ఇచ్చుచున్నది” (1:4-5,9). లోకము ('కోస్మోస్') అనగా 'దేవునిపై తిరుగుపాటుచేయు లోకం, చీకటి లోకం. క్రీస్తు జగతికి జ్యోతి. “లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును” (యోహాను 8:12) అని, "ఈ లోకమున నేను ఉన్నంత కాలము నేను లోకమునకు వెలుగును" (9:5) అని యేసు పలికెను. వెలుగునకు చీకటికి మధ్యన పోరాటాన్ని 3:19-21; 12:35లో చూడవచ్చు. 'వెలుగు' అనగా దేవుని చిత్తానుసారము చేయు సత్క్రియలు, మంచి, క్రమం, భద్రత, సంతోషము, సత్యము, జీవము, రక్షణ. 'చీకటి' అనగా మానవుల దుష్క్రియలు, చెడు, అసత్యం, మరణం, దండన. 

చీకటిలో జీవించడం అనగా "వాక్కు"ను అంగీకరించక పోవడం. “ఆయనను అంగీకరించి, విశ్వసించిన వారందరికి ఆయన దేవుని బిడ్డలగు (దేవుని కుటుంబము) భాగ్యమును ప్రసాదించెను” (1:12). "నిత్యజీవము"ను ఒసగును (3:16). ఇది దేవుని వలన కలిగిన  వరము, అనుగ్రహము. దైవకార్యం. ఇది వంశపారపర్యము (రక్తము వలన) కాదు. దేవునియందు విశ్వాసము వలన పొందు కృపానుగ్రహము (1:13). "మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడు... ఒకడు నీటివలన, ఆత్మవలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు" (3:3, 5).

నూతన సంవత్సరమంతయు క్రీస్తు వాక్కులో, జీవములో, వెలుగులో నడచుటకు, జీవించుటకు ప్రయాసపడుదాం! దానికి పవిత్రాత్మ వరము కొరకు ప్రార్ధన చేద్దాం!

No comments:

Post a Comment